Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ కంగారు పడుతోందా? అధికార పార్టీ ప్రశ్నలకు కౌంటర్లు ఇవ్వలేక తర్జన భర్జన పడుతోందా? సీఎం రేవంత్ విసిరిన అస్త్రాలను రిప్లై ఇవ్వడానికే టైమ్ సరిపోతుందా? ఇది కచ్చితంగా నవంబర్ సెంటిమెంటేనని ఆ పార్టీ శ్రేణులు ఎందుకంటున్నారు? అందుకు బీఆర్ఎస్-బీజేపీలకు గ్రహాలు అనుకూలించలేదా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు రోజుకో అస్త్రాన్ని తెరపైకి తెస్తున్నాయి. వాటి చుట్టూనే ప్రధాన నేతల మాటలయుద్ధం కొనసాగుతోంది. గడిచిన రెండురోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అదే జరిగింది. నేతల ప్రచారాన్ని గమనిస్తున్నవారు.. మునుపటి పోరాట పటిమ విపక్షాల్లో కనిపించలేదని అంటున్నారు.
బీఆర్ఎస్-బీజేపీలను వెంటాడుతున్న సెంటిమెంట్ ఏంటి? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెండుచోట్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ రెండింటిలోనూ ఆ పార్టీ ఓటమి పాలైంది. అప్పుడు బీజేపీ విజయం సాధించింది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేసినప్పటికీ ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది.
బీఆర్ఎస్-బీజేపీలకు సెంటిమెంట్
సరిగ్గా 2020 నవంబర్‌లో దుబ్బాక ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ ఓటమి పాలైంది. బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. మరుసటి 2021 నవంబర్‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఈటెల, బీజేపీ నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికను అప్పటి ప్రభుత్వం పెద్దలు ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకున్నారు. అయినా బీజేపీ ముందు ఆటలు సాగలేదు.
ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికలను ప్రతిష్టాక్మంగా తీసుకుంది. అయినా ఓటమి తప్పలేదు. 2025 జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల కూడా నవంబర్‌లో జరుగుతోంది. ఇప్పుడు ఆ పార్టీ నేతలకు నవంబర్ సెంటిమెంట్ పట్టుకుంది. అధికారంలోకి ఉన్నప్పుడు గెలవలేదని, ఇప్పుడు కష్టమనే అభిప్రాయం ఆ పార్టీలో కొందరు నేతలు మాట్లాడుకుంటున్నారు.
ALSO READ: రెవిన్యూశాఖను రద్దు చేస్తేనే అభివృద్ధి.. హైకోర్టు వ్యాఖ్యల వెనుక
ఈ విషయం హైకమాండ్ చెవిలో పడింది. ఈ నేపథ్యంలో శ్రేణులు, నేతలకు దైర్యం నూరిపోయే ప్రయత్నం చేస్తోందట. ప్రతిపక్షంలో ఉంటే నవంబర్ కలిసి వస్తుందని, అప్పుడు బీజేపీకి అలాగే కలిసి వచ్చిందని చెబుతున్నారట. అప్పుడు పోటీ బీజేపీతో ఉండేదని, ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేస్తున్నారట కొందరు సీనియర్ నేతలు. ఇలాంటి సెంటిమెంట్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారట.
మరి బీజేపీకి నవంబర్ సెంటిమెంట్ కలిసి వస్తుందా? ఈసారి కష్టమేనని వాదన ఆ పార్టీ నేతల్లో లేకపోలేదు. సిటీలో జరిగే ఎన్నిక వేరు.. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎన్నిక వేరని అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ వీక్ ఉందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు. మరి పాత సెంటిమెంట్‌ని బీజేపీ రిపీట్ చేస్తుందా? లేదా అన్నది చూడాలి.