Gandikota Murder Case: కడప జిల్లాలోని గండికోట ప్రాంతంలో.. కొన్ని నెలల క్రితం చోటుచేసుకున్న మైనర్ బాలిక హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరింది. ఈ కేసులో నిందితులుగా గుర్తించిన ముగ్గురిపై.. పోలీసు అధికారులు పాలిగ్రాఫ్ పరీక్షలు ప్రారంభించారు. ఆదివారం రాత్రి అనుమానితులను హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్ (Forensic Science Laboratory) కు తరలించి టెస్టు ప్రక్రియ ప్రారంభించారు.
కుటుంబ సభ్యులే అనుమానితుల జాబితాలో
ఈ కేసులో ప్రధాన అనుమానితులుగా ఉన్న వారు.. బాలిక సోదరులు కొండయ్య, సురేంద్ర, అలాగే ఆమె ప్రియుడు లోకేష్. పోలీసులు వీరిపై గత కొన్ని వారాలుగా విచారిస్తున్న, స్పష్టమైన ఆధారాలు దొరకకపోవడంతో ఇప్పుడు పాలిగ్రాఫ్ పరీక్షలకు నిర్ణయించారు. ఈ పరీక్షల ద్వారా వారు చెప్పిన వివరాల్లో నిజం ఉందా లేదా అని నిర్ధారించేందుకు ప్రయత్నించనున్నారు.
ప్రేమలో మొదలై హత్యతో ముగిసిన విషాదం
జూలై 14న మైనర్ బాలిక తన ప్రియుడు లోకేష్‌తో కలిసి.. గండికోట ప్రాంతానికి వెళ్లింది. కానీ అదే రోజు ఆమె దారుణ హత్యకు గురైంది. గండికోట రంగనాయకుల స్వామి గుడి పరిసర ప్రాంతంలో.. బాలిక మృతదేహం కనుగొనబడింది. మొదట్లో ఇది ప్రేమ వ్యవహారంలో జరిగిన హత్యగా పోలీసులు భావించినా, తర్వాత విచారణలో కొత్త కోణాలు బయటపడ్డాయి.
దర్యాప్తులో గందరగోళం – కుటుంబంపై అనుమానాలు
మొదట్లో బాలిక ప్రియుడిపై మాత్రమే పోలీసులు దృష్టి సారించారు. కానీ తర్వాత కుటుంబ సభ్యులపై అనుమానాలు వెల్లువెత్తాయి. బాలిక సోదరులు కొండయ్య, సురేంద్ర మధ్య గత కొంతకాలంగా తగాదాలు ఉన్నాయన్న సమాచారం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు విచారణ జరిపారు.
అయితే, కుటుంబం నుండి వచ్చే విభిన్న వాంగ్మూలాలు.. దర్యాప్తు దిశను మరింత క్లిష్టం చేశాయి. ప్రతి ఒక్కరి మాటల్లో తేడాలు ఉండటంతో.. పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్ టెస్టు నిర్ణయించారు. ఈ పరీక్ష ద్వారా ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు వాస్తవాలను దాచిపెడుతున్నారో బయటపడే అవకాశం ఉంది.
చిక్కని ఆధారాలు..
గండికోట రిజర్వాయర్ సమీపంలో కేసు జరిగినందున ఆధారాలు చాలా పరిమితంగా లభించాయి. సీసీటీవీ ఫుటేజీలు లేకపోవడం, ప్రత్యక్ష సాక్షులు దొరకకపోవడం దర్యాప్తును క్లిష్టతరం చేసింది. అయితే ఇటీవల పోలీసులు కొత్త సాంకేతిక ఆధారాల సాయంతో.. కొంత పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. మొబైల్ టవర్ లొకేషన్ ఆధారాలు కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించనున్నాయి.
బాధిత కుటుంబం ఆవేదన
బాలిక తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ, మా బిడ్డకు న్యాయం జరగాలి. ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వారు ఎలాంటి సంబంధం ఉన్నా కఠిన శిక్ష పడాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న కుక్కలు.. రేబిస్ వ్యాధితో మరో బాలుడు మృతి
ఈ కేసులో దర్యాప్తు మొదలైనప్పటి నుంచి అనేక అనుమానాలు, ఊహాగానాలు తలెత్తాయి. ఇప్పుడు పాలిగ్రాఫ్ పరీక్షలతో నిజానికి దగ్గరయ్యే అవకాశం ఉందని పోలీసులు విశ్వసిస్తున్నారు. గండికోట మైనర్ బాలిక హత్య కేసు గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపింది. ఈ పరీక్షల ఫలితాలతోనే ఎవరు నిజమైన నిందితులో, ఎవరు నిర్దోషులో అన్నది తేలనుంది.