Vatapi Ganapatim Bhaje : కర్ణాటక సంగీతం గురించి ఏ కొంచెం అవగాహన ఉన్నవారికైనా ‘వాతాపి గణపతిం భజే’ అనే కీర్తన గురించి తెలిసే ఉంటుంది. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు వాతాపిలోని గణపతిని స్తుతిస్తూ చేసిన సుప్రసిద్ధ కీర్తన ఇది. వాతాపి అనేది కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని ఒక పట్టణం. దీనినే బాదామి అని కూడా అంటారు. ఒకప్పుడు ఇది పశ్చిమ చాళుక్యుల రాజధానిగా చరిత్రకెక్కిన గొప్ప నగరం. అందుకే పశ్చిమ చాళుక్య రాజులను బాదామి చాళుక్యులు అంటారు.
కర్ణాటక సంగీతం పుట్టింది ఇక్కడే. అందుకే తొలినాటి సంగీతకారులు ఇక్కడి దేవీదేవతల మూర్తుల మీద గొప్ప కీర్తనలు రచించారు. అలా నాడు అక్కడ పూజలందుకునే గణపతి మీద రచించినదే వాతాపి గణపతిం భజే అనే కీర్తన. బాదామి గుహాలయంలోని ఈ భారీ గణపతి విగ్రహం ఉంది. ఈ విగ్రహం వయసు.. 1460 సంవత్సరాలు. ఈ గుహాలయాల్లో హిందూ, జైన, బౌద్ధ మతాలకు చెందిన అనేక శిల్పాలు, మూర్తులు ఉన్నాయి. భారతీయ శిల్పకళకు ప్రతీకలుగా నిలిచే ఈ గుహాలయాలు 6వ శతాబ్దం నాటివి.
ఇక్కడి గణపతికి సంబంధించిన ఒక ప్రాచీన పురాణ గాథ కూడా ఉంది. రాక్షసరాజు హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడితో హ్లాదుడు అనే మరో కుమారుడు ఉండేవాడు. హ్లాదుడు, దమని దంపతులకు కలిగిన సంతానమే.. ఇల్వలుడు, వాతాపి. వాతాపి, ఇల్వలుడు తీవ్ర రాక్షస ప్రవృత్తి గలవారు. వీరికి మృత సంజీవని విద్య(చనిపోయిన వారిని తిరిగి బతికించే శక్తి) తెలుసు. ఈ క్రమంలో రోజూ ఇల్వలుడు.. అడవిలో ఉండే ఒక మునిని భోజనానికి పిలిచేవాడు.
ఈ లోపు వాతాపి మేకగా మారేవాడు. ఇల్వలుడు.. ఆ మేకను కోసి మాంసం వండి, వచ్చిన మునులకు వడ్డించేవాడు. ఈ సంగతి తెలియక వారు దానిని తినగానే, వాతాపి మృతసంజీవినీ విద్యతో వారి పొట్ట చీల్చుకుని బయటికి వచ్చేవాడు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ కలిసి ఆ ముని మాంసాన్ని తినేసేవారు. ఇలా రోజుకొకరిని చంపటం మొదలుపెట్టారు. ఈ సంగతి ఎక్కడో ఉన్న అగస్త్య మహామునికి తెలిసి వీరి ఆట కట్టించేందుకు ఆయనే స్వయంగా ఆ ప్రాంతానికి వస్తాడు.
ఆయన తపశ్శక్తి గురించి తెలియని ఇల్లలుడు.. రోజూలాగానే ఆయనను భోజనానికి ఆహ్వానిస్తాడు. అలాగే వాతాపి మేకగా మారగా, ఇల్వలుడు దాన్ని చంపి, ఆ మాంసాన్ని వండి అగస్త్యుడికి వడ్డిస్తాడు. అయితే.. అగస్త్యుడు దాన్ని శుభ్రంగా భుజించి, ‘బ్రేవ్’ అంటూ పొట్టమీద చేతితో రుద్దుకుంటూ ‘జీర్ణం జీర్ణం.. వాతాపి జీర్ణం’ అనగానే కడుపులో ఉన్న వాతాపి జీర్ణమై పోతాడు. తరువాత అగస్త్యుడు ఇల్వలుడిని తన కంటిచూపుతో భస్మం చేస్తాడు.
ఈ వాతాపి గుహాలయంలో గణపతి విగ్రహం ఉన్న చోటనే.. అగస్త్య మహర్షి విగ్రహం కూడా కనిపిస్తుంది. విష్ణు పురాణం, భాగవతంలోనూ ఈ వాతాపి, ఇల్వలుడి కథ ఉంది. నాటి నుంచి చంటిపిల్లలు పాలు తాగాక.. అవి జీర్ణం కావటానికి తల్లులు.. ‘ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అనే సంప్రదాయం వచ్చిందట. అలా వాతాపి అని అగస్త్యుడు తలచుకోగానే.. ఆయన పని పూర్తి చేసిన గణపయ్య నేటికీ తనను దర్శించుకునే భక్తుల కోరికలు నెరవేరుస్తూనే ఉన్నాడు.