Ernakulam Express Fire Accident: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు ఏసీ బోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి చెందిన బ్యాగులో భారీగా డబ్బు, బంగారం ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్ కుటుంబసభ్యుల సమక్షంలో కాలిపోయిన బ్యాగును తెరిచి చూడగా రూ.5.80 లక్షల నగదు, బంగారు ఆభరణాలు ఉన్నాయి. మంటల్లో చాలా వరకు నోట్ల కట్టలు కాలిపోయాయి.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగింది. ఎర్నాకులం – టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలు(18189)లో బీ1 ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు M2 ఏసీ కోచ్‌కు వ్యాప్తి చెందడంతో, గొలుసు లాగి రైలును నిలిపివేశారు. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. మంటలు వ్యాపించకుండా మిగతా బోగీలను రైల్వే సిబ్బంది వేరు చేశారు. ఈ ఘటనలో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ మృతి చెందారు.
“టాటా నగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న.. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ రోజు తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమవ్వగా, ఒకరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ ఘటన సమయంలో దాదాపు 160 మంది ప్రయాణికులు ఈ రెండు బోగీల్లో ప్రయాణిస్తున్నప్పటికీ, అదృష్టవశాత్తు వారు క్షేమంగా బయటపడ్డారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, మృతుని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” –డిప్యూటీ సీఎం, పవన్ కల్యాణ్
“టాటా నగర్ – ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం అత్యంత దురదృష్టకరం. ఈ ఘటనలో రెండు బోగీలు దగ్ధమవ్వడం, ఒకరు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ప్రమాద సమయంలో బోగీల్లో ఉన్న మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడటం ఊరటనిచ్చే అంశం. మృతుని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. అధికారులతో మాట్లాడి బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటాం”- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సిన ఉదయ్ ఎక్స్‌ప్రెస్, పూరీ-తిరుపతి, ఈస్ట్ కోస్ట్, బెంగళూరు హంసఫర్, షాలిమార్-చర్లపల్లి(రైలు నెంబర్: 18045), విశాఖ-లింగంపల్లి (రైలు నెం.12805), విశాఖ-గుంటూరు (రైలు నెం.17240) ఎక్స్ ప్రెస్ రైళ్లు 3 నుంచి 4 గంటలు ఆలస్యమం అయ్యాయి. విశాఖకు రావాల్సిన గోదావరి, తిరుపతి-హావ్‌డా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎలమంచిలిలో ఆగే రైళ్లను విశాఖలో ఆపుతున్నారు. ఎలమంచిలిలో స్టాప్ లేని వాటిని యథావిధిగా వదులుతున్నారు. వందేభారత్, జన్మభూమి సూపర్‌ఫాస్ట్ రైళ్లు విశాఖ నుంచి యథావిధిగా బయలుదేరారు.