
Kadile Shiva Lingam : ఆదిలాబాద్ జిల్లా అనగానే చాలామందికి ముందుగా అడవులు, వన్యప్రాణులు, పచ్చని ప్రకృతి గుర్తుకొస్తాయి. అయితే.. ఇక్కడి ఎత్తైన కొండలు, లోతైన లోయల మధ్య వెయ్యేళ్ల నాటి ప్రాచీన శివాలయం ఉందని చాలామందికి తెలియదు. మరో విచిత్రం ఏమిటంటే.. ఈ శివాలయం ఉన్న గ్రామం పేరు ‘కదిలె’ కాగా.. ఇక్కడ లింగ రూపంలో కొలువైన శివయ్య కదులుతూ దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తూ పరశురాముడడే స్వయంగా ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది.
నిర్మల్ పట్టణానికి సమీపంలోని దిలావర్‌పూర్‌కు 6 కి.మీ దూరంలోని ‘కదిలె’ గ్రామం ఉంది. నిర్మల్ నుంచి భైంసా మార్గంలో 12 కి.మీ వెళ్లాక, కుడివైపుకు తిరిగి మరో 3 కి.మీ ప్రయాణం చేస్తే.. రెండు మూడు పల్లెల తర్వాత ఓ లోయలో ఈ ఊరు ఉంటుంది. బాసర నుంచి వస్తే 60 కి.మీ దూరంలో ఈ పల్లె వస్తుంది.
ఇక్కడ కొలువైన దైవాన్ని.. పాపహరేశ్వరుడు అంటారు. స్థానికులు మాత్రం పాపన్న అంటారు. తండ్రి జమదగ్ని మహాముని ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లి అయిన రేణుకాదేవిని సంహరిస్తాడు. ఆ పాప పరిహారం కోసం ఆయన దేశంలో 31 శివలింగాలను ప్రతిష్టించాక.. ఇక్కడ 32వ లింగాన్ని పెట్టాడట. నాడు శివలింగ ప్రతిష్ఠ పూర్తికాగానే ఆ లింగం కదలిందని, దీంతో పరమశివుడు తనను కరుణించాడని పరశురాముడు సంతోషించాడని స్థల పురాణ గాథ.
గుడి ముందు మండపంలో అద్భుతమైన శిల్పకళతో అలరారే నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ఈ నంది చెవి నుంచి ‘ఓం నమః శివాయ’ అని వినిపిస్తుందని చెబుతారు.
ఈ ఆలయంలోని శివలింగం కదులుతూ ఉంటుంది. అక్కడి సత్మల గుట్టల్లో నుంచి ఉబికి వస్తున్న నీటిబుగ్గ చుట్టూ పానవట్టాన్ని బిగించి, సరిగ్గా ఆ బుగ్గపైనే శివలింగాన్ని ఏర్పాటు చేయడంతో.. అది నీటి తాకిడికి కదులుతూ దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి వచ్చే పురుష భక్తులు నడుము పై భాగంలో ఏమీ ధరించకుండా అలాగే స్వామిని దర్శించుకోవాలనేది నియమంగా ఉంది.
ఇక్కడి ఆలయం పడమర ముఖంగా ఉండి, తూర్పున మూసేసి ఉంటుంది. ఉత్తర, దక్షిణాల్లో రాకపోకలకు ద్వారాలున్నాయి. దేశంలో ఇలా తూర్పు వైపు మూసిన ఆలయాలు ఇదిగాక.. మరొక్కటి మాత్రం కశ్మీర్‌లో ఉందని చెబుతారు.
ఉత్తర ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులైన శృంగి, భృంగి విగ్రహాలు, ప్రదక్షిణ మార్గంలో బ్రహ్మ, గణేశ, ఉమామహేశ్వరి, వరాహావతారంలోని విష్ణువు విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆలయానికి ఆనుకుని ఈశాన్యంలో దక్షిణాభిముఖంగా అన్నపూర్ణాదేవి కొలువై ఉంది.
ఆలయానికి కొంతదూరంలో మద్ది, మేడి, జీడి, వేప, రావి.. ఇలా 18 రకాల చెట్లు పెద్ద మర్రిమానులో కలిసిపోయి పెరిగాయి. దీనికి భక్తితో ప్రదక్షిణ చేసి, నిర్ణీత సంఖ్యలో నూలుదారం చుట్టి, పూజిస్తే.. సంతానం కలుగుతుందని చెబుతారు. ఈ వృక్షం వద్దకు ప్రతినెలా పౌర్ణమి, అమావాస్యల రాత్రి వెయ్యేళ్ల సర్పం వస్తుందని, చాలామంది దానిని దర్శించారని చెబుతారు.
రెండు ఎత్తయిన కొండల మధ్య పుట్టిన ఓ సెలయేరు, పాపహరేశ్వరుడి పాదాలను ముద్దాడి.. ఉత్తరం వైపు లోయలోకి దూకుతూ కనిపిస్తుంది. ఈ ఏరుకు రెండువైపులా 50 మీటర్లకు పైగా ఎత్తున్న వృక్షాలు కనువిందు చేస్తాయి. ఆలయానికి ఈశాన్యంలో సెలయేరుకు అడ్డంగా కట్టిన డ్యామ్ పైనుంచి దూకే నీరు జలపాతాన్ని తలపిస్తుంది. ఈ సెలయేరులోని ఏడు గుండాలను సప్తర్షి గుండాలని పిలుస్తారు.
ఈ ఆలయంలో శివలింగంతో బాటు విడిగా.. విష్ణు, బ్రహ్మ, అన్నపూర్ణ, గణపతి కూడా ఉండటంతో ఇది గతంలో పంచాయతన క్షేత్రంగా విలిసిల్లి ఉండొచ్చని చెబుతారు. ఇక.. ఆలయ శిల్పాలు చాళుక్యుల నాటి శైలిలో భక్తుల మనసును ఆకట్టుకుంటాయి. ఆలయానికి దక్షిణాన ఉన్న గదుల్లో నిత్యాన్నదానం జరుగుతుంది. ఏటా శ్రావణమాసంలో 30 రోజులపాటు జాతర, శివరాత్రి సందర్భంగా మరో 3 రోజుల జాతర జరుగుతుంది.