Indonesia Floods: వాతావరణం మారిన వర్షాలు మాత్రం ఆగడం లేదు.. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాల కారణంగా భారీ వరదలు సంభవించాయి. ఇండోనేసియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో కుండపోత వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
దీని ప్రభావంతో సియావు తగులాండాంగ్ బియారో (సితారో) జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియల నుండి విరుచుకుపడిన బురద, భారీ వృక్షాలు, రాళ్లు, శిథిలాలు వరద నీటితో కలిసి గ్రామాలను ముంచెత్తడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఈ విపత్తులో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
అయితే వరద ఉద్ధృతికి 140కి పైగా నివాస గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ప్రాంతీయ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రధాన రహదారులు కొట్టుకుపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో రవాణా, సమాచార వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల మారుమూల గ్రామాలకు సహాయక బృందాలు చేరుకోవడం సవాలుగా మారింది.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి యంత్రాలను తరలించే మార్గాలు కూడా మూసుకుపోయాయి. విపత్తు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు వీలుగా సితారో జిల్లా యంత్రాంగం 14 రోజుల పాటు ‘అత్యవసర పరిస్థితి’ని ప్రకటించింది.
నిలువ నీడ కోల్పోయిన సుమారు 680 మంది బాధితులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. అకస్మాత్తుగా ముంచెత్తిన బురద ప్రవాహం వల్ల ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కట్టుబట్టలతో ఇళ్లను వదిలి పరుగులు తీయాల్సి వచ్చింది. బాధితులకు అవసరమైన ఆహారం, మందులు, ఇతర కనీస అవసరాలను తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం శ్రమిస్తున్నాయి.
Also Read: మహిళా కానిస్టేబుల్‌ను వేధించాడని.. చెప్పుల దండ వేసి ఊరేగింపు..
ప్రస్తుతం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (BNPB) ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం డ్రోన్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలను రంగంలోకి దించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 14 మంది మృతి!
ఉత్తర సులవేసిలో సంభవించిన ఆకస్మిక వరదలు
భారీ వరదల కారణంగా 14 మంది మరణించగా.. నలుగురు గల్లంతు
గల్లంతయినవారి కోసం కొనసాగుతున్న అన్వేషణ
సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు సియావు టాగులాండాంగ్ బియాలో ప్రాంతంలో ఉన్న సియావు… pic.twitter.com/KcvK4bHnqh
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2026