Vimana Venkateswara Swami: తిరుమల ఆనంద నిలయంలోని గర్భగుడి గోపురం మీద ఉన్న వెంకటేశ్వర స్వామిని విమాన వెంకటేశ్వరుడని ఎందుకు పిలుస్తారు…? అసలు స్వామికి ఆ పేరెలా వచ్చింది..? ఆ స్వామికి ఆ పేరు భక్తులు పెట్టారా..? పండితులు పెట్టారా..? లేకపోతే ఎవరైనా దేవతలు పెట్టారా..? తిరుమల మూల విరాట్ దర్శనం తర్వాత విమాన వెంకటేశ్వరుడిని తప్పకుండా ఎందుకు దర్శించుకోవాలి… ఈ నియమం వెనక ఏదైనా అంతర్యం ఉందా..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆనంద నిలయం ఎన్నో అద్బుతాలకు నెలవు.. స్వామి వారి లీలలు అనన్యసామాన్యం. ఎంతో మంది భక్తుల కొంగుబంగారమై విలసిల్లుతున్నారు శ్రీనివాసుడు.. అలాంటి స్వామి దర్శన భాగ్యం కోటి జన్మల ఫుణ్యఫలంగా బావిస్తుంటారు శ్రీవారి భక్తులు. అయితే స్వామి వారి దర్శనం తర్వాత ఆనంద నిలయంపై ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని తప్పకుండా దర్శించుకోవాలంటారు పండితులు. అయితే విమాన వెంకటేశ్వర స్వామికి ఆ పేరెలా వచ్చింది. ఆ స్వామిని తప్పకుండా ఎందుకు దర్శించుకోవాలి అనేది కూడా పండితులు తెలిపారు.
సాధారణంగా వాడుక బాషలో విమానం అంటే ఆకాశంలో ఎగిరేది అని అర్థం. కానీ ఆగమశాస్త్రం ప్రకారం గుడిలో దేవుడు ఉండే గర్భగుడి మీద నిర్మించే గోపురాన్ని విమానం అంటారట. తిరుమల శ్రీవారి గర్భగుడి పైన ఉన్న బంగారు గోపురం పేరు ఆనంద నిలయం. పైన ఉండే పెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. గర్భగుడి పైన ఉండే దాన్ని విమానం అంటారు. తిరుమల శ్రీవారు ఈ ఆనంద నిలయ గోపురం ( విమాన) మీద కొలువై ఉన్నాడు కాబట్టి ఆయన్ను విమాన వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు.
స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలోనే విమాన వెంకటేశ్వర స్వామి గురించి ఉందని పండితులు చెప్తున్నారు. తిరుమల శ్రీవారి ఆనంద నిలయంలోని గర్భగుడి గోపురం మీద ఉత్తర దిశగా విమాన వెంకటేశ్వరుడై కొలువై ఉన్నాడు. పురాణాల ప్రకారం గర్భగుడిలోని ప్రధాన మూలవిరాట్‌కు ఉన్న మహత్యమే విమాన వెంకటేశ్వరుడికి ఉంటుందట. ఎవరైనా ఏదైనా కారణం వల్ల మూల విరాట్‌ను దర్శించుకోలేకపోతే విమాన వెంకటేషుడిని దర్శించుకుంటే శ్రీవారిని దర్శించుకున్న ఫలితమే వస్తుందట. తిరుమల శ్రీవారిని దర్శించిన తరువాత విమాన వేంకటేశ్వరుని కూడా దర్శించుకుంటే జన్మాంతర పాపాలు తొలగిపోతాయని, సర్వశుభాల అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
వెంకటాచలం మహత్యం ప్రకారం విమాన వెంకటేశ్వరుడిని తొండమాన్ చక్రవర్తి ప్రతిష్టించారట. అప్పటి నుంచి భక్తులు శ్రీవారితో సమానంగా విమాన వెంకటేశ్వరుడిని దర్శించుకుంటున్నారట. అయితే 1982లో జరిగిన మహా సంప్రోక్షణ తర్వాత బంగారు పూత పూస్తున్నప్పుడు విమాన వెంకటేశ్వరుణ్ని గుర్తు పట్టడానికి వెండి మకరతోరణం అమర్చారు. దీంతో భక్తులు ఈజీగా స్వామి వారిని చూడగలుగుతున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.