Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రెండు పడవల మీద నడుస్తున్న విషయం తెల్సిందే. నందమూరి తారక రామారావు, బాలకృష్ణను ఇన్సిపిరేషన్ గా తీసుకున్నాడో ఏమో కానీ, పవన్ సైతం ఒక పక్క రాజకీయాలు చేస్తూనే ఇంకోపక్క సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు పార్టీ ఫండ్ కోసం సినిమాలు చేస్తున్నా అని చెప్పిన పవన్.. ఇప్పుడు అభిమానుల కోసం ఆ సినిమాలను కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపాడు.
పదవి రాకముందు.. పార్టీ ఫండ్ కోసం ఒప్పుకున్నా సినిమాలను ఎట్టకేలకు పవన్ ఫినిష్ చేశాడు. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ మూడు సినిమాలు అయ్యిపోవడంతో పవన్ పూర్తిగా రాజకీయాలకు అంకితమవుతాడు అని అనుకుంటే పొరపాటే. అవును.. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.
పవన్ రాజకీయాల్లోకి రాకముందే డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కింది. కానీ, ఆ తరువాత అది ఆగిపోయింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు మళ్లీ సెట్స్ మీదకు తీసుకురావాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఏజెంట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న సురేందర్ రెడ్డి ఇప్పటివరకు మీడియా కంటికి కనిపించింది లేదు. ఇక ఓజీ హిట్ తరువాత పవన్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆగిన సినిమాను చేయాలనీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇక ఇది కాకుండా పవన్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో దిల్ రాజు.. పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్యనే పవన్ కూడా దిల్ రాజుకు డేట్స్ ఇచ్చినట్లు టాక్. దీంతో పవన్ కోసం ఒక మంచి డైరెక్టర్ ను వెతికే పనిలో పడ్డాడట. మొన్నటివరకు అనిల్ రావిపూడి.. పవన్ కోసం ఒక కథను రెడీ చేసాడని, దిల్ రాజు కూడా దాని కోసమే పవన్ డేట్స్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో చిరు తరువాత అనిల్.. పవన్ తోనే అని ఫిక్స్ అయ్యారు.
అయితే ఇప్పుడు అనిల్ ప్లేస్ లో వంశీ పైడిపల్లి వచ్చినట్లు తెలుస్తోంది. వారసుడు సినిమా తరువాత వంశీ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఆ సినిమా కూడా తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో రెండేళ్లు కష్టపడి వంశీ ఒక సోషల్ డ్రామాను రాసుకున్నాడట. మొదట ఈ కథను అమీర్ ఖాన్ కి వినిపించడం, ఆయన ఓకే చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. రేపో మాపో అనౌన్స్ చేయబోతున్నారు అనేలోపు అమీర్ వెనక్కి తగ్గాడట. ఇక అమీర్ తరువాత సల్మాన్ ఖాన్ కి కూడా ఈ కథను వినిపించడం జరిగింది.. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
ఇక ఇప్పుడు అదే కథను దిల్ రాజు.. పవన్ కోసం ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్ డేట్స్ ఇచ్చాడని.. ఇలా డైరెక్టర్స్ మార్చుతూ ఆడుకుంటున్నావా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.