Guntur Crime: రోజు రోజుకీ సమాజంలో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట మర్డర్లు, మానభంగాలు, భార్య చేతిలో భర్త, భర్త చేతిలో భార్య, ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు ఇలాంటి ఘటనలు జరుగతున్నాయి. చట్టాలు, పోలీస్ వ్యవస్థ నిందితులను కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలకు మాత్రం పులిస్టాప్ పడడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఆస్తి కోసం భర్తను దారుణంగా హత్య చేయించింది ఓ భార్య. పోలీసులు కనిపెట్టకుండా ఉండేందుకు పెద్ద ప్లానే చేసింది ఈ డేంజర్ లేడీ.. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు కార్యాలయంలో గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సత్తెన పల్లికి చెందిన లక్ష్మీకి, గుంటూరు రూరల్ మండలం, పెదపలకలూరుకు చెందిన ఆటో డ్రైవర్ గోవిందరాజుతో 15 ఏళ్ల క్రితం మ్యారేజ్ అయ్యింది. అయితే భర్త మద్యానికి బానిస కావడంతో తరుచూ వారికి తరుచూ గొడవలు జరిగేవి. దీంతో భార్య లక్ష్మీ ఆరు సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉంటుంది. సొంత ఊరు సత్తెనపల్లికి అక్కడే ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి క్యాటరింగ్ పనులు చేస్తూ పెర్నేటి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ తో మూడేళ్ల నుంచి సన్నిహితంగా మెలుగుతోంది.
అయితే.. భర్తకు భారీగా ఆస్తి ఉండడంతో.. ఆమె కన్ను ఆస్తిని కాజేయాలని ప్లాన్ వేసింది. లక్ష్మీ భర్తకు రూ.కోటిన్నర విలువైన ఇళ్లు, స్థలాలు ఉన్నాయని.. అతడిని చంపేస్తే ఆస్తి తనకు వస్తోందని అనుకుంది. ఆ ఆస్తితో విలాసవంతమైన జీవితం గడిపేయొచ్చని పెర్నేటి వెంకటేశ్వర్లకు చెప్పి హత్య చేసేందుకు ఒప్పించింది. ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారం.. వెంకట్ తన స్నేహితుడు షేక్ ఖాసిం సైదాతో కలిసి సెప్టెంబర్ 18న గోవిందరాజును తీసుకెళ్లి పీకల దాక మందు తాగించాడు.
గోవిందరాజును సాతలూరు పెదరెడ్డ పాలెం సమీపానికి తీసుకుళ్లి దారుణంగా దాడి చేశారు. అనంతరం మొలతాడు తెంచి గోవిందరాజు మెడకు గట్టిగా ఊపరి ఆడకుండా బిగించారు. బాధితుడు స్పృహ తప్పి కిందపడి పోగా.. చనిపోయారని వారు భావించారు. ఈ లోపు లక్ష్మీ నిందితులకు కాల్ చేసి రోడ్డు ప్రమాదంలో గోవిందరాజు చనిపోయాడని చిత్రీకరించాలని వారికి సూచించింది. దీంతో వారు గోవిందరాజు డెడ్ బాడీని ఆటోలో ఎక్కించుకొని సత్తెనపల్లి మండలం అబ్బూరులో రోడ్డు పక్కన పడేసి.. ఇనుప రాడ్డును గొంతుపై పెట్టి గట్టిగా నొక్కి దారుణంగా చంపేశారు.
అనంతరం అక్కడ నుంచి మృతదేహాన్ని పేరేచర్ల-పలకలూరు రోడ్డు పక్కన పడేసి పరారు అయ్యారు. సెప్టెంబరు 19న స్థానికుల సమాచారం మేరకు వెళ్లిన పోలీసులు ముందుగా రోడ్డు ప్రమాదమని తేల్చారు. ఎస్పీ వకుల్ జిందాల్ మృతుని ఫొటోను తెప్పించుకొని చూసి హత్య చేసినట్టు గుర్తించారు. మృతుడి నాలుక బయటపెట్టి ఉండటంతో హత్యగా నిర్ధారణకు వచ్చినట్లు వారు తెలిపారు. నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి.. కేసు నమోదుచేశారు.