Whiskey Ice Cream Scandal in Jublee Hills.. Hyderabad: ఐస్ క్రీమ్ అనగానే చిన్నారులు అది కొనిచ్చేదాకా వదలరు. చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లు ఇష్టపడని పిల్లలంటూ ఎవరూ ఉండరు. జలుబు చేస్తుందని హెచ్చరిస్తున్నా..డాక్టర్లు వద్దని అంటున్నా..రహస్యంగా కొనుక్కున ఆస్వాదిస్తుంటారు. వారి వీక్ నెస్ ని ఇంకోలా క్యాష్ చేసుకోవాలని కొందరు నిందితులు ఆలోచించారు. వారి మైండ్ లో ఓ దుర్మార్గమైన ఆలోచన మెదిలింది. ఎవరికీ అనుమానం కలగకుండా ఐస్ క్రీమ్ లో విస్కీ కలపి సప్లై చేస్తున్నారు. పైగా ఇవి స్పెషల్ రేటంటూ అమ్ముతున్నారు. ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒకానొక ఐస్ క్రీమ్ పార్లర్ లో కొంతకాలంగా యథేచ్ఛగా అమ్ముతున్నారు. ఈ ఐస్ క్రీమ్ మంచి రుచిగా ఉండటంతో ఒకటికి నాలుగు సార్లు ఇదే పార్లర్ కు వచ్చి పిల్లలు కొనుగోలు చేస్తున్నారు. అయితే కీలక సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఐస్ క్రీమ్ పార్లర్ పై దాడులు నిర్వహించారు.
యువకులు కూడా..
అరవై గ్రాముల ఐస్ క్రీమ్ లో షుమారు వంద మిల్లీ లీటర్ల విస్కీ అమ్ముతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఈ ఐస్ క్రీమ్ లు పిల్లలే కాదు యువకులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నారు. అక్కడికక్కడే రుచులు ఆస్వాదించడంతో బయట ఎవరికీ అనుమానం కలగకుండా కొంతకాలంగా ఈ ఐస్ క్రీమ్ పార్లర్ ను నడుపుతున్నారు నిర్వాహకులు. దీనితో ఐస్ క్రీమ్ లో విస్కీ ఆనవాళ్లు దొరకడంతో వన్ అండ్ ఫైన్ ఐస్ క్రీమ్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పార్లర్ యజమానులైన దయాకర్ రెడ్డి, శోభన్ లను విచారిస్తున్నారు. వీరికి ఎవరి నుంచి పెద్ద మొత్తంలో ఐస్ క్రీమ్ బల్క్ ఆర్డర్లు వస్తున్నాయి? ఎంతకాలంగా ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు? వీరికి వచ్చే రెగ్యులర్ కస్టమర్లు ఎవరు? ఇంకా వన్ అండ్ ఫైన్ ఐస్ క్రీమ్ బ్రాంచీలు నగరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి వివరాలను పట్టుబడ్డ నిందితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా నగరం నడిబొడ్డునే ఇలాంటి ఐస్ క్రీమ్ పార్లర్లు నడుపుతున్న వారిపై నగర ప్రజలు మండిపడుతున్నారు. చిన్నపిల్లలే దొరికారా వీళ్ల ప్రయోగాలకు అంటూ ..నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రం
ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా చూడాలని అంటున్నారు. కొన్నాళ్లు చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్మకాలు కొనసాగాయి. యథేచ్ఛగా షాపుల్లోనే ఈ చాక్లెట్లు లభ్యం అవుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత స్టేట్ గా ఉండాలని కోరారు. అందుకు సంబంధించి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నిందితులు ఎలాంటి వారైనా ఉపేక్షించమని అన్నారు. దీనితో మత్తు మందుల విక్రేతలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఉక్కు పాదం మోపారు. ఇప్పుడు విస్కీ కలిసిన ఐస్ క్రీమ్ అమ్మకాలతో సొమ్ము చేసుకోవాలని చూస్తున్న నిందితులపై ఎలాగైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.