Decade of Baahubali Reign:బాహుబలి.. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమా రూపురేఖలు మార్చిన చిత్రం. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా ఈ సినిమాకే సొంతం. తొలి భాగం 2015 జూలై 10న కాగా రెండవ భాగం 2017లో విడుదలై సంచలనం సృష్టించింది.. ఇక మొదటి భాగం విడుదలై సరిగా నేటికీ 10 సంవత్సరాలు. ఇందులో బాహుబలిగా ప్రభాస్ (Prabhas), భల్లాలదేవ రానా దగ్గుబాటి(Rana daggubati), దేవసేనగా అనుష్క (Anushka ), శివగామిగా రమ్యకృష్ణ (Ramya Krishnan), కట్టప్పగా సత్యరాజ్ (Sathyaraj), అవంతిక పాత్రలో తమన్నా (Tamannaah)ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా సినిమా విడుదల అయ్యి పదేళ్లు అవుతున్నా..ఇప్పటికీ ఈ సినిమా పాత్రలు ప్రత్యేకమనే చెప్పాలి.
రూ.180 కోట్ల బడ్జెట్.. 650 కోట్లకు పైగా కలెక్షన్స్..
ఎం ఎం కీరవాణి (MM Keeravani) సంగీతం అందించగా.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) కథ అందించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరు సొంతం చేసుకుంది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ రూ.180 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తే.. రూ.650 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.
2 నేషనల్ అవార్డులతో పాటు 14 నంది అవార్డులు కూడా..
ఇలా సంచలనం సృష్టించిన ఈ సినిమాకి ఉత్తమ చిత్రంగా, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రంగా ఏకంగా 2 నేషనల్ అవార్డు లభించాయి. అంతేకాదు 14 నంది అవార్డ్స్ కూడా దక్కించుకుంది ఈ సినిమా. ఈ సినిమా కోసం తమిళ రచయిత మదన్ కార్కి” కిలికి” అనే కొత్త భాషను కూడా రూపొందించారు. ఈ భాషను 750 పదాలతో 40 వ్యాకరణ సూత్రాలతో రూపొందించడం జరిగింది. ఇలా రికార్డులతో పాటు సంచలనం సృష్టించిన ఈ సినిమా.. పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా మూట కట్టుకుందని చెప్పవచ్చు.
పాజిటివ్ అంశాలు..
ఈ సినిమా ద్వారా వచ్చిన పాజిటివ్ ఏమిటి అంటే..
తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి గుర్తింపు వచ్చింది.
ఇన్ని రోజులు తెలుగు సినీ పరిశ్రమ అంటే చిన్నచూపు చూసిన ఇతర ఇండస్ట్రీలు కూడా ఇప్పుడు టాలీవుడ్ గొప్పది అని ఒప్పుకుంటున్నారు.
అంతేకాదు ఇతర ఇండస్ట్రీ వాళ్ళు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి సిద్ధమవుతున్నారు.
ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమను పోపులో కరివేపాకులా తీసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అలాంటి వాళ్లే ఇప్పుడు తెలుగులో నటించడానికి, తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
దీనికి తోడు హాలీవుడ్ రేంజ్ లో ప్రకటించే అవార్డుల్లో కూడా తెలుగు ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇస్తున్నారు.
బాహుబలి కారణంగా పెరిగిన నెగిటివిటీ..
ఇకపోతే బాహుబలి కారణంగా పాజిటివిటీ ఎంతైతే పెరిగిందో నెగటివ్ అంతకు రెట్టింపు స్థాయిలో పెరిగిందని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఈ సినిమా ప్రభావం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న సంక్షోభానికి కారణం బాహుబలి మూవీ అని చెప్పవచ్చు.
ఒక హీరోతో మూడు సంవత్సరాల సినిమా చేయడం ఇదే మొదటిసారి. దీంతో తెలుగు ఇండస్ట్రీ స్వభావాన్ని రాజమౌళి పూర్తిగా మార్చేశారు అనే విమర్శ ఉంది.
సాధారణంగా ఏడాదికి ఒక సినిమా చేసే హీరోలు.. బాహుబలి తర్వాత మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు.
అటు డైరెక్టర్లు కూడా చాలామంది రాజమౌళినే ఫాలో అవుతూ మూడేళ్లకి ఒకసారి తమ సినిమాను విడుదల చేస్తున్నారు.
దీనివల్ల ఇండస్ట్రీ కూడా పతనం అవుతోంది. ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. థియేటర్లు కళకళలాడాలి అంటే పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో వస్తేనే అటు బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. ఇప్పుడు పెద్ద హీరోలు మూడేళ్లకు ఒక సినిమా అని కూర్చోవడం వల్ల అటు థియేటర్లకు భారీ నష్టం వాటిల్లుతోంది.
హీరోల రెమ్యూనరేషన్ కూడా ఈ సినిమా నుంచే బాగా పెరిగిపోయింది
మూడేళ్లలో మూడు సినిమాలు చేయాల్సిన ఒక హీరో.. ఇప్పుడు మూడేళ్లలో ఒకటే సినిమా చేసి.. ఆ మూడు సినిమాలకు తీసుకోవలసిన పారితోషకాన్ని ఇప్పుడు ఒక్క సినిమాకి తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఫలితంగా ఈ పెరిగిన రెమ్యూనరేషన్ కారణంగా నిర్మాతలు కూడా భారీగా నష్టపోతున్నారని చెప్పవచ్చు.
also read:Vidyabalan: ఆ స్టార్ హీరో వల్లే సినిమా కెరీర్ కోల్పోయా… హీరోయిన్ ఆవేదన!