Karthika Masam 2025: కార్తీక మాసం అంటే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన నెలగా చెబుతారు. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, దీపం, దానం వంటివి అనంతమైన పుణ్య పలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి అపారమైన విశిష్టత ఉంటుంది. ఇది శివుడికి అత్యంత ఇష్టమైన మాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో మొదటి సోమవారం రోజ సాయంత్రం వేళలో నియమ నిష్టలతో పూజ చేస్తే.. విద్యార్థులకు జ్ఞానం, ఉద్యోగార్థులకు, వ్యాపారులకు.. విజయం, సంపద వంటివి కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
కార్తీక సోమవారం సాయంత్రం పూజ విశిష్టత:
పగలు ఉపవాసం ఉండి.. సాయంత్రం దీపారాధన చేసి, నక్త భోజనం చేయడం కార్తీక మాస నియమాలలో ఒకటి. సోమవారం సాయంకాలం (సంధ్యా సమయం) శివుడిని ఆరాధించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ సమయంలో శివనామస్మరణతో దీపారాధన చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా.. విద్య, ఉద్యోగాల్లో ఉన్నత స్థితిని కోరుకునేవారికి ఈ పూజ చాలా శక్తివంతమైనది.
విద్య, ఉద్యోగాల్లో విజయం కోసం పూజా విధానం:
విద్యార్థులు, ఉద్యోగార్థులు కార్తీక సోమవారం రోజున సాయంత్రం ఈ క్రింది విధంగా పూజలు చేయాలి.
పవిత్ర స్నానం, శుద్ధి: సాయంత్రం స్నానం చేసి..శుభ్రమైన బట్టలు మాత్రమే ధరించాలి. తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేయాలి.
దీపారాధన: శివుడి పటం లేదా విగ్రహం ముందు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. వీలైతే.. బియ్యపు పిండితో దీపాలు చేసి.. అందులో నెయ్యి వేసి, మూడు వత్తులను కలిపి శివుడికి సమర్పించడం శ్రేయస్కరం.
శివలింగం పూజ (ఉత్తమ విధానం): ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే.. సాయంత్రం వేళ జలంతో అభిషేకం చేసి, మారేడు దళాలు లేదా తులసి దళాలతో పూజించాలి. ఉద్యోగ, విద్యకు సంబందించి కోరికలు తీరాలనని పూజ చేస్తే.. శివలింగాన్ని చందనంతో అలంకరించి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి.
Also Read: కార్తీక మాసం తొలి సోమవారం.. ఎలాంటి నియమాలు పాటించాలి ?
మంత్ర పఠనం: పూజ సమయంలో ‘నమః శివాయ’ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. లేదా విద్యాభివృద్ధి, అడ్డంకులు తొలగించడం కోసం శివుడి యొక్క ‘రుద్ర గాయత్రీ మంత్రం’ (ఉదా: ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్) పఠించడం చాలా మంచిది.
నైవేద్యం: ఆ రోజు ఉపవాసం ఉంటే.. పూజానంతరం బెల్లం, పాలు లేదా కేవలం పండ్లు నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత నక్త భోజనం చేయాలి. ఉద్యోగ విజయాన్ని కోరుకునేవారు నైవేద్యాన్ని పంచుకోవడం మంచిది.
విశేష ఫలం కోసం: ముఖ్యంగా.. విద్యారంగంలో రాణించాలనుకునేవారు తమ పాఠ్యపుస్తకాలను లేదా ఉద్యోగానికి సంబంధించిన పత్రాలను శివుడి ముందు పెట్టి నమస్కరించడం ద్వారా ఏకాగ్రత, విజయ సామర్థ్యం పెరుగుతాయి.
కార్తీక సోమవారం సాయంత్రం వేళ ఈ విధంగా.. శివుడిని ఆరాధించడం వల్ల మనసుకు ప్రశాంతత లభించి, ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఇది విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి, ఉన్నత విజయాలను సాధించడానికి మార్గం సుగమం చేస్తుంది. శ్రద్ధ, భక్తితో చేసే ఈ పూజ ఆశించిన ఫలితాలను తప్పక అందిస్తుంది.