Friday Lakshmi Devi Pooja: హిందూ సంప్రదాయంలో శుక్రవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఐశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీదేవికి ఈ రోజు అత్యంత ప్రీతికరమైనది. చాలా మంది ఇంట్లో నిరంతరం ధన నష్టం జరగడం, ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం వేళ ఇంట్లోని కొన్ని పవిత్రమైన ప్రదేశాలలో దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి.. ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. మరి ఇంట్లోని ఆ 5 ముఖ్యమైన ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం దీపం పెట్టాల్సిన 5 ప్రదేశాలు:
శుక్రవారం సాయంత్రం ప్రదోష కాలంలో ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఈ సమయంలో ఇల్లంతా దీప కాంతులతో వెలిగిపోతే.. లక్ష్మీ దేవి స్థిరనివాసం ఏర్పరుచుకుంటుంది. ముఖ్యంగా ఈ 5 చోట్ల దీపాలు పెట్టడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది.
1. ప్రధాన ద్వారం (సింహద్వారం):
ఇంటి సింహద్వారం గుండానే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే శుక్రవారం సాయంత్రం ఇంటి ప్రధాన దారానికి ఇరువైపులా లేదా కనీసం కుడి వైపున ఒక దీపం వెలిగించాలి. వీలైతే.. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం పెడితే చాలా మంచిది. ఇది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా అడ్డుకుంటుంది.
2. పూజా మందిరం (దేవుడి గది):
ఇది అందరూ చేసేదే అయినప్పటికీ.. శుక్రవారం నాడు దేవుడి గదిలో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు రెండు వత్తులు వేసి నెయ్యి దీపం వెలిగించాలి. తామర వత్తులతో దీపం పెడితే అమ్మవారికి మరింత ప్రీతికరం. దీపం వెలిగించాక లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి.
3. తులసి కోట:
తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. శుక్రవారం సాయంత్రం తులసి కోట వద్ద దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. తులసి వద్ద దీపం పెట్టేటప్పుడు కొద్దిగా అక్షతలు లేదా పువ్వులు కింద పెట్టి, దానిపై ప్రమిదను ఉంచడం మంచిది.
ఆర్థిక ఇబ్బందులు తొలగించే మరో రెండు ప్రదేశాలు:
4. ఈశాన్య మూల: ఇంటి ఈశాన్య మూలను దేవతల స్థానంగా చెప్తారు. శుక్రవారం నాడు ఈశాన్య మూలలో ఒక చిన్న ప్రమిదలో దీపం వెలిగించి ఉంచడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. వ్యాపారంలో నష్టాలు ఉన్నవారికి లాభాలు రావడం స్టార్ట్ అవుతుంది.
5. వంటగది: వంటగదిని అన్నపూర్ణా దేవి నిలయంగా భావిస్తారు. శుక్రవారం రాత్రి వంట అంతా పూర్తయ్యాక, కిచెన్ ప్లాట్‌ఫారమ్ పైన లేదా తాగునీరు ఉంచే చోట ఒక చిన్న దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ధాన్యానికి, ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు.
దీపం వెలిగించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన నియమాలు:
దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేలపై పెట్టకూడదు. కింద ఒక చిన్న ప్లేట్ లేదా కనీసం ఆకులు, పువ్వులు ఉంచి దానిపై ప్రమిదను పెట్టాలి.
దీపపు వత్తులు తూర్పు లేదా ఉత్తర దిశ వైపు చూస్తున్నట్లుగా ఉండాలి. పడమర లేదా దక్షిణం వైపు పెట్టకూడదు.
నమ్మకంతో, భక్తితో శుక్రవారం నాడు ఇంట్లోని ఈ 5 ప్రదేశాలలో దీపాలు వెలిగించి చూడండి. మీ ఇంట్లో ఉండే నెగటివిటీ, అశాంతి మాయమై ప్రశాంతత లభిస్తుంది. లక్ష్మీ దేవి ఆశీస్సులతో మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.