Nirosha Ratha: సింధూరా పువ్వా.. తేనే చిందించరావా.. ఈ పాట ఈ జనరేషన్ వారికి గుర్తులేదేమో కానీ, ఒకప్పుడు ఈ సాంగ్ ప్రేమ పక్షులకు ఒక కీర్తన అని చెప్పొచ్చు. ప్రేమ పాటల లిస్ట్ లో కచ్చితంగా ఈ పాట ఉండేది. అందులో సింధూర పువ్వు ఎవరో కాదు నిరోషా రాధ. డస్కీ బ్యూటీతో అప్పట్లో కుర్రాళ్లను ఫిదా చేసిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ రాధికా చెల్లెలు అని తెలుసా.. ?. అవునా.. నిజమా అంటే.. అవును నిజమే.
తమిళ హాస్య నటుడు ఎం. ఆర్. రాధా కూతురు కూడా. నమ్మడానికి టైమ్ పట్టిన ఇదే నిజం. మొదట రాధికా హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమైంది. ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే నిరోషా అగ్ని నక్షత్రం అనే సినిమాతో తమిళ్ ఎంట్రీ ఇచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఘర్షణ పేరుతో రిలీజ్ అయ్యింది. ప్రభు, కార్తీక్, అమల, నిరోషా హీరో హీరోయిన్స్ గా నటించారు. నిన్ను కోరి వర్ణం.. వర్ణం సాంగ్ ఈ సినిమాలోనిదే.
ఇక ఈ చిత్రం తరువాత నిరోషాకి కూడా వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఒకే ఏడాదిలో ఈ చిన్నది 5 సినిమాలు చేసింది. అందులో సింధూర పువ్వే ఒకటి. పిఆర్ దేవరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిరోషా హీరోయిన్ గా నటించగా.. రాంకీ హీరోగా.. విజయ్ కాంత్ కీలక పాత్రలో నటించాడు. ఇదే సినిమా తెలుగులో సింధూర పువ్వు అనే టైటిల్ తో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
ఇక ఆ తరువాత తెలుగులో నిరోషా.. ముద్దుల మామయ్య, నారీ నారీ నడుమ మురారి, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటి సినిమాలల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తనతో కలిసి సింధూర పువ్వు సినిమాలో నటించిన హీరో రాంకీనే ప్రేమించి పెళ్లాడింది. ఇక పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ఆమె.. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూనే ఉంది. అసాధ్యుడు, ఒక ఊరిలో లాంటి సినిమాల్లో నెగెటివ్ పాత్రల్లో కనిపించి మెప్పించింది.
మొదటి నుంచి సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న నిరోషా తెలుగులో ఎన్నో సీరియల్స్ తో మెప్పించింది. ప్రస్తుతం తమిళ్,తెలుగుఅని తేడా లేకుండా నటిస్తున్న ఆమె అప్పటికన్నా కొంచెం బొద్దుగా మారింది. కానీ, అదే అందంతో అలరిస్తుంది. ప్రస్తుతం నిరోషా లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.