
Kartika Vanabhojanam : ఆథ్యాత్మికం..ఆనందం..ఆరోగ్యం..సందేశం..కలగలిపి వడ్డించిన విందు భోజనమే మన కార్తీక వనభోజనం. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, సనాతన ధర్మ మార్గాన్ని తర్వాతి తరాలకు అందించేందుకు ఇదో చక్కని మార్గం. ధర్మ ప్రచారంతో బాటు మానవుల ఆరోగ్య పరిరక్షణకై మన పెద్దలు అనాదిగా ఆచరిస్తున్న విశిష్ట సంప్రదాయమిది. అనాదిగా కార్తీక వన సమారాధన, కార్తీక వనభోజనాలనే పేర్లతో ఇది జనసామాన్యంలో ఆచరణలో ఉంది. తోటలు ఉద్యానవనాలు, నదీ ప్రాంతాలు, సముద్రతీర ప్రాంతాల్లో జరుపుకోవడం పరిపాటి.
ఆయుర్వేదంలో వృక్షజాతికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. అందుకే మంచుకురిసే ఈ మాసంలో సకల రోగాలను హరించే శక్తిగల ఉసిరి చెట్టును పూజించి, దానికింద తయారుచేసిన ఆహారాన్ని ఆ వృక్ష ఛాయలోనే కుల, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా కలసి తింటారు. రోజువారీ శ్రమను, దైనందిన జీవితంలోని కష్టనష్టాలను తమవారితో పంచుకునేందుకు ఇదో చక్కని వేదికగా నిలవటంతో బాటు ఈ సందర్భంగా నిర్వహించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసానికి దోహద పడుతున్నాయి. గతంలో కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అయితే.. మారిన పరిస్థితుల కారణంగా సెలవుదినాల్లో, ఆదివారాల్లోనే దీనిని ఎక్కువగా నిర్వహించటం మనం చూస్తున్నాము.
ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తే.. ఈ పూజలో.. ఎన్ని పుష్పాలు వాడతారో అన్ని అశ్వమేధ యాగాల ఫలం లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది. ఉసిరి చెట్టు ఛాయలో శ్రీమహా విష్ణువును ఆరాధించి, శక్తి కొలది నివేదన చేసి, బ్రాహ్మణలకు దానాలిచ్చి బంధు మిత్రుల సపరివారంగా భుజిస్తే సమస్త పుణ్యక్షేత్రాలలో కొలువైన మహావిష్ణువును కొలిచిన పుణ్యఫలం దక్కుతుందని పెద్దలు చెబుతారు.
కార్తీక మాసంలో ఉసిరితో బాటు తులసి పూజకూ విశేషమైన ప్రాధాన్యం ఉంది. కార్తీక మాసంలో లక్ష్మీ తులసిదళ వ్రతాన్ని ఆచరించి శ్రీహరిని పూజించే వారికి సమస్త సంపదలు సమకూరతాయని నానుడి. తులసీ పూజలు, తులసీ వ్రతాలు ఆచరిస్తే సకల పాపాల నుంచి విముక్తులవుతారని పెద్దలు చెబుతుంటారు. కార్తీక మాసంలో శివకేశవులను తులసీ దళాలతో పూజిస్తే పునర్జన్మ ఉండదని శివపురాణం అంటోంది. ఇలా కార్తీకంలో పూజలందుకునే ఉసిరి, తులసి.. ఈ రెండూ మనిషికి పుణ్యంతో బాటు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.
ఇళ్ళల్లోనూ, కల్యాణమండపాల్లో చేసే భోజనాలకు భిన్నంగా పచ్చని ప్రకృతిలో బంధుమిత్రులు, ఆత్మీయులైన కుటుంబ సభ్యుల మధ్య నవ్వులు, ఆటపాటలు, కేరింతల మధ్య భోజనాలు చేయడం చక్కని అనుభూతి. ఇది మళ్లీ వచ్చే ఏడాది కార్తీకమాసం వరకు మధురస్మృతిగా మిగిలి పోతుందంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుత దైనందిన యాంత్రిక జీవనంలో ఆనందాన్ని, మానవ సంబంధాల్ని మరిచి పోతున్న మనిషి ఒక్క రోజైనా ఆహ్లాదంగా అందరితో కలసి భోజనం చేయడం, కాలుష్యానికి దూరంగా, ఆహ్లాదకరమైన పరిసరాలతో మానసిక ప్రశాంతతను పొందేందుకు వీలవుతుంది.
వనభోజనాలు కేవలం భోజనాలకే పరిమితం కాకుండా అందరూ కలిసి ఆడిపాడేందుకు, చక్కని కళా ప్రదర్శనలకు అవకాశమిస్తాయి. పిల్లల్లో, పెద్దల్లో సృజనాత్మకతను తట్టిలేపేందుకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయి. మొత్తంగా.. భక్తి, ఆధ్యాత్మికత, ఆనందం, ఆరోగ్యం, బోలెడన్ని మధుర స్మృతులను కార్తీక వన సమారాధన మనకు అందిస్తోంది. అంతేకాదు.. వనాల పరిరక్షణ అనే పర్యావరణ సూత్రాన్నీ మనకు గుర్తుచేస్తోంది.