BigTV English

Rakesh Sharma : రాకేశ్ శర్మ మన ఉస్మానియా స్టూడెంటే..!

Rakesh Sharma : రాకేశ్ శర్మ మన ఉస్మానియా స్టూడెంటే..!

Rakesh Sharma : అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు ఎవరంటే..! ఠక్కున వచ్చే జవాబు.. రాకేశ్‌ శర్మ. 1949 జనవరి 13న పంజాబ్‌లోని పాటియాలాలో జన్మించిన ఆయన హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యారు. బాల్యం నుంచే సైన్స్‌, మాథ్స్‌లో మంచి ప్రతిభ గల రాకేశ్.. డిగ్రీ తర్వాత నేషనల్ డిఫెన్స్ సర్వీసు పరీక్షలో పాసై, 1970లో 21 ఏళ్ల వయసులో భారత వైమానిక దళంలో చేరారు. అక్కడ ఆయన సూపర్ సోనిక్ జెట్ ఫైటర్ విమానాలను నడిపేవారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో 22 ఏళ్ల వయసులో పాల్గొన్నారు. పాతికేళ్లు వచ్చే సరికి మన ఎయిర్ ఫోర్స్‌లో ఉత్తమ పైలట్‌గా గుర్తింపు పొందారు.


భారత అంతరిక్ష కార్యక్రమాలను శరవేగంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ.. నాటి సోవియట్ యూనియన్ సహాయం కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో రష్యా అంతరిక్ష యానం కోసం 50 మంది ఫైటర్ పైలట్లకు నిర్వహించిన పరీక్షలో భారత్ నుంచి రాకేశ్ శర్మ, రవీష్ మల్హోత్రా ఎంపికయ్యారు. దీంతో 1983లో వారిద్దరినీ రష్యాలో శిక్షణ కోసం పంపారు. మాస్కోకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టార్ సిటీలోని వ్యోమగాముల శిక్షణా కేంద్రంలో ఏడాది పాటు శిక్షణ పొందారు.

అక్కడ రోజుకు ఏడు గంటల పాటు రష్యన్ భాష నేర్చుకుంటూ.. కేవలం 3 నెలల్లోనే రష్యన్ భాషపై పట్టుసాధించారు. అలా.. నాటి సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్‌లోని అంతరిక్ష కేంద్రం నుంచి 1984 ఏప్రిల్ 3న రష్యన్ వ్యోమగాములైన యూరి మలిషెవ్, గెన్నాడీ స్ట్రెకలోవ్‌లతో కలిసి రాకేష్ శర్మ సోవియట్ రాకెట్‌ (సూయజ్ టీ 11)లో అంతరిక్షానికి వెళ్లి.. 8 రోజుల పాటు అక్కడే ఉన్నారు.


అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో రాజ్‌ఘాట్ మట్టిని, నాటి ప్రధాని ఇందిర, రాష్ట్రపతి జైల్ సింగ్, రక్షణమంత్రి వెంకటరామన్, రాజ్‌ఘాట్ ఫొటోలను అంత‌రిక్షంలోకి తీసుకెళ్లాననీ, మైసూర్‌లోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్ సాయంతో వారు ప్యాక్ చేసిచ్చిన రవ్వ హల్వా, ఆలూ చోలే, వెజ్ పులావ్‌లను తోటి వ్యోమగాములతో పంచుకు తిన్నానని ఆయన తర్వాత ఓ ఇంటర్వూలోనూ చెప్పుకొచ్చారు. అక్కడి గ్రావిటీ పరిస్థితులను తట్టుకోవడానికి యోగా సాయపడుతుందా అనే కుతూహలంతో అక్కడ యోగా కూడా ట్రై చేసినా అది కుదరలేదని వెల్లడించారు.

అంతరిక్షంలో రాకేశ్ బృందం ఉన్నప్పుడు.. ‘అక్కడి నుంచి భారత్‌ ఎలా కనిపిస్తోంది’ అని నాటి ప్రధాని ఇందిర అడగగా, ‘సారే జహాసే అచ్చా’ (మిగతా ప్రపంచం కంటే ఉత్తమం) అంటూ బదులిచ్చారు. ఆ అంతరిక్ష ప్రయాణం తర్వాత తిరిగి ఆయన భారత వాయుసేనలో తిరిగి చేరి సేవలందించారు. తర్వాతి రోజుల్లో జాగ్వార్, తేజస్‌ విమానాలనూ నడిపారు. వింగ్ కమాండర్‌గా ఆయన పదవీ విరమణ చేశారు. తర్వాతి రోజుల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో, 2006లో ఇస్రో కమిటీలో సభ్యుడిగా సేవలందించారు.

తన సేవలకు గానూ.. రష్యా ప్రభుత్వపు.. హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అవార్డు, భారత ప్రభుత్వపు అశోక చక్ర అవార్డులనూ అందుకున్నారు. కాగా, ప్రస్తుతం రాకేశ్‌ శర్మ జీవితంపై బాలీవుడ్‌లో ‘సారే జహాసే అచ్చా’ బయోపిక్‌ సినిమా రానుంది. ప్రస్తుతం, శర్మ తమిళనాడులోని మారుమూల కూనూర్ జిల్లాలో తనదైన శైలిలో ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. భారత జాతి కీర్తి పతాకను రోదసిలో నిలిపిన రాకేశ్ శర్మకు 75వ పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×