Zakat:- రంజాన్ పవిత్ర దినాలలో ముస్లిమ్ సోదరులకు జకాత్ ఇచ్చే సంప్రదాయం ఉంది. ధనము ఒకే చోట కేంద్రీకృతం కాకుండా, అవసరనిమిత్తమైన వారి దగ్గరకు కూడా చేర్చబడే విధానమే ఇది. ముస్లింలు తమ ఆదాయంలో కనీసం 2.5 శాతం జకాత్ రూపంలో నిరుపేదలకు సాయం అందించాలని ప్రవక్త ఉద్బోధ. నమాజ్, జకాత్ ఇస్లామ్ మూల స్తంభాలు.జకాత్‌ను వ్యక్తిగతంగా చెల్లించడానికే పరిమితం కాకుండా, జకాత్ వ్యవస్థను స్థాపించాలన్నది ఖురాన్ పిలుపు.
నమాజ్‌ను ఇంట్లోనే ఒంటరిగా చదువుకున్న దానికంటే మసీదుకు వెళ్లి సామూహికంగా ఆచరిస్తే ఎన్నోరెట్ల పుణ్యఫలం దక్కుతుంది. అలానే జకాత్ దానాన్ని వ్యక్తిగతంగా ఇవ్వడం కన్నా, సమష్టిగా వినియోగిస్తే అధిక పుణ్యం అని ఖురాన్ బోధిస్తోంది. జకాత్ చెల్లింపు ద్వారా ధనాన్ని, ఆత్మను శుద్ధి చేసుకోవచ్చును
సమాజంలో ఆర్ధిక సమానత్వం ఉండాలని ఇస్లాం బోధిస్తోంది. జకాత్ ద్వారా సమ సమాజ స్థాపన జరుగుతుందని చెబుతోంది. లేని వారిని ఉన్న వారు ఆదుకోవడం దేవుడి అనుగ్రహణానికి పాత్రులవుతారని మత గ్రంధం చెబుతోంది.ఇంట్లో ఏడాది పాటు డబ్బును నిల్వ చేసుకున్న వారు జకాత్ ఇవ్వాలని మతపెద్దలు చెబుతున్నారు. జకాత్ డబ్బును ఏదో దానంగా ఇస్తున్నామని కాకుండా చిత్తశుద్ధిగా ఇవ్వాలి. కుడిచేత్తో ఇస్తే ఎడమచేతికి తెలియనంత గుప్తంగా ఇవ్వాలన్నది ప్రవక్త బోధనల సారాంశం.
జకాత్ తీసుకునేవారికి ఆత్మాభిమానం దెబ్బతినకుండా సొమ్ము ఇచ్చే ఏర్పాటు చేయాలి. జకాత్ సొమ్ము వల్ల ఇచ్చేవారి సంపదలు కరిగిపోవు. శుద్ధి అవుతుంది. సమాజంలో పేదరిక నిర్మూలనకు ఇది చక్కని మార్గం. తమ సంపదను చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ సంతోషం పొందే ఉద్దేశంతో చేయాలి. జకాత్ ను మెట్ట ప్రాంతంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. సాధారణ వాన కురిసినా పంటను కాపాడుతుంది.