KCR Master Plan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను పీవీఆర్ అందజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విష్ణుతో నామినేషన్ వేయించామని బీఆర్ఎస్ చెబుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అధికారిక అభ్యర్ధిగా ఖరారైన మాగంటి సునీత నామినేషన్ కూడా వేశారు. అయితే ఆమె రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడంతో.. సునీత నామినేషన్ స్క్రూటినీపై అనుమానాలతోనే గులాబీ పార్టీ విష్ణుతో నామినేషన్ వేయించినట్లు చెప్తున్నారు.
మాగంటి సునీతను అభ్యర్ధినిగా ప్రకటించిన బీఆర్ఎస్
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో ఆసక్తికర పరణామం చోటు చేసుకుంది. ఈ బైపోల్స్‌లో బీఆర్ఎస్ అందరి కంటే ముందుగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్ధినిగా ప్రకటించింది. అయితే అనూహ్యంగా నామినేషన్ల గడువు ముగిసే సమయానికి గులాబీ పార్టీ నుంచి ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బైపోల్ లో బరిలో నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ముందు జాగ్రత్తగా విష్ణుతో నామినేషన్ వేయించిన బీఆర్ఎస్..
అయితే మాగంటి సునీత రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడంతో ఆమె నామినేషన్ స్క్రూటినీలో ఆమోదం పొందుతుందా? లేదా? అన్న అనుమానాలతోనే బీఆర్ఎస్ ముందు జాగ్రత్తగా దివంగత మాజీ మంత్రి పి.జనార్ధన్ రెడ్డి తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డితో నామినేషన్ వేయించిందంట. మాగంటి సునీత నామినేషన్ స్క్రూటినీలో ఆమోదం పొందితే.. విష్ణు వర్ధన్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకుంటారని గులాబీ పార్టీ వర్గాల్లు చెపుతున్నాయి. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణువర్థన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కొనసాగుతుంటే.. ఆయన సోదరి ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ.. తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు.
అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ
మొత్తానికి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక ఖరారైంది.ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు, బైపోల్ నిర్వహణకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. అటు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాయి.
Also Read: వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి
బీఆర్ఎస్ తరఫున గోపీనాథ్ భార్య మాగంటి సునీతను గులాబీ పార్టీ బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఇక బీజేపీ పార్టీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థులు ఉపఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. అటు జూబ్లీహిల్స్ లోని డివిజన్లలో అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. గెలుపు ఎవరిని వరిస్తుందనేదానిపై రోజురోజుకి ఉత్కంఠ పెరుగుతుంది.
Story By Maduri, Bigtv