Famous Mahalaxmi Temple: భారత దేశంలో మహాలక్ష్మి దేవికి ఉన్న అత్యంత పురాతన, అధునాతన ఆలయాలేవి? ఈ ఆలయాలను ప్రత్యేకించి ఎందుకు సందర్శించాలి? కంచికామకోటి పీఠం వారి అష్టలక్ష్మీ ఆలయాలు ఎన్ని? ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇటు ఆధ్యాత్మిక, అటు చారిత్రక పర్యాటకులు వీటిని సందర్శించడం వల్ల వచ్చే లాభం ఎలాంటిది? ఇప్పుడు చూద్దాం.
మధ్య ప్రదేశ్ ఇండోర్ లో 300 ఏళ్లనాటి లక్ష్మీ ఆలయం
మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో 300 ఏళ్ల నాటి మహా లక్ష్మీ దేవి ఆలయం ఎంతో ప్రసిద్ధమైనది. ఈ ప్రాంతంలోనే లక్ష్మీదేవికి చెందిన అత్యంత పురాతనమైన ఆలయంగా భావిస్తారు. ఆలయ ప్రాంగణంలోని పవిత్ర వృక్షం చుట్టూ దారం కడితే కోరిన కోర్కె నెరవేరుతుందని నమ్ముతారు.
రాజస్థానీ, మరాఠ శైలిలో ఇండోర్ లక్ష్మీ టెంపుల్
ఇండోర్ మహాలక్ష్మీ ఆలయం నిర్మాణం రాజస్థానీ, మరాఠ శైలిలో ఉంటుంది. ఇక్కడ వినాయక శివ ఆలయాలు కూడా ఉన్నాయి. నవరాత్రి వేడుకలు, దీపావళి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ప్రాంతంలోనే ఇదో సాంస్కృతిక కేంద్రంగా భాసిల్లుతోంది. ఈ ఆలయానికి దగ్గర్లో అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంది. రాజ్ వాడా ప్రాంతంలో ఉండే ఈ ఆలయంలో ఇంకా ఎన్నో ప్యాలెస్ లు కూడా చూడవచ్చు.
12వ శతాబ్దికి చెందిన లక్ష్మీదేవి ఆలయం
ఇండోర్ నుంచి మనం కర్ణాటకలోని హసన్ జిల్లా- దొడ్డగడ్డవల్లికి వెళ్తే.. ఇక్కడ 12వ శతాబ్ది కాలం నాటి లక్ష్మీ దేవి ఆలయం దర్శనమిస్తుంది.
తూర్పున లక్ష్మీదేవి, ఉత్తరాన మహాకాళి..
చతురస్రాకార నిర్మాణమైన ఈ ఆలయంలో.. తూర్పు మందిరంలో లక్ష్మీ దేవి స్థిర నివాసం ఏర్పరుచుకోగా.. ఉత్తరాన మహాకాళీ, పశ్చిమాన పరమేశ్వరుడు, దక్షిణాన మహా విష్ణువు కొలువుదీరినట్టు కనిపిస్తుంది. ఆక్రమణ దారుల దాడుల కారణంగా విష్ణువు మందిరం ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోంది. ఆలయంలో కాలభైరవ మందిరం కూడా కనిపిస్తుంది. మొత్తం 9 ఆలయాలతో పిరమిడల్ ఉత్తర భారత నిర్మాణ శైలిలో ఈ ఆలయం కనిపిస్తుంది. నాలుగు మూలల్లో నాలుగు గోపురాలతో కూడిన వివిధ ఉపాయాలయాల నిర్మాణం అబ్బురమనిస్తాయి.
హసన్ కి 20 కి. మీ, బేలూరుకు 25 కి. మీ దూరం
హసన్ కి 20 కిలోమీటర్ల దూరంలో, హళేబీడు, బేలూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఎందుకు రావాలి? అంటే పురాతన లక్ష్మీ దేవి ఆలయాల్లో ఇదే అత్యంత శ్రేష్టమైనది. కారణం దీన్ని 1113 సంవత్సరంలో ప్రసిద్ధ హొయసల రాజు విష్ణువర్ఱనుడి పాలనలో.. స్థానిక వ్యాపారి కల్హణరావు, అతడి భార్యా సహజాదేవి నిర్మించినట్టు చెబుతుంది ఆలయ చరిత్ర.
