YCP Politics: వైసీపీ అధినేత జగన్ డిజిటల్ కాన్సెప్ట్ వికటించిందా? డిజిటల్ బుక్ వల్ల సొంత నేతలకు సెగ మొదలైందా? మాజీ ఎమ్మెల్యేలపై పిర్యాదు నమోదు అవుతున్నాయా? నామమాత్రంగా కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ఈ కాన్సెప్ట్ తెచ్చారా? దీనివల్ల తాము అన్‌పాపులర్ అవుతున్నామని కొందరు నేతలు ఎందుకు అంటున్నారు? ఈ ప్రశ్న వైసీపీ చాలామందిని వెంటాడుతోంది.
డిజిటల్ బుక్‌లో నేతలకు సెగ
టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ తీసుకొచ్చింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసిన ఆగడాలపై నమోదు చేసినట్టు నారా లోకేష్ చెప్పారు. అందులో నేతలు, అధికారుల పేర్లు ఉన్నట్లు విజయనగరం సభలో రెడ్‌బుక్ చూపించి ఓపెన్‌గా ప్రకటన చేశారు. చీటికి మాటికీ వైసీపీ నేతలు రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడం మొదలుపెట్టారు. దీంతో తమకు అలాంటి బుక్ ఉంటే బాగుంటుందని భావించారు ఆ పార్టీ కార్యకర్తలు.
కేడర్ ఆలోచనకు తగ్గట్టుగా వైసీపీ అధినేత జగన్ డిజిటల్ బుక్ గ్రాండ్‌గా ఓపెన్ చేశారు. అధికార పార్టీ గురించి ఆ బుక్‌లో ఏమి రాస్తున్నారో తెలీదు. కాకపోతే వైసీపీ నేతల గురించి ఫిర్యాదులు మాత్రం వెల్లువెత్తులున్నాయి. దీంతో నాయకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రత్యర్థుల కోసం పెట్టిన బుక్.. గురి తప్పి మనపైకి వస్తుందంటూ చర్చించుకుంటున్నారు.
డైలమాలో వైసీపీ నేతలు
ఇటీవల మాజీ మంత్రి విడదల రజినీపై ఫిర్యాదు వచ్చింది. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై ఇద్దరు బాధితులు డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇప్పిస్తానంటూ తన నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నారని కౌన్సిలర్ ప్రియాంక, ఆమె తండ్రి విక్రమ్ ప్రధాన ఆరోపణ. ఈ మేరకు డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు.
అంతేకాదు అంగన్‌వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం తన దగ్గర 75 వేలు తీసుకున్నారంటూ మరోవ్యక్తి తిప్పేస్వామిపై ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. కేవలం 12 రోజుల్లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు రావడంతో వైసీపీ హైకమాండ్ తలలు పట్టుకుంటోంది. ఇప్పుడేం చెయ్యాలంటూ తర్జనభర్జన పడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: విజయనగరంలో ఘనంగా పైడితల్లి అమ్మవారి జాతర
డిజిటల్ బుక్ వల్ల నియోజకవర్గంలో తమకు ఇబ్బందులు మొదలవుతున్నాయని, కేడర్ తమ వైపు చూడడం లేదని చర్చించుకుంటున్నారు కొందరు నేతలు. ఇదే కంటిన్యూ అయితే డిజిటల్ బుక్ వల్ల ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి వస్తుందని అంటున్నారు. నార్మల్‌గా అయితే ఇలాంటి ఫిర్యాదులు ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు వాటిని బయటపెడతారు. కానీ వైసీపీలో అంతా రివర్స్ అని అంటున్నారు. రానున్న డిజిటల్ బుక్‌ని కంటిన్యూ చేస్తారా? లేకుంటే క్లోజ్ చేస్తారా? అన్న అనుమానాలు లేకపోలేదు.