Kavitha New party: రాజకీయ నాయకులు కొత్త పార్టీని పెట్టేముందు ప్రజల్లోకి లోతుగా వెళ్లేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. కొత్తమంది రోడ్ షోలు, కొంతమంది పాదయాత్రలు, మరికొంతమంది బహిరంగ సభలు ఇలా అనేక రకాలుగా ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.. సరిగ్గా ఇప్పుడు తెలంగాణాలోజాగృతి అధ్యక్షురాలు కవిత అలాంటి స్ట్రాటజీతోనే ముందుకు వెళ్తున్నారంట.. ఇంతకీ కవిత యాక్షన్ ప్లాన్ ఏంటి?
జాగృతి పేరిట కవిత కార్యక్రమాలు
తెలంగాణా జాగృతి ఏర్పడినప్పటి నుంచి సపరేట్ గానే తమ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచే జాగృతి పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కొద్దిరోజులు గులాబీ బాస్, కారు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సైలెంట్ అయిన ఆమె.. తర్వాత పార్టీ తనను సస్పెండ్ చేసాక తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి పూర్తిగా ప్రజల్లోనే ఉండేందుకు కార్యచరణ మొదలుపెట్టారు. హైదరాబాద్ లో ఉండి రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడితే అర్థంలేదని, నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నాలుగు నెలల షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకున్నారు.
తన తండ్రే తనకు బాస్, రాజకీయ గురువు అంటున్న కవిత
కవిత మాట్లాడిన ప్రతిసారి తన తండ్రే తనకు బాస్ అని, రాజకీయ గురువు అని చెప్తుంటారు.. కానీ జాగృతి జనం బాట పోస్టర్ మాత్రం ఆమె తన తండ్రి ఫోటో లేకుండానే లాంచ్ చేశారు.. కేవలం తెలంగాణా తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోలతో మాత్రమే డిజైన్ చేసిన జనం బాట పోస్టర్ ను విడుదల చేశారు. కావాలనే కేసీఆర్ ఫొటోను తీసివేసినట్లు కవిత మాట్లాడారు. ఇన్నిరోజులు కేసీఆర్ ఫొటోతో రాజకీయం చేస్తోంది అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన ట్రోల్స్ ని కవిత మీడియా ముందు ప్రస్తావించారు.
కవిత వెంట నడవడానికి నాయకులు సిద్దంగా లేరా?
మరోపక్క రాజకీయ విశ్లేషకులు మాత్రం కవితను నమ్మి, జాగృతిలో చేరి.. తన వెంట నడిచేందుకు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు సిద్ధంగా లేరని అభిప్రాయ పడుతున్నారు. కానీ కవిత మాత్రం కేసీఆర్ అనే మహావృక్షం నీడలోనే తాను పెరిగానని, ఇప్పుడు ఆ చెట్టునీడలో దుర్మార్గులు చేరారని అందుకే తాను బయటకు వచ్చేసానని చెప్తున్నారు. ఇకపై కేసీఆర్ ఫొటోని జాగృతి సంస్థ కార్యకలాపాలలో ప్రదర్శించమని కవిత తేల్చిచెప్పారు.. ఇంత జరిగాక కూడా కవిత కేసీఆర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్తే నైతికంగా మంచిది కాదంటూ ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
119 నియోజకవర్గాలు కవర్ చేసేలా కవిత పర్యటన
జాగృతి జనం బాట పేరుతో తెలంగాణా లోని 119 నియోజకవర్గాలను చుట్టేశేలా అన్ని జిల్లాలలో కవిత పర్యటించనున్నారు.. మొదట హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ఉమ్మడి 10 జిల్లాల్లోని ప్రజలతో మమేకం అయ్యి, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా గ్రామాల్లోని రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలను కవిత కలవనున్నారు.. ప్రతి నియోజకవర్గానికి రెండు రోజుల సమయం కేటాయించి మొదటి రోజు నియోజకవర్గంలోని బలమైన నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు చేసి, రెండో రోజు మీటింగ్ ఏర్పాటుచేయనున్నారు..
జాగృతినే పార్టీగా మారుస్తారని ఊహాగానాలు
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక కవితకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపించాయి.. కవిత కొత్త పార్టీ పెడతారంటూ కొంతమంది, ఆమె అధ్యక్షురాలిగా ఉన్న జాగృతినే పార్టీగా మలుస్తారని మరికొంతమంది చర్చించుకున్నారు.. కానీ, కవిత మాత్రం వీటికి భిన్నంగా తెలంగాణా అంతటా జాగృతి నాయకులు, కార్యకర్తలు ఉండేవిధంగా అన్ని జిల్లాల ఇంఛార్జ్ లను, కన్వీనర్లను ఎంపిక చేసి వారికి తగిన బాధ్యతలు అప్పజెప్పారు.. ఇప్పుడు తానే స్వయంగా ప్రజల్లోకి వెళ్లేందుకు జాగృతి జనం బాట యాత్రను మొదలుపెడుతున్నారు.
Also Read: రేపు తెలంగాణ మొత్తం బంద్.. ఎందుకంటే..!
ఫిబ్రవరి 13న కవిత భారీ మీటింగ్
కవిత నాలుగు నెలల యాత్ర తర్వాత హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.. ఫిబ్రవరి నెల 13వ తేదీన ఈ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది.. ఆ సభలోనే కవిత తన సొంతపార్టీని ప్రజల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు జాగృతి నాయకులు చర్చించుకుంటున్నారట.. ఒకవేళ సభలో పార్టీని ప్రకటించకపోతే ఏప్రిల్ మొదటివారంలో పార్టీని ప్రకటించనున్నారట. చూడాలి మరి.. తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో కవిత తన రాజకీయ భవిష్యత్ ని సోలోగా ఎలా తీర్చి దిద్దుకుంటారో.
Story By Apparao, Bigtv