భారతీయ రైల్వే ప్రపంచలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతుంది. సుమారు లక్ష కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు, 20 వేలకు పైగా రైళ్లను కలిగి ఉంది. రోజూ సుమారు 12 వేల ప్యాసింజర్ రైళ్లు 2 నుంచి 3 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతాయి. ఇక నిత్యం లక్షల టన్నుల సరుకులు రవాణా అవుతాయి. దేశ వ్యాప్తంగా 7400 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలను కలుపుతూ రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి.
ఇక ప్రపంచంలో బోలెడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయితే, అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ మాత్రం ఇండియాలోనే ఉంది. దాని పేరు హుబ్లీ రైల్వే స్టేషన్. ఇది మన పొరుగు రాష్ట్రం కర్నాటకలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ అనేక రాష్ట్రాలను అనుసంధానిస్తుంది. ప్రయాణీకులతో పాటు సరుకు రవాణాను సులభతరం చేస్తుంది. రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణ సౌకర్యాన్ని పెంచుతుంది. సౌత్ వెస్టర్న్ రైల్వే (SWR) ప్రధాన కార్యాలయంగా కొనసాగుతున్న ఈ రైల్వే స్టేషన్.. ప్రాంతీయ వాణిజ్యం, కనెక్టివిటీలో కీలక పాత్ర పోషిస్తుంది.
కర్ణాటకలోని హుబ్లీ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ ను కలిగి ఉంది. దీనిని పొడవు ఏకంగా 1,507 మీటర్లు, 4,944 అడుగుల పొడవును కలిగి ఉంది. ఈ స్టేషన్ బెంగళూరు, హోసాపేట, వాస్కోడగామా, బెలగావిని కలుపుతుంది. ఇది దక్షిణ భారత రైల్వేకు కీలక కేంద్రంగా పనిచేస్తుంది. హుబ్లీ జంక్షన్ ప్లాట్ ఫామ్ ను మార్చి 2023లో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు సాధించింది. ఈ ప్లాట్ ఫారమ్ రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒకేసారి అనేక రైళ్లను నడపడానికి వీలు కల్పిస్తుంది. స్టేషన్ చారిత్రాత్మక ఆకర్షణను కాపాడుతూ ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది హుబ్లీ రైల్వే స్టేషన్.
ఇక హుబ్లీ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లకు సపోర్ట్ చేస్తుంది. ప్రాంతీయ వాణిజ్యానికి కీలకమైన నైరుతి రైల్వే ప్రధాన కార్యాలయంగానూ పని చేస్తుంది. ఈ రైల్వే స్టేషన్ లో మొత్తం 8 ప్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. 12 ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. ప్లాట్ ఫారమ్ 1, 8 ఒకే స్థలాన్ని పంచుకుంటాయి. ఈ రైల్వే స్టేషన్ కు మూడు ఎంట్రెన్స్ లు ఉన్నాయి. గదగ్ రోడ్ లో సెంట్రల్ రైల్వే హాస్పిటల్ ముందు నుంచి యార్డ్ సమీపం నుంచి కూడా లోపలికి రావచ్చు. ఈ రైల్వే స్టేషన్ లో గూడ్స్ షెడ్, డీజిల్ లోకో షెడ్, కరేజ్ రిపేర్ వర్క్ షాప్, ట్రైన్ యార్డ్, వెయిటింగ్ రూమ్‌లు, ఫుడ్ స్టాల్స్, రిటైరింగ్ రూమ్‌లు, ఫ్రీ వై-ఫై సౌకర్యం, బ్యాటరీ కార్ సదుపాయం కూడా లభిస్తుంది.
Read Also: దేశంలో టాప్ 10 లాంగెస్ట్ వందేభారత్ రూట్లు ఇవే, ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉందంటే?