AP Fake Liquor Racket: అన్నమయ్య జిల్లా ములకలచెరువులో ఎక్సైజ్ పోలీసులు భారీ నకిలీ మద్యం రాకెట్ గుట్టురట్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుల కోసం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కీలక వ్యక్తి పాత్రపై ఆరా తీస్తున్నారు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్‌ను అక్టోబర్ 3న కడప జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే.
నకిలీ మద్యం రాకెట్ పై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ బిగ్ టీతో మాట్లాడారు. ఈనెల 3న ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారం, ఆదేశాల మేరకు ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రంపై తనిఖీలు చేశామన్నారు. మద్యం డెన్ కు సంబంధించిన సమాచారం వచ్చిందని, పూర్తి సమాచారం సేకరించిన తర్వాత మూడో తేదీ రాత్రి దాడులు చేపట్టామన్నారు.
‘షెడ్లో మినీ డిస్ట్రిలేషన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. స్పిరిట్ బయటి నుంచి తెచ్చుకుని ఇతర పదార్థాలు కలిపి మద్యం తయారీ చేస్తున్నారు. మద్యం తయారు చేయడానికి, బాటిలింగ్, ప్యాకింగ్ చేయడానికి యంత్రాలు ఉన్నాయి. డూప్లికేట్ లేబుళ్లు, బాక్సింగ్, స్టిక్కరింగ్ చేయడం గుర్తించాం. దాడి చేసిన సమయంలో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన ముడి సరుకు, తయారు చేస్తున్న మనుషులు అక్కడే ఉన్నారు’ అని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ తెలిపారు.
నకిలీ మద్యం తయారీలో స్పిరిట్, డిస్టిల్ వాటర్, క్యారా మిల్ వాడారని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ తెలిపారు. నకిలీ మద్యం తయారీలో మరో నలుగురు దొరకాల్సి ఉందని, అసలు నేరస్తుడు దొరికితే నకిలీ మద్యం ఎలా చేస్తున్నారో, ఎక్కడికి సరఫరా చేస్తున్నారో తెలుస్తుందన్నారు. నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్ రావు, ఏ2 కట్టా రాజును
అరెస్టు చేయాల్సి ఉందన్నారు.
‘రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఇంకా ఇలాంటి డెన్ లతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నాం. కట్టా సురేంద్ర నాయుడును విచారించి కొంత సమాచారం సేకరించారు. రాజేష్, సురేంద్ర నాయుడు మద్యం షాపుల లైసెన్సులు రద్దు చేశాం. ఆ షాపుల్లో ఈ నకిలీ మద్యం దొరకలేదు. మూడు పాపులర్ బ్రాండ్లనే నకిలీవి తయారు చేశారు. ఎంత మేర నకిలీ మద్యం తయారు చేశారో, ఎంత విక్రయించారో అసలు నేరస్తులు దొరికే వరకు నిర్ధారించలేము’ – ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్
Also Read: Kakinada District: యముడు లీవ్‌లో ఉన్నాడు.. లారీ గుద్దినా బతికిపోయాడు, ఇదిగో వీడియో
కోటీ 70 లక్షల మేర నకిలీ మద్యం దొరికిందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ తెలిపారు. నకిలీ మద్యాన్ని చుట్టు పక్కల ప్రాంతాల్లో విక్రయించినట్లు సమాచారం ఉందన్నారు. 14 మంది నిందితులను గుర్తించామన్నారు. ఇప్పటికే 10 మందిని అరెస్టు చేశామని చెప్పారు. నలుగురు పరారీలో ఉన్నారన్నారు. విచారణలో మరికొంత మంది నిందితులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కూలీలకు డబ్బులు ఇవ్వడం, జీతాలు ఇవ్వడం అంతా జనార్థన్ రావు, కట్టా రాజు ఇద్దరే నిర్వహించారన్నారు.