Dethadi Alekhya Harika:తెలంగాణ పిల్ల అలేఖ్య హారిక (Alekhya Harika).. దేత్తడి హారికగా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె క్రేజ్ ఊహించని స్థాయికి చేరిపోయింది.. అదే సమయంలో పలు సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది కూడా.. మధ్యలో కొన్నాళ్లు సైలెంట్ అయిన హారిక ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయింది. ఎప్పటిలాగే సందడి చేస్తోంది. అందులో భాగంగానే ఫేస్ బుక్ పేజీలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఒక పిట్ట కథను పోస్ట్ చేసింది హారిక.
మన స్నేహితుల ప్రవర్తనే మన వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తుంది – హారిక
కాకి – పిచ్చుకల స్నేహం గురించి చెబుతూ.. మనం ఎంత మంచిగా ఉన్నా సరే మన చుట్టూ ఉండే మన స్నేహితులు చెడ్డవారైతే ఎదుటివారు మనల్ని కూడా చెడ్డవాళ్లనే అనుకుంటారు అనే సందేశాన్ని ఇచ్చింది. ఇక ఆ కథ ఏమిటి అనే విషయానికి వస్తే.. ” ఒకానొక సమయంలో ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయమైంది. ఆ కాకులతో పిచ్చుకకు స్నేహం ఏర్పడింది. అదే సమయంలో ఆ కాకులతో స్నేహం మంచిది కాదు అని చాలామంది చెప్పినా.. ఆ పిచ్చుక వారి మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడుగా రమ్మన్నాయి. అమాయకపు పిచ్చుక ఎక్కడికి? ఎందుకు? అని అడగకుండా.. కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలు అన్నింటిని ధ్వంసం చేయసాగాయి. పాపం పిచ్చుకకి ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా అటు ఇటు గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో కాకులను కొట్టడం మొదలుపెట్టగా.. ఇది వాటికి అలవాటే కాబట్టి అవి ఎగిరిపోయాయి. కానీ పిచ్చుక రైతులకు దొరికిపోయింది. నా తప్పేమీ లేదు.. నేను అమాయకురాలిని అని చెప్పినా పంట నాశనం అయిందని కోపం మీద ఉన్న రైతులు పిచ్చుక మాట నమ్మలేదు. దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు. అలా మన మిత్రులను చూసి ఇతరులు మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు.అందుకే మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డ వాళ్లమే అనుకుంటారు” అంటూ పోస్టులో రాసుకొచ్చింది.
పిచ్చుక ఎవరు? కాకి ఎవరు?
ఇకపోతే దేత్తడి హారిక చెప్పిన ఈ కాకి గుంపు – పిచ్చుక కథ అందరి మనసులను ఆకట్టుకుంది. కాకపోతే ఇప్పుడు ఈమె ఈ పిట్ట కథ ఎందుకు చెప్పినట్టు? ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టింది? ఇందులో పిచ్చుక ఎవరు ? కాకి గుంపు ఎవరు? అంటూ నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు.. మొత్తానికైతే దేత్తడి హారిక చేసిన ఈ పోస్ట్ పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.
ALSO READ:Ravi Teja – Ram: రవితేజ,రామ్ సినిమాలకు ముప్పు.. తెలిసి తెలిసి గోతిలో పడబోతున్నారా?