ఆజన్మ బ్రహ్మచారిగా హనుమంతుడిని చెప్పుకుంటారు. అతడు చిరంజీవి కూడా. అమరుడైన హనుమంతుడు నేటికీ భూమి పైన తిరుగుతున్నాడని ఎంతోమంది భక్తుల నమ్మకం. రామనామ స్మరణ ఎక్కడ వినిపిస్తే అక్కడికి హనుమంతుడు వస్తాడని అంటారు. అయితే హనుమంతుడిని పూజించేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు హనుమంతుడిని పూజించే విషయంలో చాలా జాగ్రత్తగా నియమనిష్ఠలతో ఉండాలి.
మహిళలు తాకవద్దు
ముఖ్యంగా హనుమంతుడిని పూజించేటప్పుడు మహిళలు అతని విగ్రహాన్ని కానీ పాదాలను కానీ తాకకూడదు. చాలామంది అతని పాదాలను తాకి నమస్కరించి వెళుతూ ఉంటారు. అలా చేయడం పురాణాల ప్రకారం నిషేధం. అలా ఎందుకు ముట్టకూడదో కూడా పురాణాలు వివరిస్తున్నాయి.
హనుమంతుడిని పూజించేందుకు మంగళవారం ఉత్తమమైన రోజుగా చెప్పుకుంటారు. ఆ రోజే ఎక్కువమంది ఆంజనేయుడిని పూజిస్తారు. హనుమంతుడి ఆశీర్వాదాలు తీసుకోవాలనుకునే మహిళలు అతని పాదాలను తాకేందుకు ప్రయత్నిస్తారు. అలా చేయడం పద్ధతి కాదు. కేవలం మగవారు మాత్రమే హనుమంతుడి పాదాలను, విగ్రహాన్ని తాకవచ్చు. దీనికి కారణం హనుమంతుడు బాల్యం నుండి బ్రహ్మచారి.
వివాహమైంది కానీ…
బ్రహ్మచారి అంటే ప్రాపంచిక కోరికలను వదిలేసిన వ్యక్తి. మత గ్రంథాలు చెబుతున్న ప్రకారం హనుమంతుడు వివాహం చేసుకున్నాడు. కానీ ఈ వివాహము కేవలం తన విద్యను పూర్తి చేయడానికి మాత్రమే చేసుకున్నాడు. కానీ ఇతర ఎలాంటి గృహస్తు పనులు ఆయన చేయలేదు. హనుమంతుడు సూర్యుడి నుంచి వేదాలను నేర్చుకున్నాడు. అయితే నవ వ్యాకర్ణాలు అనే గ్రంథం అధ్యయనం చేయడానికి కేవలం వివాహితుడు అయిన వ్యక్తికే అవకాశం ఉంటుంది. దీంతో సూర్యదేవుడు తన కూతురు సువర్చలతోనే ఆంజనేయుడికి వివాహం జరిపించాడు.
ఇందుకోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సూర్య భగవానుడి సాయంతో సూర్యుని కిరణాల ప్రకాశం నుంచి సువర్చలాదేవిని సృష్టించారు. ఆమె తల్లి గర్భం నుంచి జన్మించలేదు. ఆంజనేయుడికి సువర్చలకు వివాహం అయినప్పటికీ ఇద్దరూ కూడా జీవితాంతం బ్రహ్మచారులుగానే ఉన్నారు. సువర్చలకు కూడా ఆంజనేయుడు తన తల్లి సమానమైన హోదాను ఇచ్చాడు. బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటించాడు.
పెళ్లి చేసుకున్నప్పటికీ బ్రహ్మచారి వ్రతాన్ని వదలకుండా కాపాడుకున్న దేవుడు హనుమంతుడు. అందుకే స్త్రీలు ఎప్పుడూ కూడా హనుమంతుడి పాదాలను లేదా విగ్రహాన్ని తాకకూడదు. దీపం వెలిగించడం, నైవేద్యాలు పెట్టడం, హానుమాన్ చాలీసా చదవడం వంటివన్నీ కూడా చేయవచ్చు. కానీ అతని విగ్రహాన్ని మాత్రం తాకరాదు.
సింధూరాన్ని కూడా పెట్టకూడదు
అలాగే మహిళలు హనుమంతుడిని పూజించేటప్పుడు సింధూరాన్ని అతనికి తమ చేతులతో పెట్టకూడదు. అలాగే హనుమంతుడి ముందు మహిళలు తలవంచుకొని నిలబడకూడదు. అలాగే పురుషులైనా మహిళలైనా కూడా హనుమంతుడికి పంచామృతాన్ని సమర్పించకూడదు.
పైన చెప్పిన నియమాల ప్రకారమే ప్రతి మంగళవారం ఆ ఆంజనేయుడిని ప్రతి ఒక్కరూ పూజించాలి.