Bus Fire Accident: పార్వతీపురం మన్యం జిల్లాలో ఒడిశా బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి జైపూర్ వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తం అయిన బస్సు డ్రైవర్ ప్రయాణికులు ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు దించాడు. బస్సు మాత్రం పూర్తిగా ధ్వంసం అయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటన గురువారం ఉదయం 7.45 గంటలకు చోటుచేసుకుంది. కొద్ది నిమిషాల్లోనే మంటలు పెద్ద ఎత్తున చెలరేగి మొత్తం బస్సును చుట్టుముట్టాయి. క్షణాల్లోనే మంటలు బస్సు అంతా వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయి బూడిద అయింది.
ప్రమాదం సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే బయటకు పరుగులు తీశారు. కొన్ని విలువైన వస్తువులు, లగేజీలు మాత్రం బస్సులోనే దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడకపోవడం పెద్ద ఉపశమనం కలిగించింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, బస్సులో అగ్నిప్రమాదం ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. తర్వాత పోలీసులు రోడ్డును క్లియర్ చేయడంతో ట్రాఫిక్ మామూలు స్థితికి వచ్చింది.