BigTV English

Xi Jinping Missing: జిన్‌పింగ్ జంప్? చైనా అధ్యక్షుడు అతడేనా?

Xi Jinping Missing: జిన్‌పింగ్ జంప్? చైనా అధ్యక్షుడు అతడేనా?

Xi Jinping Missing: చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ గత కొన్ని రోజులుగా కనిపించట్లేదు. ఏమయ్యాడో తెలియదు.. ఎక్కడున్నాడో తెలియదు. బయటకు రావడం లేదు. ఎవరికీ కనిపించడం లేదు. అధికారిక మీడియాలోనూ ప్రస్తావన లేదు. ఈ వారంలో బ్రెజిల్ బ్రిక్స్ సమావేశానికీ వెళ్లట్లేదు. ఆల్ ఆఫ్ సడెన్ గా డ్రాగన్ కంట్రీలో ఈ మార్పులేంటి? చైనాలో పవర్ ఫుల్ లీడర్ గా ఉన్న జిన్ పింగ్ ను అధ్యక్ష పదవి నుంచి దింపబోతున్నారా? శకం ముగిసినట్లేనా?


చైనాలో సడెన్‌గా మిస్సింగ్ అవడం కామనా?

చైనాలో పారిశ్రామిక వేత్తల నుంచి మిలటరీ అధికారులు, ఇప్పుడు దేశాధ్యక్షుడు సడెన్ గా అదృశ్యమవడం అక్కడ కామనే. ఎందుకు అదృశ్యమవుతున్నారో తెలియదు. ఎవరు లోపల వేసేస్తున్నారో తెలియదు. గతంలో జాక్ మా, లేటెస్ట్ గా జిన్ పింగ్ తర్వాత నెంబర్ 2గా ఉన్న హీ వీడాంగ్ గాయబ్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా నెంబర్ 1గా ఉన్న జిన్ పింగే కనిపించట్లేదు. జెండా ఎత్తేశారా? చైనా కమ్యూనిస్ట్ పార్టీ పక్కన పెట్టేసిందా? బ్రెజిల్ లో బ్రిక్స్ మీటింగ్ కూ వెళ్లట్లేదు ఎందుకు? అసలు చైనాలో ఏం జరుగుతోంది?


సైలెంట్‌గా పక్కన పెట్టడం సీపీసీకి కామనే

సర్వాధికారాలు చెలాయించిన వారిని సైలెంట్ గా పక్కనపెట్టి, వారి స్థానంలో మరొకరిని తీసుకొచ్చే సంప్రదాయం చైనా కమ్యూనిస్టు పార్టీలో ముందు నుంచీ ఉంది. ప్రస్తుతం జిన్‌పింగ్‌ విషయంలో అదే జరుగుతోందా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన పార్టీ మీడియాలో కనిపించట్లేదు. బయటా కనిపించట్లేదు. మీటింగ్ లు లేవు. భద్రత తగ్గించేశారంటున్నారు. జిన్ పింగ్ పేరు ముందు అధ్యక్షుడు అన్న పదం కూడా అధికారిక మీడియాలో రావట్లేదంటున్నారు. ఇవన్నీ జిన్ పింగ్ శకం ముగిసిందా అన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

సైన్యంలో అసంతృప్తి పెంచి చెక్ పెట్టేశారా?

అవినీతి నిర్మూలన అంటూ జిన్ పింగ్ తనకు గిట్టనివారిని మాయం చేస్తూ వచ్చారని, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోనూ ఉన్నతాధికారులను వరుసగా పక్కన పెడుతూ వచ్చారు. ఇది కాస్తా సైన్యంలో అసంతృప్తిని పెంచి, జిన్ పింగ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు దారితీసి ఉండవచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. అధికారం మరొకరికి అప్పగించేందుకు సహకరిస్తానని బేరసారాలు చేస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఇంకొందరు అనారోగ్య సమస్యలతోనే జనంలో కనిపించట్లేదంటున్నారు. ఒకవేళ అలా అనుకుంటే.. సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఫస్ట్ వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియా, అలాగే వాంగ్ యాంగ్ లాంటి ప్రముఖ నేతలు యాక్టివ్ గా ప్రభుత్వ మీడియాల్లో కనిపిస్తున్నారెందుకన్న డౌట్లు వస్తున్నాయి. పైగా అనారోగ్య సమస్యలను అధికారిక మీడియా ప్రస్తావించలేదు.