తమిళనాడు, వేలూరు, తిరుమలకొడిలో స్వర్ణదేవాలయం
హొయసల నిర్మాణ శైలి ఎందుకంత ప్రత్యేకమైనదంటే.. ఇది కర్ణాటకలోని 11, 14వ శతాబ్దాల మధ్య అభివృద్ధి చెందిన ఒకానొక నిర్మాణ శైలి. మరీ ముఖ్యంగా బేలూరు హళేబేడు, సోమనాథపురలో ఈ నిర్మాణ శైలి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ శైలిలో నిర్మించిన శిల్పాలు అత్యంత క్లిష్టంగా ఉంటాయి. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. అంతే కాదు ఆ శిల్పంలో కనిపించే డీటైలింగ్ వర్క్ మరే శిల్ప చాతుర్యంలోనూ కనిపించదు. మరెక్కడా చూడలేని అత్యంత సూక్ష్మ నిర్మాణ శైలి ఆశ్చర్య పరుస్తుంది. ఈ ఆలయాల్లో రామాయణ, మహాభారత కథలను అత్యంత సూక్ష్మంగా అత్యంత సున్నితంగా చెక్కినట్టు కనిపిస్తారు. హొయసల నిర్మాణ శైలిని కర్ణాటక ద్రవిడ నిర్మాణశైలిగా వర్ణిస్తారు. ఇది ద్రవిడ, నాగార శైలి లక్షణాలతో కనిపిస్తుంది. హొయసల నిర్మాణం చెక్కడానికి ఎంతో వీలుగా ఉండే సున్నితమైన రాళ్లతో ఉంటాయి. శిల్పం శైలిలోని సాంకేతిక నైపుణ్యం.. మరెక్కడా కనిపించనంత గొప్పగా అనిపిస్తాయి. అందుకే హొయసల నిర్మాణ శైలిలో ఒక మాన్యుమెంట్ లాంటి ఈ ఆలయం.. కర్ణాటక పర్యాటకులు తప్పక దర్శించుకోవల్సిన సందర్శనీయ స్థలంగా మారిందని అంటారు.
తిరపతి- 120 కి. మీ, చెన్నై- 145 కి. మీ..
ఇక లక్ష్మీ ఆరాధన చేయాలనుకునేవారు.. దర్శించాల్సిన మరో ముఖ్యమైన పుణ్యక్షేత్రం.. వేలూరు దగ్గర్లోని తిరుమల కోడిలో వెలసిన స్వర్ణ మహాలక్ష్ష్మీ ఆలయం. ఇది తిరుపతికి 120 కిలోమీటర్ల దూరంలో, చెన్నై నుంచి 145 కిలోమీటర్లు, పాండిచ్చేరి నుంచి 160 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
2007, ఆగస్టు 24న స్వర్ణ మహాలక్ష్మీ ఆలయ ప్రారంభం
ఇక్కడి అమ్మవారిని స్వర్ణ లక్ష్మీ దేవి లేదా నారాయణి అమ్మవారిగా పిలుస్తారు. ఈ ఆలయం 2007, ఆగస్టు 24న ఈ ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత మొత్తం స్వర్ణాలంకార భూషితంగా ఉంటుంది. దక్షిణాదిలోనే ఏకైక స్వర్ణ దేవాలయంగా భాసిల్లుతోంది.
దక్షిణాదిలోనే ఏకైక స్వర్ణ దేవాలయం
మాములుగా లక్ష్మీ దేవి బంగారంలో కొలువుదీరి ఉంటుందని విశ్వసిస్తుంటారు. అలాంటి బంగారంతో కూడిన ఆలయంలో అమ్మవారిని ప్రతిష్టిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకునే వారు ఈ ఆలయం సందర్శిస్తే సరిపోతుంది. అంత గొప్ప స్వర్ణ శోభతో అలరారుతూ దర్శనమిస్తారు ఇక్కడి అమ్మవారు.
