Film lyricist Vaddepalli Srikrishna passed away: టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి శ్రీకృష్ణ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వడ్డేపల్లి కృష్ణ కవి, సినీ గేయ రచయిత, లతితగీతాల రచయిత కూడా. ఆయన ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ గీతంతో ఫేమస్ గా మారారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఓ నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన వడ్డెపల్లి కృష్ణ..కష్టపడి ఉన్నతస్థాయికి ఎదిగారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయనను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు.
లలిత గీత రచయితగా, ప్రామాణిక పరిశోధకుడిగా, టెలివిజన్ ధారావాహికల దర్శకుడిగా, గీత రచయితగా సేవలు అందించారు. అంతేకాకుండా వివిధ డాక్యుమెంటరీల రూపకర్తగా, అనేక పుస్తకాలు, ఆడియో ఆల్బమ్స్ రూపకర్తగా, సంగీత, నృత్య రూపకాల రచయితగా, వివిధ నాటక రచయితగా విభిన్న కోణాల్లో వడ్డేపల్లి కృష్ణ సాహిత్య సేవలు అందించారు.
కాగా, మానేడు గడ్డ నుంచి అంతులేని ఆత్మవిశ్వాసంతో ఎదిగారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నివాళులర్పిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కవులు, కళాకారులు, రచయితలు సంతాపం ప్రకటిస్తున్నారు.