Astrology Donation for Graha Dosha: జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ లభించడం లేదా? ఇంట్లో నిరంతరం గొడవలు, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయా? అయితే దానికి మీ జాతకంలోని గ్రహ దోషాలే.. కారణం కావచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాల చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి పూజలు, జపాలతో పాటు ‘దానం’ చేయడం అత్యంత సులువైన, పవర్‌ఫుల్ మార్గం. కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సరైన పద్ధతిలో దానం చేయడం వల్ల గ్రహాలు శాంతించి, మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ అద్భుతమైన వస్తువులు ఏంటో, వాటిని ఎలా దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహానికి ఒక నిర్దిష్టమైన రంగు, వస్తువు , ధాన్యం ఉంటాయి. మన జాతకంలో ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు లేదా చెడు ప్రభావాన్ని చూపిస్తున్నప్పుడు.. దానికి సంబంధించిన వస్తువులను అర్హులకు దానం చేయడం ద్వారా ఆ దోష తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
1. అన్నదానం:
శాస్త్రాలలో అన్ని దానాల కంటే ‘అన్నదానం’ మిన్న అని చెప్పారు. ఆకలితో ఉన్నవారికి కడుపునిండా భోజనం పెట్టడం వల్ల అన్నపూర్ణా దేవి అనుగ్రహంతో పాటు జాతకంలోని పితృ దోషాలు, రాహు-కేతువుల ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శనివారం లేదా అమావాస్య రోజుల్లో పేదలకు అన్నదానం చేయడం వల్ల సకల కష్టాలు మాయమవుతాయి.
2. నల్ల నువ్వులు, ఆవాల నూనె (శని దోష నివారణ):
మీకు ఏల్నాటి శని లేదా శని మహాదశ నడుస్తుంటే.. జీవితం చాలా అస్తవ్యస్తంగా మారుతుంది. పనుల్లో ఆటంకాలు వస్తాయి. దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే.. శనివారం రోజు నల్ల నువ్వులు, ఆవాల నూనె లేదా ఇనుప వస్తువులను దానం చేయడం. ఇలా చేయడం వల్ల శని దేవుడు శాంతించి, మీ వ్యాపారం, ఉద్యోగాల్లో ఉన్న సమస్యలను తొలగిస్తాడు.
3. బెల్లం, గోధుమలు:
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగాలన్నా.. ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా జాతకంలో సూర్యుని బలం చాలా ముఖ్యం. సూర్య దోషం ఉన్నవారు ఆదివారం రోజున ఎరుపు రంగు వస్త్రం, బెల్లం లేదా గోధుమలను దానం చేయాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా.. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
4. ఆకుపచ్చని వస్తువులు లేదా పెసలు:
వ్యాపారంలో నష్టాలు వస్తున్నా.. చదువులో ఏకాగ్రత కుదరకపోయినా బుధ గ్రహ దోషం ఉన్నట్లు అర్థం. దీనికోసం బుధవారం రోజున ఆకుపచ్చని పెసలు, పచ్చని గాజులు లేదా ఆకుపచ్చ బట్టలను దానం చేయాలి. వీలైతే ఆవుకు పచ్చగడ్డి తినిపించడం వల్ల బుధుడు ప్రసన్నుడై బుద్ధి బలాన్ని, వ్యాపార లాభాలను ఇస్తాడు.
5.పాలు,పెరుగు లేదా వెండి:
జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఒత్తిడి, డిప్రెషన్ ఎక్కువగా ఉంటాయి. చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం రోజున పాలు, పెరుగు, బియ్యం లేదా వెండిని దానం చేయాలి. ఇది మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.
దానం అనేది ఎల్లప్పుడూ నిస్వార్థంగా, అవసరమైన వారికి మాత్రమే చేయాలి. అప్పుడే దాని పూర్తి ఫలితం మనకు దక్కుతుంది. మీ జాతకానికి సరిపోయే దానాన్ని ఎంచుకుని, పూర్తి నమ్మకంతో చేసి చూడండి..మీ జీవితంలో వచ్చే పాజిటివ్ మార్పులను మీరే గమనిస్తారు.