‘86 47’ దీని అర్థం ఏంటి..?
ఎంత ఆలోచించినా, ఎంత డీకోడ్ చేయాలనుకున్నా.. చాలామందికి సాధ్యం కాకపోవచ్చు. కానీ అమెరికా సీక్రెట్ సర్వీస్ దీన్ని డీకోడ్ చేసింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి ఇది వార్నింగ్ అంటూ తేల్చింది. అంటే ఇక్కడ 86, 47 ని విడివిడిగా అర్థం చేసుకోవాలన్నమాట. 86 అంటే అమెరికాలో “విసిరేయడం” లేదా “వదిలించుకోవడం” లేదా “తిరస్కరించడం” అనే అర్థం ఉందట. ఇక 47 అంటే.. అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనమాట. ఈ నాలుగు అంకెల్ని కలిపి చదువుకుంటే.. అమెరికా 47వ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ని తొలగించడం అని పూర్తి అర్థం వస్తుందంటూ అమెరికా సీక్రెట్ సర్వీస్ నిర్థారించుకుంది. ఆ పదాన్ని బహిర్గతం చేసిన వ్యక్తిపై విచారణ మొదలు పెట్టింది.
జేమ్స్ కోమీ..
అమెరికా అధ్యక్షుడు, అందులోనూ డొనాల్డ్ ట్రంప్ తో గొడవ పెట్టుకోవాలని ఆ దేశంలో ఎవరైనా అనుకుంటారా..? అలాంటిది ఏకంగా ఆయన్ను లేపేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడమంటే మామూలు విషయమా. అలాంటి వార్నింగ్ ఇచ్చారంటున్న వ్యక్తి మరెవరో కాదు. FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ. ఈ జేమ్స్ కోమీకి, డొనాల్డ్ ట్రంప్ కి పాత కక్షలున్నాయి. అధ్యక్షుడిగా తొలి విడత పనిచేసినప్పుడు జేమ్స్ కోమీని FBI డైరెక్టర్ పదవినుంచి తొలగించాడు ట్రంప్. ఆ కక్షతోనే ఇప్పుడు కామీ ఇలాంటి మెసేజ్ ని సోషల్ మీడియాలో వైరల్ చేశాడని అంటున్నారు.
జేమ్స్ కోమీ ఏం చేశారంటే..?
జేమ్స్ కోమీ తన ఇన్ స్టా గ్రామ్ లో ఈ మెసేజ్ ఉంచాడు. గవ్వల్ని ‘86 47’ అనే అక్షరాలుగా పక్క పక్కనే పేర్చి ఫొటో తీసి దాన్ని తన ఇన్ స్టా పేజీలో ఉంచాడు. కాసేపటికే ఆ ఫొటో వైరల్ గా మారడంతో ఆయన దాన్ని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే చాలామంది దాన్ని స్క్రీన్ షాట్ తీసి మరింతగా వైరల్ చేశారు. ఈ వ్యవహారంతో కంగారు పడిన కోమీ.. తన ఉద్దేశం అది కాదన్నారు. తనని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తనకు హింస అంటే అసలు ఇష్టం లేదని కూడా చెప్పారు. కేవలం బీచ్ లో దొరికిన గవ్వలను ఒక చోటకు చేర్చి తాను అలా అమర్చానని అన్నారు. అందుకే ఆ ఫొటోకి “నా బీచ్ వాక్ లో కూల్ షెల్ నిర్మాణం ” అనే శీర్షిక పెట్టానన్నారు.
FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ పోస్టింగ్ పై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని హత్య చేయాలని కుట్రపన్నారని, అందుకే ఆ పోస్టింగ్ పెట్టారంటూ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఆరోపించారు. మరికొంతమంది ప్రముఖులు.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ , డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ.. ఈ వ్యవహారంపై దృష్టిసారించాయి. FBI కూడా కూపీలాగుతోంది. జేమ్స్ కోమీ తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారని, ఇలాంటి వాటిని తాము సహించబోమని FBI అధికారులంటున్నారు. అధ్యక్షుడికి వార్నింగ్ ఇవ్వడమంటే అది సహించరాని నేరమని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.