Mysteries of Puri Jagannath temple: పూరీ జగన్నాథుడి రథయాత్ర అనగానే మనకు ఆకాశమంత ఎత్తున్న మూడు రథాలు, వాటిని లాగే లక్షలాది మంది భక్తులు గుర్తుకువస్తారు. అయితే ఈ రథాలను ప్రతి ఏటా కొత్తగా, కేవలం పవిత్రమైన వేప చెక్కలతోనే తయారు చేస్తారనే విషయం మీకు తెలుసా? ఈ చెక్కలను ఇక్కడ ‘దారు’ లేదా ‘దారు బ్రహ్మ’ అని పిలుస్తారు. కానీ.. రోడ్డు పక్కన ఉండే ఏ వేప చెట్టు పడితే ఆ చెట్టును ఈ రథాల కోసం అస్సలు వాడరు. రథాల తయారీకి వాడే వేప చెట్టుకు కొన్ని నమ్మశక్యం కాని లక్షణాలు, కఠినమైన నియమాలు ఉంటాయి. ఆ షాకింగ్ నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ జగన్నాథ ఆలయ సాంప్రదాయం ప్రకారం రథాల తయారీకి వాడే వేప చెట్టును వెతకడం ఒక పెద్ద యజ్ఞం లాంటిది. దీనిని ‘బనజాగ యాత్ర’ అని పిలుస్తారు. ఆలయ పూజారులు, సేవకులు గుంపులుగా ఏర్పడి ఒరిస్సాలోని అడవులు, గ్రామాలలో కాలినడకన తిరుగుతూ ఈ ప్రత్యేకమైన వేప చెట్ల కోసం వెతుకుతారు. ఈ వేప చెట్టు దొరకడం అనేది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఆ చెట్టుకు కొన్ని దైవిక లక్షణాలు ఉంటేనే దానిని రథాల తయారీకి లేదా విగ్రహాల తయారీకి అర్హమైనదిగా గుర్తిస్తారు.
మొదటి షాకింగ్ నిజం ఏంటంటే.. ఆ వేప చెట్టుపై ఖచ్చితంగా దైవిక గుర్తులు ఉండాలి. పూజారులు వెతికే వేప చెట్టు కాండం మీద సహజసిద్ధంగా ఏర్పడిన శంఖు, చక్రం, గద, పద్మం వంటి మహావిష్ణువు ఆయుధాల గుర్తులు ఉండాలి. ఈ గుర్తులు చెట్టు తొర్రలలోనో లేదా బెరడు పైనో స్పష్టంగా కనిపించాలి. ఇలాంటి గుర్తులు ఉన్న చెట్టును చూసినప్పుడే అది సాక్షాత్తూ జగన్నాథుడి లీలగా భావిస్తారు.
రెండవ వింతైన విషయం.. ఆ చెట్టుకు రక్షణగా పాములు ఉండటం. అవును, రథాల కోసం ఎంపిక చేసే వేప చెట్టు మొదలు వద్ద లేదా ఆ చెట్టు కొమ్మల పైన కనీసం ఒక నాగుపాము అయినా నివసిస్తూ ఉండాలి. ఆ పాము ఆ చెట్టును కాపాడుతున్నట్టుగా ఉంటుంది. అలాగే.. ఆ చెట్టు పక్కన శ్మశానం గానీ, లేదా ఏదైనా శివాలయం గానీ ఉండటం మరో ముఖ్యమైన రూల్. ఇవన్నీ వినడానికి కథల్లా అనిపించినా, ఇప్పటికీ పూరీ పూజారులు ఇలాంటి లక్షణాలు ఉన్న చెట్లనే వెతికి పట్టుకుంటారు.
మూడవ నియమం ఏంటంటే.. ఆ చెట్టు చాలా పవిత్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. ఆ వేప చెట్టుకు ఎలాంటి పక్షుల గూళ్లు ఉండకూడదు. పక్షులు రెట్టలు వేసి అపవిత్రం చేసిన చెట్లను రథాల కోసం అస్సలు వాడరు. అలాగే ఆ చెట్టుపై ఎప్పుడూ పిడుగు పడి ఉండకూడదు. ఎలాంటి చీడపీడలు లేకుండా కాండం చాలా బలంగా, నిటారుగా ఉండాలి. చెట్టు చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి.
Also Read: అక్కడ పై కుండలోని అన్నం ముందెందుకు ఉడుకుతుంది? పూరీ జగన్నాథుడి వంటగది మిస్టరీ!
ఇలాంటి లక్షణాలు.. ఉన్న వేప చెట్టు దొరికిన తర్వాత, పూజారులు ఆ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే ఆ చెట్టును నరకడానికి అనుమతి ఉంటుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ చెట్టును నరకడానికి సాధారణ గొడ్డళ్లను వాడరు. కేవలం బంగారం, వెండి , రాగితో చేసిన ప్రత్యేకమైన గొడ్డళ్లను మాత్రమే ఉపయోగిస్తారు. చెట్టును నరికిన తర్వాత ఆ పవిత్రమైన కలపను ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్ల బండ్లపై ఉంచి, మంగళవాయిద్యాల నడుమ పూరీ ఆలయానికి తరలిస్తారు.
చూశారుగా.. పూరీ జగన్నాథుడి రథాల కోసం వాడే వేప చెట్టు వెనక ఎన్ని ఆశ్చర్యకరమైన ఆచారాలు, రహస్యాలు దాగున్నాయో. వందల ఏళ్ల నాటి ఈ సంప్రదాయాలను పూరీలో ఏమాత్రం మార్చకుండా అలాగే పాటిస్తున్నారు. లాజిక్కులకు అందకపోయినా.. ప్రతి ఏటా ఇలాంటి అద్భుతమైన గుర్తులున్న వేప చెట్లే పూజారులకు దొరకడం భగవంతుడి లీల కాక మరేంటి?