Lord Hanuman: భక్తి, బలం, వినయం, నిస్వార్థ సేవకు మారుపేరు హనుమంతుడు. రామాయణంలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైనది. హనుమంతుడి వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం. హనుమంతుడి జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అనేక జీవిత పాఠాలు కూడా ఉన్నాయి. ఇవి మన వ్యక్తిత్వాన్ని అంతే కాకుండా వృత్తిని, జీవితాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
1. అచంచలమైన భక్తి, నిబద్ధత:
హనుమంతుని జీవితంలో ప్రధానమైనది శ్రీరాముని పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి. తన స్వామి కార్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అంకితభావంతో కృషి చేశారు.
పాఠం: జీవితంలో ఏ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా.. లేదా ఏ పనిలోనైనా విజయం సాధించాలన్నా, ఆ పని పట్ల పూర్తి నిబద్ధత, నమ్మకం కలిగి ఉండాలి. మన లక్ష్యం పట్ల ఉన్న అంకితభావమే అత్యంత శక్తివంతమైన ప్రేరణ.
2. వినయం, అహంకారం లేకపోవడం:
అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ.. హనుమంతుడు ఎప్పుడూ తన గొప్పతనాన్ని ప్రదర్శించలేదు. ఎల్లప్పుడూ తనను తాను శ్రీరాముని సేవకుడిగా (దాసుడిగా) మాత్రమే పరిచయం చేసుకున్నారు.
పాఠం: నిజమైన బలం, విజయం వినయంతోనే వస్తాయి. అహంకారం విజయానికి పెద్ద శత్రువు. ఎన్ని విజయాలు సాధించినా.. వినయంగా ఉండేవారిని లోకం గౌరవిస్తుంది.
3. ధైర్యం, నిర్భయత్వం:
నూరు యోజనముల సముద్రాన్ని లంఘించడం, లంక వంటి శత్రు దుర్భేద్యమైన రాజ్యంలో ప్రవేశించడం, అసాధ్యాలను సుసాధ్యం చేయడం.. ఇవన్నీ హనుమంతుని నిర్భయత్వానికి నిదర్శనం.
పాఠం: జీవితంలో వచ్చే కష్టాలు, సవాళ్లు ఎంత పెద్దవైనా సరే.. ధైర్యంగా, స్థిరంగా ఎదుర్కోవాలి. భయాన్ని జయించినప్పుడే లక్ష్యసాధన సాధ్యమవుతుంది.
Also Read: కార్తీక మాసంలో నిత్య దీపారాధన ఎందుకు చేయాలి ?
4. జ్ఞానం, వివేకం:
హనుమంతుడు కేవలం బలం ఉన్నవాడు మాత్రమే కాదు.. సకల శాస్త్ర పండితుడు, నవ వ్యాకరణాలలో నిష్ణాతుడు. ఆయన ప్రతి పరిస్థితిని వివేకంతో అంచనా వేసి మాట్లాడతాడు. శ్రీరాముడిని సుగ్రీవుడికి పరిచయం చేసేటప్పుడు.. ఆయన మాట్లాడిన తీరు హనుమంతుని అపారమైన బుద్ధి కుశలతను తెలియజేస్తుంది.
పాఠం: దేహ బలం కంటే బుద్ధి బలం గొప్పది. మనం చేసే ప్రతి పనిలో జ్ఞానాన్ని, వివేకాన్ని ఉపయోగించాలి. ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎక్కడ మౌనం వహించాలి అనే విచక్షణ కలిగి ఉండాలి.
5. నాయకత్వ లక్షణాలు, కార్యదక్షత:
సుందరకాండలో.. సీతాన్వేషణ సమయంలో హనుమంతుడు వానర సేనను విజయవంతంగా నడిపించి.. అసాధ్యమైన కార్యాన్ని పూర్తి చేశారు. ఆయన గొప్ప కార్యదక్షుడు, సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలను వెతికే నేర్పరి.
పాఠం: ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. దానిపై పూర్తి ఏకాగ్రతతో పనిచేయడం, అడ్డంకులు ఎదురైనా ప్రయాణాన్ని ఆపకుండా ముందుకు సాగడం. ఇవి హనుమంతుని నుంచి నేర్చుకోవాల్సిన ప్రధాన నిర్వహణా నైపుణ్యాలు