భూమ్మీద జన్మించిన ప్రతి మనిషి ఎదో ఒక రోజు చనిపోక తప్పదు. కానీ, ఆ చావు ఎప్పుడు? ఎలా వస్తుంది? అనే విషయం ఎవరికీ తెలియదు. చావు దగ్గర పడిన వ్యక్తి మరణానికి ముందు అనుభవించే మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఎవరూ ఊహించలేరు. అయితే, చనిపోయే వ్యక్తికి ముందే మరణ సంకేతాలు అందుతాయని పెద్దలు చెప్తారు. కానీ, శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. తాజాగా చనిపోయే ముందు వ్యక్తులు అనుభవించే పరిస్థితి గురించి వర్జీనియా విశ్వ విద్యాలయం పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు. ఇంతకీ వారు ఏం చెప్పారంటే..
ప్రజలు మరణానికి ముందు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు అనే అంశానికి సబంధించి వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరణానికి దగ్గరగా ఉన్న అనుభవం (NDE) అని పిలువబడే మర్మమైన ఓ మానసిక పరిస్థితికి లోనవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రాణాంతక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడిన దాదాపు 15% మంది ఏదో ఒక రకమైన NDE అనుభవాలను కలిగి ఉంటారని పరిశోధకులు కనుగొన్నారు. వారిలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఫీలవుతున్నట్లు గుర్తించారు. ఒకరు తమ శరీరం బయట తేలుతూ ఉన్నట్లు ఫీల్ కావడం, మరొకరు ప్రకాశవంతమైన కాంతి సొరంగం గుండా ముందుకు కదులుతున్న భావనకు గురి కావడం, ఇంకొందరు ఎక్కువ మానసిక ప్రశాంతతకు గురి కావడం లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ అనుభవాలను ఆయా వ్యక్తులు ప్రాసెస్ చేస్తారో గుర్తించడానికి వర్జీనియా వర్సిటీ సైకియాట్రీ అండ్ న్యూరోబిహేవియరల్ సైన్సెస్ విభాగం శాస్త్రవేత్తలు 167 మంది వ్యక్తులపై సర్వే నిర్వహించారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు సైకాలజీ ఆఫ్ కాన్షియస్‌నెస్: థియరీ, రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ అనే జర్నల్ లో ప్రచురితం అయ్యాయి. మరణానికి ముందు క్షణాలు మానవ మనస్సుపై శాశ్వత ముద్ర వేయగలవని సూచిస్తున్నాయి.
దాదాపు 70% మంది మరణానికి దగ్గర అయిన సందర్భంలో మతపరమైన, ఆధ్యాత్మిక విశ్వాసాలలో గడుపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వారిలో మరణ భయం కూడా తగ్గినట్లు తెలిపారు. మరో 20 శాతం విడాకులు లాంటి ఎన్నో తీవ్ర సమస్యలతో బాధపడి మరణానికి చేరుకున్నట్లు గుర్తించారు. వీరు ఒంటరితనం, ఇతరుల భావాలు తమ మీద రుద్దుతున్నట్లు ఫీలవుతారని గుర్తించారు. ఈ సర్వేలో పాల్గొన్న64% మంది వృత్తిపరమైన, ఆధ్యాత్మిక సపోర్టు కోసం ప్రయత్నించినట్లు తెలిపారు. 78% మంది మరణాన్ని ఓ సహాయకరంగా భావించారని ప్రధాన పరిశోధకురాలు మరియెటా పెహ్లివనోవా తెలిపారు. “తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి బయటపడిన రోగులు మరణానికి దగ్గర అయిన సందర్భంలో ఎలా ఫీలయ్యారని తెలుసుకునేందుకు ఈ పరిశోధన నిర్వహించాం. వారి అంతరాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. చాలా వరకు మనుషులకు మరణం దగ్గర అయినప్పుడు వారిలో మార్పు కనిపిస్తుంది” అని మరియెటా వివరించారు.
Read Also: బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారా? ప్రాణాలు పోవచ్చు జాగ్రత్త!