BigTV English

Bhimavaram Mavullamma : మా ఊళ్లకి అమ్మ.. మావుళ్లమ్మ..!

Bhimavaram Mavullamma : మా ఊళ్లకి అమ్మ.. మావుళ్లమ్మ..!
Bhimavaram Mavullamma

Bhimavaram Mavullamma : తెలుగునేలపై గల అనేక శక్తి క్షేత్రాల్లో భీమవరంలోని మావుళ్లమ్మ ఆలయం ఒకటి. పామరులు తమ తల్లిగా, తమ ఈతి బాధలను తీర్చే కరుణారసవల్లిగా, తమ గ్రామాలను కాచే దేవతగా ఇక్కడి అమ్మవారిని కొలుచుకుంటారు. 1880లో ఇక్కడ కొలువు దీరిన అమ్మవారు.. భక్తుల పాలిటి కల్పవల్లిగా పేరుగాంచింది. మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తూ ఆ మహాకాళి అవతారంగా అక్కడి భక్తులు భావిస్తారు.
దేవతలలో మరెవరకీ లేని విశిష్టరూపంతో, గోదావరీ తీర వాసుల అభయ ప్రదానిగా నిలుస్తున్న అమ్మవారి ఆలయ 60వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయ విశేషాలు మీకోసం..


శతాబ్దానికి మించిన చరిత్ర గల ఈ ఆలయపు చరిత్ర 1880లో మొదలయింది. 1880 వైశాఖ మాసంలో భీమవరం నివాసి మారెళ్ళ మంచిరాజు, గ్రంధి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని సూచించిందట. తనను వెలికితీసి, ఆలయం నిర్మించాలనే అమ్మవారి ఆదేశం మేరకు గ్రామస్తులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి, తవ్వగా అమ్మవారి భారీ విగ్రహం బయటపడిందట.

అప్పట్లో తాత్కాలికంగా అక్కడ ఓ పూరిపాక వేసి అమ్మవారికి పూజలు ఆరంభించారు. మామిడి తోటలో అమ్మవారి విగ్రహం లభించిన కారణంగా తొలినాళ్లలో అమ్మవారిని ‘మామిళ్లమ్మ’ అని భక్తులు పిలుచుకునేవారు. ఇదే కాల క్రమంలో ‘మావుళ్లమ్మ’గా మారింది. తమ ఊళ్ళన్నిటిని చల్లగా కాపాడే తల్లి కనుకే భక్తులు అమ్మవారిని మా వూళ్ళ అమ్మ అనేవారనీ, అదే మావుళ్ళమ్మ అయిందనే మరో కథనమూ ఉంది.


తర్వాతి రోజుల్లో పండితులు సూచించిన విధంగా అమ్మవారి మూర్తిని.. మామిడి తోట ప్రాంతం నుంచి పట్టణం మధ్యలో అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ప్రతిష్టించారు. మావుళ్లమ్మ ఆలయంలో జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి ఒక రజకుడు అర్చకుడిగా ఉండేవాడు. దీనివల్ల రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి, పండ్ల, పూల, వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో మరోసారి ఉత్సవాలు జరుగుతాయి.

తొలినాళ్లలో ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని నేరుగా, దగ్గరగా చూసేందుకు భక్తులు భయపడేవారు. 1910లో గోదావరికి వచ్చిన భీకరమైన వరదల వల్ల ఈ గుడి వారంరోజుల పాటు నీటిలో మునిగి, అమ్మవారి మూర్తి నానిపోయింది. దీంతో 1920లో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అదే రూపంలో అమ్మవారి మరోమూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అమ్మవారి భీకర మూర్తిని తర్వాతి రోజుల్లో ప్రముఖశిల్పి గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు.

12 అడుగుల ఎత్తుతో నాలుగు చేతులతో అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది. చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం ఉంటాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగావుండే ఆ తల్లి కూర్చున్నట్లు వుంటుంది. గర్భాలయానికి ఇరువైపులా రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడి మూర్తులుంటాయి. అమ్మవారి ఉత్సవాల వేళ.. మెంటే వెంకటస్వామి పూర్వీకులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంబీకులు అమ్మవారి పుట్టింటి వారిగా, గ్రంధి అప్పన్న, తదితరులు అమ్మవారి అత్తింటివారుగా వ్యవహరిస్తారు.

ఇక.. మావుళ్లమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లేవారు.. అక్కడికి 15 కి.మీ దూరంలోనే ఉన్న పంచారామాల్లో ఒకటైన గునుపూడి సోమేశ్వరాలయాన్ని, యనమదుర్రు శక్తేశ్వర స్వామి దేవాలయం కూడా చూసి రావచ్చు.

Related News

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Big Stories

×