జిన్ పింగ్ వచ్చాక చాలా మంది కీలక వ్యక్తుల మిస్సింగ్

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పారిశ్రామిక వేత్తల నుంచి మంత్రుల వరకు చాలా మంది అదృశ్యమవుతూ వచ్చారు. కీలకమైన అధికారిక సమావేశాల్లో సడెన్ గా వారు కనిపించకపోవడం షరా మామూలైంది. ఇప్పుడు ఏకంగా జిన్ పింగ్ కే ఎసరు వచ్చిందా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొన్నటిదాకా మే 21 నుంచి జూన్‌ 5 వరకు జిన్ పింగ్ కనిపించలేదన్నారు. అయితే జూన్ 5 వరకే కాదు.. ఇప్పటికీ జిన్ పింగ్ జాడలేదు. అదే విచిత్రం. పైగా అధ్యక్షుడికి సంబంధించి ఓ కీలక ప్రకటన వెలువడింది.

బ్రిక్స్ సదస్సుకు జిన్ పింగ్ వెళ్లట్లేదని ప్రకటన

బ్రెజిల్‌లోని రియోడీజెనిరోలో ఈ నెల 5-8 తేదీల మధ్య జరిగే 17వ బ్రిక్స్‌ సదస్సుకు జిన్‌పింగ్‌ హాజరు కావట్లేదని, ఆయన బదులుగా ప్రధాని లీ క్వియాంగ్‌ హాజరవుతారని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. జిన్‌పింగ్‌ ఎందుకు వెళ్లట్లేదని రిపోర్టర్లు ప్రశ్నలు అడిగితే నో కామెంట్స్ అన్నారు. సో ఈ లెక్కలు ఏవో తేడాగా ఉన్నాయన్నది ప్రపంచమంతా తెలిసిపోయింది. ఇక్కడ మ్యాటర్ బ్రిక్స్ మీటింగ్ కాదు. జిన్‌పింగ్‌ 2013లో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ప్రతి ఏటా బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతూ వచ్చారు. ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి పాల్గొన్నారు. ఎందుకంటే బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పడిన ఈ కూటమి ప్రపంచదేశాల్లో కీలకం. అంతే కాదు ఆ తర్వాత ఈ కూటమిలో ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలు వచ్చి చేరాయి. వెస్ట్రన్ కంట్రీస్ కు చెక్ పెట్టే విషయంలో పవర్ ఫుల్ గా మారింది. అలాంటిది ఈ కీలక సమావేశానికి జిన్ పింగ్ వెళ్లట్లేదంటే ఏదో మతలబు కచ్చితంగా జరిగి ఉంటుందన్న డౌట్లు పెరిగాయి.

పీపుల్స్ డైలీలో అధ్యక్షుల వారి వార్తలేవి?

ప్రతి రోజూ మొదటిపేజీలో జిన్‌పింగ్‌ ఫొటోలతో వార్తలు ప్రచురించే ప్రభుత్వ పత్రిక పీపుల్స్‌ డైలీలో ఈ మధ్య అధ్యక్షుడి న్యూస్, ఫోటోలు ఏవీ పబ్లిష్ చేయట్లేదు. CCTV సహా ఇతర ప్రభుత్వ మీడియా అవుట్ లెట్స్.. ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయ వార్తలే ఇస్తున్నాయి. అదీ సంగతి. ఇక చైనాకు వస్తున్న విదేశాల అధినేతలకు, ప్రతినిధులకు చైనా కమ్యూనిస్టు పార్టీ కి చెందిన సీనియర్‌ నేతలే ఆతిథ్యం ఇస్తున్నారు. జిన్‌పింగ్‌ జాడ లేదు. జిన్ పింగ్ వయసు 72 ఏళ్లు. వయసు మీరింది ఇక చాలు అంటున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల జిన్‌పింగ్‌ వ్యక్తిగత భద్రత సిబ్బందిని సగానికి తగ్గించారు. ఆయన తండ్రి స్మారకస్థలానికి ఇప్పటి వరకూ ఉన్న అధికారిక హోదాను తొలగించారు. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జిన్‌పింగ్‌ ఫోన్‌లో మాట్లాడారన్న వార్తను చైనా ప్రభుత్వ టీవీ ప్రసారం చేసిన టైంలో జిన్‌పింగ్‌ పేరు ముందు ఎలాంటి హోదాను చెప్పకపోవడం మరో డౌట్ క్రియేట్ చేసింది. జిన్‌పింగ్‌ పేరుకే అధ్యక్షుడిగా ఉన్నాడని, అధికారాలు ఆయన చేతుల్లో లేవన్న టాక్ పెరుగుతోంది.

