Karthika Pournami: హిందూ ధర్మంలో పండుగలన్నింటిలోకెల్లా కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శివకేశవులను పూజించడం, నదీ స్నానం చేయడం, దీపారాధన చేయడం అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున చేసే దీపారాధనలో 365 వత్తులతో దీపం వెలిగించడం ఒక విశేష ఆచారం. ఈ దీపం వెనక అంతరార్థం, ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు చాలా ఉన్నాయి.
365 వత్తులు – దైవత్వాన్ని తెలిపే ప్రతీక:
సాధారణంగా హిందూ సంప్రదాయంలో.. దీపం కేవలం కాంతికి మాత్రమే కాదు. పరబ్రహ్మ స్వరూపంగా.. జ్ఞానానికి , లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. “తమసో మా జ్యోతిర్గమయా” (చీకటి నుంచి వెలుగులోకి నడిపించు) అనే వేదవాక్యాన్ని అనుసరించి.. అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే శక్తి దీపానికి ఉంది.
1. ఏడాది కాలం దీపారాధన చేసిన ఫలం: సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చేయలేని వారు లేదా కొన్ని అనివార్య కారణాల వల్ల దీపం వెలిగించలేనివారు. కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే.. అది సంవత్సరం పొడవునా నిత్య దీపారాధన చేసిన ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఒక్కరోజు దీపారాధన మొత్తం సంవత్సరానికి ప్రతీకగా నిలుస్తుంది.
2. త్రిమూర్తి స్వరూపం: సాధారణంగా దీపారాధనలో మూడు వత్తులు (త్రివర్తి) పెడతారు. ఈ మూడు వత్తులు త్రిమూర్తులను (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు), సత్వ, రజో, తమో గుణాలను సూచిస్తాయి. 365 వత్తులను వెలిగించడం ద్వారా.. సంవత్సరం పొడవునా త్రిమూర్తుల అనుగ్రహాన్ని.. సకల దేవతల ఆశీర్వాదాన్ని పొందుతారని నమ్మకం.
3. ఆరోగ్య ఆయుష్షు: ఈ దీపం వెలిగించడం వల్ల కుటుంబ సభ్యులందరికీ ఆయు రారోగ్యాలు సిద్ధిస్తాయని.. అకాల మరణ భయం తొలగి పోతుందని పండితులు చెబుతారు. సంవత్సరం లో ప్రతి రోజు శుభంగా ఉండాలని.. ఎటువంటి దోషాలు లేకుండా జీవితం వెలుగులతో నిండిపోవాలని కోరుకుంటూ ఈ దీపాన్ని వెలిగిస్తారు.
Also Read: కార్తీక మాసంలో.. ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు
దీపం వెలిగించే విధానం:
365 వత్తుల దీపాన్ని సాధారణంగా శివాలయంలో లేదా తులసికోట ముందు లేదా ఇంట్లోని పూజా మందిరంలో వెలిగిస్తారు.
వత్తుల తయారీ: 365 చిన్న వత్తులను తయారు చేసి.. వాటిని ఒక గుత్తి లాగా కలిపి, ఆవు నెయ్యిలో లేదా నువ్వుల నూనెలో నానబెడతారు.
దీపారాధన: ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్ల లేదా లైటర్ ఉపయోగించకుండా.. వేరే దీపం లేదా అగరబత్తితో వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు.
మంత్ర పఠనం: దీపం వెలిగించే సమయంలో శివుడికి ప్రీతికరమైన మంత్రాలను (ఉదా: ‘ఓం నమః శివాయ’) లేదా విష్ణువును ప్రార్థిస్తూ ‘దామోదరం ఆవాహయామి’ వంటి మంత్రాలను పఠిస్తారు.
కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపం వెలిగించడం కేవలం ఆచారం మాత్రమే కాదు. ఇది ఆధ్యాత్మిక చింతనకు, అంకిత భావానికి, సంవత్సరం పొడవునా దైవారాధన పట్ల మనకున్న నిబద్ధతకు ప్రతీక. పవిత్రమైన రోజున ఈ దీపారాధన చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం, ఆరోగ్యాన్ని పొందవచ్చని భక్తుల విశ్వాసం.