Chiranjeeva Movie Review : రాజ్ తరుణ్ ఓ హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. గతేడాది ‘పురుషోత్తముడు’ ‘తిరగబడరసామి’ ‘భలే ఉన్నాడే’ వంటి 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. తర్వాత ‘పాంచ్ మినార్’ అనే సినిమా చేశాడు. అది రిలీజ్ కి నోచుకోలేదు. ఓటీటీ బిజినెస్ కూడా జరగకపోవడంతో నిర్మాతలు రిలీజ్ చేయలేకపోతున్నారు. అయితే సడన్ గా రాజ్ తరుణ్ నటించిన ‘చిరంజీవ’ అనే ఓటీటీ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ మెప్పించాడా? అనేది ఈ రివ్యూలో చూద్దాం…
శివ(రాజ్ తరుణ్) తండ్రి చేసిన అప్పుల కారణంగా సరైన చదువుకి నోచుకోలేక పేపర్ వేయడాలు, పాల ప్యాకెట్లు వేయడాలు వంటివి చేస్తుంటాడు. అతను యుక్త వయసులో ఉండగా తండ్రి చనిపోవడంతో అప్పుల వాళ్ళు ఇంటిపై పడతారు. ఆ భారాన్ని తనపై వేసుకుని ఆ పని,ఈ పని చేస్తూ ఉంటాడు. అతను ఎటువంటి వాహనాన్ని అయినా స్పీడ్ గా నడపగల సమర్థత కలిగి ఉండటంతో.. ఓ పెద్దాయన అతన్ని అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేయమని, తద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయి అని సూచిస్తాడు. దీంతో ఆంబులెన్స్ డ్రైవర్ అవుతాడు శివ. అయితే ఒక రోజు దున్నపోతు ఇతను అంబులెన్స్ కి అడ్డంగా రావడంతో దాన్ని తప్పించబోయి యాక్సిడెంట్ అవుతుంది.
ఆ ప్రమాదం నుండి బయటపడ్డాక.. ఇతనికి జనాల ఆయుష్షు సంఖ్య కనిపిస్తుంటుంది. అయితే చావుకి దగ్గరగా ఉన్న దుర్మార్గులను పసిగట్టి.. వాళ్ళని చంపేస్తాను అంటూ వారి ప్రత్యర్థుల వద్ద చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అయితే ఒకసారి ఇతనికి అత్యంత సన్నిహితులు అయినటువంటి ఇద్దరు వ్యక్తులు చనిపోతారు. వారిలో ఒకరి ఆయుష్షు 65 ఏళ్ళు ఉన్నప్పటికీ చనిపోవడంతో శివ షాక్ కి గురవుతాడు? తర్వాత ఏమైంది? శివ ప్రేమించిన దివ్య(కుషిత కళ్లపు) కుటుంబాన్ని శివ ఎలా ఆదుకున్నాడు? శివకి ఆ ఒక్క శక్తే ఉందా? ఇంకేమైనా శక్తులు ఉన్నాయా? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
‘జబర్దస్త్’ అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ‘బలగం’ వంటి గొప్ప సినిమా తీసిన వేణు కూడా జబర్దస్త్ కమెడియన్ కావడంతో ‘జబర్దస్త్’ వాళ్ళని తక్కువ చేసి చూడకుండా సినిమాలు చేసే అవకాశాలు ఇస్తున్నారు కొంతమంది నిర్మాతలు. అభికి కూడా అలానే ఈ సినిమా చేసే అవకాశం వచ్చి ఉండొచ్చు. దర్శకుడిగా తన మొదటి సినిమాకి మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు అభి. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ విషయంలో తడబడ్డాడు. సినిమాని తక్కువ బడ్జెట్లో తీయాలి అనే తపనతోనే అతను ఆధ్యంతం పనిచేసినట్టు ప్రతి ఫ్రేమ్ చెబుతుంది.
సినిమా ఇంట్రెస్టింగ్ గా మొదలైంది తర్వాత ఫ్లాట్ గా మారిపోయింది. సెకండాఫ్ అయితే బాగా సాగదీసిన ఫీలింగ్. క్లైమాక్స్ అయితే ఒక సీన్ కి ఇంకో సీన్ కి లింక్ లేకుండానే ఫినిష్ చేసేశారు. దీంతో ఒక ఇన్ కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా డల్ గా ఉంది. కొన్ని సన్నివేశాలు అయితే షార్ట్ ఫిలిమ్స్ ని తలపిస్తాయి. లొకేషన్స్ కూడా ఎక్కువగా ఉండవు. అంతా ఒక చోటే చుట్టేసిన ఫీలింగ్ కలిగిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. సినిమా నిండా సోషల్ మీడియా బ్యాచ్, జబర్దస్త్ బ్యాచే ఎక్కువగా కనిపించారు. హీరోయిన్ కుషిత కళ్లపు నుండి చూసుకుంటే.. చాలా మంది ఆర్టిస్టుల పేర్లు కూడా జనాలకి తెలీవు అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు. రాజా రవీంద్ర, గడ్డం నవీన్, కిరీటీ వంటి వాళ్ళు ఉన్నా.. వాళ్ళవి ఒకరోజు కాల్షీట్లు మాత్రమే తీసుకున్నట్టు ఉన్నారు. యాక్టింగ్ పరంగా రాజ్ తరుణ్ తో సహా ఎవ్వరూ మెప్పించలేదు.
కాన్సెప్ట్
ఫస్ట్ హాఫ్
ఫ్లాట్ నెరేషన్
చీప్ ప్రొడక్షన్ వాల్యూస్
డైరెక్షన్
మొత్తంగా.. ‘చిరంజీవ’ ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది, తర్వాత ఫ్లాట్ గా మారుతుంది. చివరికి ఇన్ కంప్లీట్ ఫీలింగ్ ఇస్తుంది.