Karthika Masam 2025: కార్తీక మాసం అంటే పవిత్ర నదీ స్నానాలు, దీపారాధనలు, వ్రతాలు, ముఖ్యంగా దానధర్మాలు. ఈ నెలలో దానం చేయడం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగి జ్ఞానం అనే వెలుగు సిద్ధిస్తుంది. మన శక్తి కొద్దీ, మనస్ఫూర్తిగా.. అవసరంలో ఉన్నవారికి చేసే దానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో చేయాల్సిన ఐదు ముఖ్యమైన, ఉత్తమమైన దానాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక మాసంలో తప్పకుండా చేయాల్సిన దానాలు:
1. దీప దానం :
కార్తీక మాసంలో దీపారాధన ఎంత ముఖ్యమో, దీప దానం కూడా అంతే పవిత్రమైనది.
దానం: ఆలయాల్లో.. శివలింగం సన్నిధిలో, తులసి కోట వద్ద లేదా నదీ తీరాలలో దీపాలను వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, కొత్త ప్రమిదలు , వత్తులను దానం చేయాలి. కార్తీక పౌర్ణమి నాడు దీప దానం అత్యంత విశిష్టమైనది.
ఫలితం: దీప దానం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగి, జ్ఞానం, సంపద, ఆరోగ్యం, లక్ష్మీ కటాక్షం లభిస్తాయి. తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని నమ్మకం.
2. అన్న దానం :
అన్నదానం అనేది అన్ని దానాలలోకెల్లా అత్యుత్తమమైనందిగా పరిగణిస్తారు. ప్రత్యేకించి పవిత్ర కార్తీక మాసంలో అన్నదానం చాలా మంచిది.
దానం: పేదలకు, వృద్ధులకు, సాధువులకు, లేదా ఆలయాల్లో ప్రసాద రూపంలో భోజనం అందించడం. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పెరుగు అన్నం దానం చేయడం కూడా అద్భుతమైన పుణ్యాన్ని ఇస్తుంది.
ఫలితం: అన్నదానం వల్ల అన్నపూర్ణా దేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఎప్పుడూ అన్న వస్త్రాలకు లోటు ఉండదు. ఆయుష్షు పెరుగుతుంది. అంతే కాకుండా సకల మనోభీష్టాలు నెరవేరుతాయి.
3. వస్త్ర దానం:
చలికాలం ప్రారంభమయ్యే ఈ కార్తీక మాసంలో వస్త్ర దానం చేయడం వల్ల అత్యంత పుణ్యం లభిస్తుంది.
దానం: అవసరంలో ఉన్నవారికి.. పేద బ్రాహ్మణులకు, ఆలయాల్లోని అర్చకులకు కొత్త వస్త్రాలు దానం చేయడం మంచిది.
ఫలితం: వస్త్ర దానం వలన గౌరవం, యశస్సు, సౌభాగ్యం, శివానుగ్రహం లభిస్తాయి.
4. స్వయంపాక దానం:
స్వయంపాకం అంటే వంట చేసుకోవడానికి ఉపయోగపడే అన్ని రకాల నిత్యావసర వస్తువులను దానం చేయడం.
దానం: బియ్యం, పప్పులు, నూనె, ఉప్పు, కూరగాయలు, నెయ్యి, పసుపు వంటి వంట సామగ్రిని ఒక బ్రాహ్మణుడికి లేదా అవసరంలో ఉన్న కుటుంబానికి దానం చేయడం. కార్తీక మాసంలో ఉసిరికాయలు దానం చేయడం కూడా శుభప్రదం.
ఫలితం: స్వయంపాక దానం చేయడం వలన ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉంటుంది. అరిష్టాలు, గ్రహదోషాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి.
Also Read: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు
5. గో దానం లేదా గో సేవ:
గో దానం అనేది చాలా పెద్ద దానం. అది చేయలేనివారు గో సేవ కూడా చేయవచ్చు.
దానం: గోవును దానం చేయడం. అది సాధ్యం కాకపోతే.. ఆలయాల్లో లేదా గోశాలల్లో ఆవులకు దానంగా మేత లేదా ధనం సమర్పించడం మంచిది.
ఫలితం: గో సేవ చేయడం వల్ల శ్రీ కృష్ణుడి (విష్ణువు) అనుగ్రహం లభిస్తుంది. గోవులలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి.. సకల పుణ్యాలు లభిస్తాయి. అంతే కాకుండా మోక్షానికి మార్గం సుగమం అవుతుందని నమ్మకం.