జిన్ పింగ్ పగ్గాలు నిజంగానే బలహీన పడితే భారత్ కూ ఓ ముప్పు పొంచి ఉంది. అదేంటి? అసలు జీవితకాలం చైనా అధ్యక్షుడిగా ఉండాలనుకున్న జిన్ పింగ్ కు ఉన్నట్లుండి ఈ గడ్డుకాలం ఎందుకు ఎదురైంది? అంతా స్వయంకృతాపరాధమేనా? మావో జెడాంగ్ తర్వాత అంతటి స్థాయిలో బిల్డప్ ఇచ్చుకున్న జిన్ పింగ్ కథ ముగిసిన చరిత్రేనా? మరి జిన్ పింగ్ వారసులుగా ప్రొజెక్ట్ అవుతున్న వాళ్లెవరు?

జింటావోను చాలా అవమానించిన జిన్‌పింగ్

ప్రస్తుతం చైనాలో అత్యున్నత అధికారాలన్నీ యూక్సియా చేతుల్లోనే ఉన్నాయంటున్నారు. కమ్యూనిస్టు పార్టీలో శక్తిమంతమైన 24 మంది సభ్యుల పొలిట్ బ్యూరోలో జాంగ్ యూక్సియా సభ్యుడు. ఆయనకు కమ్యూనిస్టు పార్టీలోని సీనియర్లు, మాజీ అధ్యక్షుడు హూ జింటావో వర్గం సపోర్ట్ ఇస్తోందంటున్నారు. 2022లో సీపీసీ మహాసభల నుంచి జింటావోను ఆరోగ్యం బాగా లేదనే సాకుతో అవమానకర రీతిలో బయటకు పంపించివేశారు. ఓపెన్ గా జరిగిన ఆ ఘటనను యావత్‌ ప్రపంచం చూసింది. కమ్యూనిస్ట్ పార్టీలో, ప్రభుత్వంలో తన ఏకఛత్రాధిపత్యం కోసమే జిన్‌పింగ్‌ ఈ పని చేయించారని అప్పట్లో విమర్శలూ వచ్చాయి. ఇప్పుడు అదే జింటావో తన టైం రావడంతో చక్రం తిప్పుతున్నారని, జిన్‌పింగ్‌ను పక్కకు తప్పించే వ్యూహం ఆయనదేనంటున్నారు.

చైనా అధ్యక్ష రేసులో మరో పేరు వాంగ్ యాంగ్

జిన్‌పింగ్‌ వారసుడిగా వినిపిస్తున్న మరో పేరు వాంగ్‌ యాంగ్‌. చైనాలో మావో జెడాంగ్ తర్వాత ఆ దేశాన్ని ఆర్థిక సంస్కరణల బాట పట్టించిన డెంగ్‌ జావోపింగ్‌ ప్రోత్సాహంతో వాంగ్‌ యాంగ్‌ రాజకీయాల్లోకి వచ్చారు. సాంకేతిక నిపుణుడిగా, మార్కెట్‌ ఆధారిత సంస్కరణలకు దిశానిర్దేశం చేస్తున్న నేతగా ఆయనకు పేరుంది. మరో విషయం ఏంటంటే.. చైనీస్ సోషల్ మీడియాలో అధ్యక్ష మార్పుకు సంబంధించి పోస్టుల్ని వెంటనే డిలీట్ చేసేలా గ్రేట్ ఫైర్‌ వాల్ ఆఫ్ చైనా ద్వారా సెన్సార్ షిప్ పెట్టారు. వీబో, వీచాట్ లో ఎవరైనా అధ్యక్షుడి అదృశ్యం గురించి పోస్ట్ పెడితే వెంటనే డిలీట్ అయిపోతున్నాయి. జిన్‌పింగ్‌తో సంబంధం ఉన్న కీవర్డ్‌లు అంటే అధ్యక్షుడు, అదృశ్యం, తిరుగుబాటు వంటి వర్డ్స్ ను బ్లాక్ చేశారు. కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాల్సిందే. అధ్యక్షుడు సెలవులో ఉన్నాడా? బీజింగ్‌లో ఎవరూ లేరు ఇలాంటి సెటైరికల్ పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే అవి వెంటనే డిలీట్ అవుతున్నాయి కూడా. సో అదీ మ్యాటర్. బీజింగ్ లో ఏం జరుగుతుందన్నది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది.

