ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు. కానీ కొంతమందికే అది సాధ్యమవుతుంది. చాణక్యనీతి చెబుతున్న ప్రకారం ధనవంతులు కావడం అనేది ఒక వ్యక్తి అలవాట్లు, స్వభావం, పనితీరుపైన ఆధారపడి ఉంటుంది. డబ్బు గురించి చాణక్యుడు ఏ రోజో తన ఆర్థిక శాస్త్రంలో వివరించాడు. అతని ధన చిట్కాలను పాటిస్తే ఎవరైనా కూడా మంచి జీవితాన్ని గడుపుతారు… ధనవంతులు అవుతారు.
గొప్ప ఆర్థిక వేత్తగా, గురువుగా, మార్గదర్శకుడిగా ఆచార్య చాణక్యుడికి పేరు ఉంది. డబ్బుకు సంబంధించిన విషయాలను చాణక్యుడి కన్నా ఎవరూ అద్భుతంగా విశదీకరించలేరని కూడా చెబుతారు. ఒక వ్యక్తి సులభంగా ధనవంతులు కావాలన్నా, పేదవాడు కావాలన్నా… ఏ పనులు చేయాలో చాణక్యుడు ఏనాడో చెప్పాడు.
చాణక్యుడి చిట్కాలు ఇవిగో
చాణక్యుడి విధానాలను పాటించే వ్యక్తి ఎంతటి ఆర్థిక సంక్షోభం వచ్చినా కూడా జీవితాన్ని ముందుకే సాగించగలతాడు. తిరిగి అపారమైన సంపదకు యజమాని అవుతాడు. చాణుక్యుడు చెబుతున్న ప్రకారం డబ్బును కొన్ని విషయాలపైనే ఖర్చు చేయాలి. అలా ఖర్చు చేయడం వల్ల ఆ డబ్బు రెట్టింపు అయి తిరిగి వస్తుంది. అంతే కాకుండా వేరే పనులపై లేదా ఉత్పత్తులపై చేసేది వృధా ఖర్చు కింద అవుతుంది. ఎలాంటి విషయాలపై డబ్బును ఖర్చు చేయవచ్చు తెలుసుకోండి.
వీటికే ఖర్చు పెట్టండి
ఒక వ్యక్తి తన కోసం, తన కుటుంబం కోసం, విద్య, ఆరోగ్యం, మంచి ఆహారం, ఉత్తమ జీవన ప్రమాణాల కోసం డబ్బును ఖర్చు చేయాలి. ఆ కుటుంబం సౌకర్యంగా జీవించడానికి డబ్బును ఖర్చు చేయవచ్చు. అంతకుమించి అనవసరంగా డబ్బును వృధా చేయకూడదు.
దాన ధర్మాలు చేయాలి
అలాగే ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయంలో ప్రతినెలా కొంత భాగాన్ని దానధర్మాలకు కచ్చితంగా ఖర్చు చేయాలి. అవసరమైతే తన వంతు డబ్బును ఆహారాన్ని, బట్టలను కూడా దానం చేయడానికి వెనుకాడకూడదు. ఇలా పేదవారికి సహాయం చేయడం వల్ల లేదా మతపరమైన కార్యక్రమాలకు ఖర్చు చేయడం వల్ల… సంపద ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటుంది. దేవతలు అతని పట్ల దయ చూపుతారు. చేసిన పాపాలు నశిస్తాయి. అశుభగ్రహాలు కూడా శుభ ఫలితాలను ఇవ్వడం మొదలుపెడతాయి. అప్పుడు ఆ వ్యక్తి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోడు. లక్ష్మీదేవి అతనితో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది.
అలాగే పొదుపు చేయడం అనేది కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. మీకోసం, మీ కుటుంబం కోసం, డబ్బును ఖర్చు చేయడం ఎంత ముఖ్యమో కొంత పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. దాతృత్వం కూడా మనిషికి ఉండాల్సిన ముఖ్య లక్షణమే. కాబట్టి అప్పుడప్పుడు డబ్బును దానం కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సంక్షోభం వచ్చినా తట్టుకునే శక్తి ఆ లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. ఆత్మ గౌరవంతో ఎవరి దగ్గర చేయి చాచకుండా జీవించే అవకాశాన్ని మీకు అందిస్తుంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనే ఎటువంటి చెడు అలవాట్లకు మీరు బానిస కావొద్దు. ఒక్క చెడు అలవాటు ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.