100 ఎకరాల స్థలంలో నారాయణీ పీఠం వారి నిర్మాణం
ఈ ఆలయం సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో.. నిర్మించారు. వేలూరుకు చెందిన శ్రీనారాయణి పీటం వారు.. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శక్తి అమ్మన్ పేరిట పిలిచే ఒక గురువు అధ్వర్యంలో నిర్మించిన ఆలయమిది. శ్రీపురంగా పిలిచే ఈ ఆలయ నిర్మాణం శ్రీచక్ర ఆకారంలో కనిపిస్తుంది. స్వర్ణ లక్ష్మీ దేవి కొలువుదీరిన స్వర్ణాలయానికి చేరుకోడానికి నక్షత్ర ఆకారంలో భక్తులు నడవాల్సి ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్వహించే శ్రీ నారాయణి పీటం ఛారిటబుల్ ట్రస్ట్- ఆలయానికి దగ్గర్లో ఒక ఆస్పత్రిని సైతం నిర్వహిస్తుంటుంది. ఈ ఆలయం సందర్శించాలనుకునే తెలుగు వారు చెన్నైకి గానీ, తిరుపతికి గానీ వస్తే.. ఆపై ఈ ఆలయానికి చేరుకోవడం సులభమవుతుంది.
1976లో అహోబిల మఠాధిపతిచే ప్రారంభం
చైన్నైలో లక్ష్మీదేవి పేరిట అష్ట లక్ష్మీ ఆలయం ఒకటి కొలువై ఉంది. ఇది చెన్నైలోని ఇలియట్స్ బీచ్ కి దగ్గర్లో ఉంది. నడిచే దైవంగా పేరున్న చంద్రశేఖర సరస్వతి ఆదేశాల మేరకు 1974 జనవరిలో ఈ ఆలయానికి పునాది వేశారు. 1976 ఏప్రిల్లో.. అహోబిల మఠానికి చెందిన గురువు యతీంద్ర దేశికన్ వారి సమక్షంలో దేవాలయ సంప్రోక్షణ జరిగింది. ఈ ఆలయంలో లక్ష్మీ దేవి ఎనిమిది రూపాల్లోని అష్ట లక్ష్ములు.. కొలువుదీరారు. ఇక్కడ ఆదిలక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్య లక్ష్మి, ధన లక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, గజ లక్ష్మి విగ్రహాలతో పాటు.. లక్ష్మీనారాయణుల విగ్రహాలు సైతం దర్శనమిస్తాయి. ఇక దేవాలయంలో దశావతారాలతో పాటు గురువాయురప్పన్, గణేశ, ధన్వంతరీ, ఆంజనేయ విగ్రహాలుంటాయి.
1996 ఏప్రిల్ లో.. కంచికామకోటి పీఠం అధ్వర్యంలో..
హైదరాబాద్ లో కూడా ఇదే తరహాలో అష్టలక్ష్మీ టెంపుల్ కనిపిస్తుంది. 1996 ఏప్రిల్ లో.. కంచికామకోటి పీఠం వారి అధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించారు. ది దిల్ సుఖ్ నగర్, ఎల్ బీ నగర్ మధ్య కొత్త పేటలోని వాసవీ కాలనీలో ఈ ఆలయం కనిపిస్తుంది.
హైదరాబాద్ లోనూ అష్టలక్ష్మీ ఆలయం
ఈ ఆలయం ఇసుక, సిమెంటుతో నిర్మించినప్పటికీ.. ఈ నిర్మాణ శైలి అద్భుతంగా అగుపిస్తుంది. ఈ ఆలయంలోనూ లక్ష్మీదేవికి చందిన అష్టలక్ష్ములు అష్ట భాగ్యాలను ప్రసాదించడానికి కొలువుదీరి ఉంటారు. ఈ దేవతా మూర్తులు వివిధ అంకరణలతో జగజ్జేయమానంగా దర్శనమిస్తారు. రాత్రివేళల్లో ఆలయం విద్యుద్దీపాలంకరణలో శోభాయమానంగా దర్శనమిస్తుంది.