Jagannath temple kitchen secrets: ఒరిస్సాలోని పూరీ జగన్నాథ ఆలయం అంటేనే అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్. అయితే ఈ గుడిలో కేవలం గోపురం నీడ పడకపోవడం, జెండా తిరగబడటమే కాదు.. అంతకంటే పెద్ద మిస్టరీ ఇక్కడి వంటగదిలో దాగుంది. అవును, ప్రపంచంలోనే అతిపెద్ద వంటగదిగా పేరుగాంచిన ఈ కిచెన్‌లో రోజువారీ ప్రసాదం వండేటప్పుడు ఒక వింత జరుగుతుంది. ఒకదానిపై ఒకటి ఏడు మట్టి కుండలు పెట్టి వండితే.. కింద ఉన్న కుండ కంటే అన్నింటికంటే పైన, మంటకు చాలా దూరంగా ఉన్న కుండలోని అన్నమే మొదట ఉడుకుతుంది. ఈ అంతుచిక్కని పూరీ వంటగది మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ జగన్నాథ ఆలయంలోని వంటగదిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ వండే ప్రసాదాన్ని సాక్షాత్తూ లక్ష్మీదేవి పర్యవేక్షణలో తయారు చేస్తారని భక్తుల నమ్మకం. ఈ వంటగదిలో దాదాపు 300 కి పైగా స్టవ్‌లు (కట్టెల పొయ్యిలు) ఉంటాయి. అలాగే వందలాది మంది వంటవాళ్లు (సువారులు) రాత్రింబగళ్లు శ్రమిస్తూ ఉంటారు.ఇక్కడ వంట చేయడానికి గ్యాస్ స్టవ్‌లు లేదా అస్సలు వాడరు. కేవలం సాంప్రదాయ పద్ధతిలో కట్టెల పొయ్యి , మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడే అసలైన సైన్స్ వింత మొదలవుతుంది.
వంట చేసేటప్పుడు ఒకే కట్టెల పొయ్యి మీద ఒకదానిపై ఒకటిగా మొత్తం ఏడు మట్టి కుండలను నిలువుగా అమర్చుతారు. పొయ్యిలో మంట కింద మాత్రమే మండుతుంది. థర్మోడైనమిక్స్ లేదా సాధారణ సైన్స్ నియమాల ప్రకారం.. మంటకు దగ్గరగా కింద ఉన్న మొదటి కుండలోనే వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. అందులోని అన్నమే ముందు ఉడకాలి. కానీ పూరీ వంటగదిలో మాత్రం దీనికి పూర్తిగా రివర్స్‌లో జరుగుతుంది. అన్నింటికంటే పైన, అంటే ఆకాశం వైపు ఉన్న ఏడవ కుండలోని అన్నం మొదట ఉడుకుతుంది. ఆ తర్వాత ఆరో కుండ, ఐదో కుండ.. ఇలా పైనుంచి కిందకు అన్నం ఉడుకుతూ వస్తుంది. చివరికి మంటకు తాకుతూ ఉన్న కింది కుండలోని అన్నం అన్నింటికంటే లాస్ట్‌లో ఉడుకుతుంది.
ఈ వింతను చూడటానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కొందరు సైంటిస్టులు దీనికి ఒక లాజికల్ రీజన్ చెప్పే ప్రయత్నం చేశారు. వారి ప్రకారం.. కింద మండే మంట నుంచి వచ్చే వేడి, ఆవిరి మట్టి కుండల గుండా వేగంగా పైకి ప్రయాణిస్తుంది. ఈ ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పర్ఫెక్ట్‌గా లాక్ అయి ఉండటం వల్ల, ఆవిరి పైకి వెళ్లి అక్కడ ఉన్న చివరి కుండ మూతకు తాకి అక్కడే గట్టి ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. ఆ వేడి ఆవిరి సాంద్రత వల్ల పై కుండలోని పదార్థం త్వరగా ఉడుకుతుందని కొందరి వాదన. అయితే.. ఇదే పద్ధతిని బయట ల్యాబ్స్‌లో లేదా వేరే చోట్ల ప్రయోగించి చూసినప్పుడు మాత్రం అన్నం పైన ముందు ఉడకలేదు. అందుకే దీనిని కేవలం సైన్స్ అని మాత్రమే అనలేం. దీని వెనక జగన్నాథుడి లీలతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనేది భక్తుల నమ్మకం.
Also Read: ప్రపంచ ప్రసిద్ధ.. పూరీ జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత
పూరీ వంటగదిలోని మరో పెద్ద మిస్టరీ ఏంటంటే.. ఇక్కడి ప్రసాదం కౌంట్. ప్రతిరోజూ ఇక్కడ ఎంతమంది భక్తుల కోసం వంట చేయాలో ఎవరికీ ముందే తెలియదు. ఒకరోజు 20 వేల మంది రావచ్చు. పండగ రోజుల్లో లక్ష లేదా రెండు లక్షల మంది కూడా రావచ్చు. కానీ విచిత్రం ఏంటంటే.. ఎంతమంది భక్తులు వచ్చినా సరే.. ఇక్కడి మహాప్రసాదం ఒక్క మెతుకు కూడా తరిగిపోదు. అలాగని ఒక్క మెతుకు కూడా మిగిలిపోయి వృథా కాదు. కరెక్ట్‌గా అందరికీ సరిపోతుంది. అలాగే.. ఈ వంటగదిలో చేసే ఏ పదార్థంలోనూ ఉల్లిపాయ, వెల్లుల్లి లేదా బయటి మసాలాలను అస్సలు వాడరు. అయినా సరే.. ఆ ప్రసాదానికి వచ్చే సువాసన, రుచి ప్రపంచంలో మరెక్కడా రావు.
పూరీ జగన్నాథుడి వంటగదిలో జరిగే ఈ ఏడు కుండల వింత నేటి హైటెక్ యుగంలోనూ సైన్స్‌కు ఒక పెద్ద సవాల్‌గానే మిగిలిపోయింది. లాజిక్కులకు అందకపోయినా, కళ్లముందు కనిపించే ఈ నిజం భగవంతుడి ఉనికిని చాటిచెబుతుంది. మీరు ఎప్పుడైనా ఒరిస్సా వెళ్తే పూరీ జగన్నాథుడిని దర్శించుకోవడంతో పాటు, అక్కడ లభించే ఈ అద్భుతమైన మహాప్రసాదాన్ని టేస్ట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.