Love Tragedy: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ముందురోజు యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా, విషయం తెలిసి యువతి మరుసటి రోజు అదే రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకుంది.
ఏపీలోని గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దమ్మాలపాడుకు చెందిన గోపి నరసరావుపేట ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. తెనాలి మండలం అత్తోటకు చెందిన తన క్లాస్ మేట్ ప్రియాంక, గోపి గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారు.
సెప్టెంబర్ 5న ఇంట్లో తెలియకుండా గోపి, ప్రియాంక వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించి మాట్లాడారు. అయితే వారు ప్రేమ పెళ్లిని అంగీకరించలేదు. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గోపి, ప్రియాంక తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో రెండ్రోజుల క్రితం గోపి పేరేచర్ల రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు.
గోపి ఆత్మహత్య విషయం తెలుసుకున్న ప్రియాంక ఆ మరుసటి రోజు అదే రైల్వే ట్రాక్‌పై సూసైడ్ చేసుకుంది. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసి గోపి, ప్రియాంకల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లికి ఒప్పుకోలేదని పిల్లలు ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటనతో గోపి, ప్రియాంక ఇరువురి గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.