సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు కొంత మంది చేస్తున్న తలతిక్క ప్రయత్నాలు చివరికి ఇబ్బందులకు గురయ్యేలా చేస్తున్నాయి. కొంత మంది డేంజరస్ స్టంట్స్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటుండగా, మరికొంత మంది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కేసులపాలవుతున్నారు. తాజాగా ఓ టీనేజర్ హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఆ అమ్మాయితో పాటు వారి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
యూపీకి చెందిన ఓ టీనేజర్ అక్టోబర్ 27న ఓ వీడియోను షేర్ చేసింది. సుమారు ఒక నిమిషం డ్యూరేషన్ ఉన్న ఈ వీడియోలో సదరు అమ్మాయి హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్లిప్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పలువురు వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు అమ్మాయితో పాటు ఆమె తల్లింద్రుడులపై చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశారు. పలువురు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
సదరు బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలకు దిగారు. సదరు బాలికను అదుపులోకి తీసుకొని డిటెన్షన్ హోమ్‌కు పంపారు. ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేశారు. అభ్యంతరకరమైన వీడియోను తన కూతురు సోషల్ మీడియాలో పెట్టిందనే విషయం తెలిసినా, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడంతో వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. అటు ఈ ఘటనకు సంబంధించి మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. “మైనర్ బాలిక హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసు. మరికొందరు కూడా ఇందులో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోవర్స్ ను పెంచుకోవాలని ఆ అమ్మాయి కోరుకుంది. మేము ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసాము. ఈ వీడియోను వైరల్ చేయవద్దని మేం ప్రజలను కోరుతున్నాను. ఈ వీడియోను షేర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని పోలీసులు తెలిపారు.
సదరు బాలిక పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, పలువురు తీవ్ర విమర్శలు చేయడంతో ఆ అమ్మాయి క్షమాపణలు చెప్తూ మరో వీడియోను షేర్ చేసింది. “నేను ఆ వీడియో చేయడం ద్వారా తప్పు చేశాను. నన్ను క్షమించండి. నేను మళ్ళీ అలాంటి తప్పు చేయను. ఈ వీడియోను వైరల్ చేయవద్దని నేను ప్రజలను అభ్యర్థిస్తున్నాను” అని ఆమె రిక్వెస్ట్ చేసింది.
Read Also: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్