Gurgaon News: కారణాలు ఏమైనా కావచ్చు.. చిన్న చిన్న సమస్యలు దంపతుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఫలితంగా నువ్వెంతంటే.. నువ్వెంత అనేస్థాయికి వెళ్లిపోతున్నారు. ఫలితంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. వారిద్దరు భార్యభర్తలు. సంచలనం రేపిన ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది.
గురుగ్రామ్‌లోని సెక్టార్ 37లోని మిలీనియం సిటీ సొసైటీలో నివసిస్తోంది టెక్కీ దంపతులు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. ఆదివారం సాయంత్రం గొడవ తర్వాత తన భార్యను గొంతు కోసి చంపేశాడు భర్త. ఆ తర్వాత అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ కి ముందు మృతుడు తన ఫ్రెండ్‌కి వీడియో పంపడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
పోలీసుల సమాచారం మేరకు… 30 ఏళ్ల అజయ్ కుమార్-28 ఏళ్ల స్వీటీ శర్మగా గుర్తించారు. అజయ్ కుమార్ సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ ప్రాంతవాసి. స్వీటీ బెంగాల్‌లోని అసన్సోల్ ప్రాంతానికి చెందినది. మూడేళ్ల కిందట ఇద్దరు వివాహం చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహమే జరిగింది. ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు.
గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. స్వీటీ ఇంటి నుండి పని చేసేవారు. అయితే ఈ జంట రెండేళ్లుగా మిలీనియం సిటీ సొసైటీ టవర్ సెవెన్‌లోని 13వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. వీరి మధ్య ఏం జరిగిందో తెలీదు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అజయ్ ఫ్రెండ్‌కి ఓ వీడియో వచ్చింది. ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాకయ్యాడు.
ALSO READ: మైనర్ కొడుకుతో కలిసి తండ్రి, కూతుర్ని కాల్చి చంపాడు
ఎందుకంటే భార్యభర్తలిద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బహుశా భార్యాభర్తల మధ్య గొడవ జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి అజయ్ తనకు ముందే తెలిపాడని వివరించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఇద్దరి మృతదేహాలు ఒక గదిలో ఉన్నాయి.
మహిళ మృతదేహం నేలపై పడి ఉంది. FSL బృందాలు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించాయి. మహిళ గొంతును స్కార్ఫ్‌తో బిగించి చంపినట్లు తేలింది. అజయ్ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. భార్యను గొంతు కోసి చంపేసి, ఆపై భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. వారి బంధువులకు సమాచారం అందించారు. అజయ్-స్వీటీల ఫ్రెండ్స్, పొరుగువారిని విచారిస్తున్నారు పోలీసులు. మరి విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.