Karthika Masam 2025: హిందూ ధర్మంలో పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం అత్యంత విశిష్టమైనది. ఈ మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైందిగా చెబుతారు. ప్రత్యేకించి పరమశివుడి ఆరాధనకు ఈ మాసంలో.. చేసే చిన్న పూజ కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ సమయంలో శివుడిని భక్తి శ్రద్ధలతో.. నియమనిష్ఠలతో ఆరాధించడం ద్వారా ఆయన అనుగ్రహం పొందవచ్చు.
కార్తీక మాసంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు:
1. పవిత్ర స్నానం, ఉపవాసం: కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, నదీ స్నానం (సాధ్యం కాకపోతే ఇంట్లోనే పవిత్రంగా తలస్నానం) చేయడం ఆచారం. ఈ మాసంలో ప్రతి రోజూ లేదా కనీసం సోమవారాలు, పౌర్ణమి రోజున ఉపవాసం పాటించాలి. ఉపవాసం శరీరానికి.. మనస్సుకు పవిత్రతను అందించి.. పూజపై ఏకాగ్రతను పెంచుతుంది.
2. దీపారాధన (దీపం పెట్టడం): ఈ మాసంలో దీపం పెట్టడం అత్యంత ప్రధానమైన ఆచారం. దీనిని కార్తీక దీపం అని అంటారు. ప్రతి రోజూ సంధ్యా సమయంలో తులసి కోట వద్ద, పూజ గదిలో అంతే కాకుండా సమీపంలో ఉన్న దీపాలను వెలిగించాలి. అంతే కాకుండా ఆలయాల్లో శివలింగం ముందు దీపం వెలిగించడం వల్ల కూడా అఖండ పుణ్యం లభిస్తుంది.
నదీ తీరాలలో లేదా అరటి దొప్పలలో దీపం పెట్టి నదిలో వదలడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.
శివారాధన విధానం:
1. మారేడు దళాలతో పూజ: పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది మారేడు (బిల్వ) దళాలు. ఈ మాసంలో శివలింగాన్ని కేవలం మారేడు దళాలతో పూజించినా శివుడు ప్రసన్నుడవుతాడు. మారేడు దళాలు మూడు ఆకులు కలిసి ఉన్నవిగా ఉంటే చాలా శ్రేష్ఠం. మారేడు దళాలతో శివుడిని పూజించడం వల్ల మూడు జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
2. అభిషేకం: శివుడికి అభిషేకం చేయడం ఈ మాసంలో అత్యంత ఫలప్రదం. ప్రతి రోజూ శుద్ధోదకంతో లేదా సోమవారాల్లో పంచామృతాలతో (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర) అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపించాలి.
3. మంత్ర పఠనం: శివారాధనలో భాగంగా ఈ క్రింది మంత్రాలను, స్తోత్రాలను పఠించడం ఉత్తమం:
పంచాక్షరీ మంత్రం: ‘ఓం నమః శివాయ’ ను వీలైనన్ని ఎక్కువ సార్లు జపించడం.
శివ స్తోత్రాలు: శివ లింగాష్టకం, శివ సహస్రనామం, రుద్ర స్తోత్రం లేదా శివ అష్టోత్తరం చదవడం.
మృత్యుంజయ మంత్రం: ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం.
Also Read: ఇలాంటి దేవుళ్ల.. విగ్రహాలు ఇంట్లో అస్సలు ఉంచకూడదు !
కార్తీక సోమవారం ప్రత్యేకత:
కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం అత్యంత పవిత్రమైనది. ఈ రోజున భక్తులు తప్పకుండా కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ సోమవారాల్లో శివాలయాన్ని దర్శించి.. రుద్రాభిషేకం లేదా చేయించడం వల్ల శివుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున చేసే ఒక్క పూజ వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం.
నియమ నిష్ఠలతో కార్తీక మాసమంతా శివారాధన చేసిన వారికి సకల పాపాలు తొలగిపోయి. అంతే కాకుండా ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.