చైనాలో నిరుద్యోగం, రియల్ ఎస్టేట్ డల్

నిజానికి చైనాలో ఏం జరుగుతుందో పెద్దగా బయటకు తెలియదు. కానీ కొన్ని రిపోర్టుల ప్రకారం నిరుద్యోగం భారీగా పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ డల్ అయింది. విదేశీ రుణం 50 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. జీవన ప్రమాణాలు పడిపోవటంతో ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోతోంది. చాలా చోట్ల నిరసనలు కూడా జరుగుతున్నాయంటున్నారు. ఫ్యాక్టరీలను ధ్వంసం చేయటం, దోపిడీలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిన్‌పింగ్‌ను పక్కనపెట్టటం ద్వారా ప్రజాగ్రహాన్ని చల్లార్చాలని సీపీసీ ప్రయత్నిస్తోందా అన్న చర్చ కూడా జరుగుతోంది.

రెండుసార్ల కంటే అధ్యక్ష హోదాలో ఎవరూ ఉండొద్దు

చైనా పాలనలో కమ్యూనిస్టు పార్టీదే పూర్తి ఆధిపత్యం. ప్రభుత్వం కేవలం సెకెండ్ గ్రేడ్ వ్యవస్థగా ఉంటుంది. చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీలో మావో స్థాయి నేతగా కీర్తి గడించాలని జిన్‌పింగ్‌ అన్నీ తానై పాలన, పార్టీపై ఉడుంపట్టు బిగించారు. వాస్తవానికి మావో నియంతృత్వం తర్వాత ఆధునిక చైనా ఆవిష్కర్త డెంగ్‌ జావోపింగ్‌ సమష్టి నాయకత్వాన్ని ప్రోత్సహించారు. అధ్యక్షుడిగా ఎవరూ రెండుసార్ల కంటే ఎక్కువగా ఉండొద్దన్నాడు. కానీ ఆయన తర్వాత చైనాలో పరిస్థితులు మారిపోయాయి. పగ్గాలు చేపట్టిన వారు తామే జీవితాంతం ఉండిపోవాలని కలలు గనడం పెరిగింది. పీఠంపై ఆశ పెరిగింది. నిజానికి చైనాకు జీవితకాల అధినాయకుడిగా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను నియమించేందుకు వీలుగా చారిత్రక తీర్మానాన్ని చేయించుకున్నారు. మూడోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. సీపీసీ 100 ఏళ్ల చరిత్రలో మూడో తీర్మానాన్ని ప్రతిపాదించుకున్నారు జిన్ పింగ్. అంతటి పవర్ ఫుల్ లీడర్ కు ఉన్నట్లుండి ఏమైంది? ఆయన్ను వెనక్కు లాగుతున్న అదృశ్య శక్తులు ఏవన్న చర్చ పెరిగింది.

రాజ్యాంగాన్ని మార్చి తీర్మానం చేయించిన జిన్ పింగ్

సాధారణంగా చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరోలో రిటైర్మెంట్‌ వయస్సు 68 ఏళ్లు. ప్రస్తుతం జిన్‌పింగ్‌ వయస్సు 72. వయసుతో సంబంధం లేకుండా అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని రాజ్యాంగాన్ని కూడా జిన్ పింగ్ మార్చుకున్నాడు. మావో, డెంగ్‌లతో సమానంగా చైనాను బలోపేతం చేసిన వ్యక్తిగా జిన్‌పింగ్‌కు ప్రయారిటీ ఇచ్చుకున్నారు. చైనా వెలిగిపోతోందంటూ ప్రచారం చేయించుకున్నారు. చైనాలోని మూడు అధికార కేంద్రాలకూ నాయకుడిగా కొనసాగుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, చైనా సాయుధ దళాల హైకమాండ్ అయిన కేంద్ర మిలిటరీ కమిషన్‌ చైర్మన్‌గా, దేశాధ్యక్షుడిగా చక్రం తిప్పుతున్న జిన్ పింగ్ కథ ఎలా మారిపోయిందంటూ చర్చలు మొదలయ్యాయి.

జాక్ హఠాత్తుగా అదృశ్యమవడం వెనుక జిన్‌పింగ్ గేమ్

జిన్‌పింగ్ తొలిసారి పగ్గాలు చేపట్టిన టైంలో ఏర్పాటైన 18వ పొలిట్‌ బ్యూరోలోని 25 మంది సభ్యుల్లో ఐదుగురు మాత్రమే ఆయన అనుచరులు ఉండే వారు. అదే రెండోసారి అధికారం చేపట్టే సమయంలో ఏర్పాటైన 19వ పొలిట్‌ బ్యూరోలో జిన్ పింగ్ వర్గం 15కు పెరిగింది. ఇప్పుడది మరింత డామినేట్ గా మారింది. చైనా సంపన్నుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్‌ అధినేత జాక్‌ మా ఒకానొక టైంలో హఠాత్తుగా అదృశ్యమ్యాడు. దీని వెనుక జిన్‌పింగ్‌ హస్తం ఉంది. జాక్‌మా బిజినెస్‌ టైకూన్‌గా మారటంలో చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ పాత్ర చాలా ఉంది. ఒకరికి చెక్ పెట్టేందుకు ఇంకొకర్ని తొక్కేయడం అన్న మాట.

2012లో అధికారంలోకి రాగానే 3 లక్షల మందికి జైలు శిక్ష

భారీ టెక్‌ కంపెనీలు, విద్యా సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజాలు ఇలా.. ఏవి తన పవర్ ను ఢీకొడుతాయని చిన్న అనుమానం వచ్చినా సరే మరో ఆలోచన లేకుండా పక్కన పెడుతూ వచ్చారు జిన్ పింగ్. అంతే కాదు.. ఆయన 2012లో అధికారం చేపట్టగానే టైగర్స్‌ అండ్‌ ఫ్లైస్‌ అవినీతి వ్యతిరేక యుద్ధం పేరిట 3 లక్షల మందిని జైళ్లలో పెట్టించాడు. ఇలాంటి వారిలో దేశ సంపన్నుడు ఝు మింగ్‌ కూడా ఒకరు. ఆయన మూడేళ్లు జైలు జీవితం గడిపి అక్కడే ప్రాణాలు కోల్పోయారు కూడా. గతంలో జిన్‌పింగ్‌ను విమర్శించిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి రెన్‌ జియాక్వింగ్‌ 18 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు. కమ్యూనిస్టు పార్టీలోని అన్ని శ్రేణుల్లో అవినీతి నిర్మూలన పేరుతో జిన్ పింగ్ తెలివిగా ఓ డ్రామా ఆడాడు. హోదాతో సంబంధం లేకుండా లక్షలాది మంది అధికారులు దర్యాప్తును ఎదుర్కోవాల్సి వచ్చింది. 2012 నుంచి 2022 మధ్య దాదాపు 50లక్షల మంది అధికారులు దర్యాప్తును ఎదుర్కోగా.. వీరిలో 47లక్షల మంది దోషులు తేల్చారు. తనకు గిట్టని వారిని తొక్కి పడేశాడు జిన్ పింగ్.

Also Read: మామిడి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌ న్యూస్‌

ఇంత చేసిన జిన్ పింగ్.. కుటుంబం మాత్రం చాలా ఆర్థిక ప్రయోజనాలు అందుకుందన్న విమర్శలు ఉన్నాయి. జిన్‌పిగ్‌ కుటుంబం, బంధువుల చేతుల్లో బిలియన్ డాలర్ల విలువ చేసే వ్యాపార సామ్రాజ్యాలు, ఆర్థిక పెట్టుబడులు ఉన్నాయన్న విషయాలు బయటికొస్తున్నాయి. సరే ఈ సబ్జెక్ట్ ఇలా ఉంటే.. జిన్ పింగ్ అధికారం బలహీనపడితే, చైనా ఓ గేమ్ ఆడుతుంది. అంతర్జాతీయంగా ప్రపంచదేశాలన్నీ చైనా వైపే చూస్తాయి కదా.. మ్యాటర్ ను డైవర్ట్ చేసేందుకు అంతర్గత ఒత్తిడిని తగ్గించుకునేందుకు భారత్‌ సహా ఇతర పశ్చిమ దేశాలపై సైబర్ దాడులు చేయడం, తప్పుడు సమాచార ప్రసారం, భారత్ చైనా సరిహద్దు LAC వెంట ఘర్షణలను పెంచవచ్చని మన నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

Related News

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

America Tariffs: రష్యాపై ఒత్తిడికోసమే భారత్ పై సుంకాల మోత.. అసలు విషయం ఒప్పుకున్న అమెరికా

Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Afghanistan: బస్సులో చెలరేగిన మంటలు.. 71 మంది సజీవదహనం!

Russia Ukraine War: ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తా! జెలెన్‌స్కీతో ట్రంప్ సంచలన భేటీ..

Congo Massacre: కాంగోలో దారుణం.. వెంటాడి మరీ 52 మందిని చంపేశారు

Big Stories

×