రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖలపై కేంద్ర మంత్రులకు రాసిన లేఖల అంశాలను పంచుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి రాష్ట్రానికి వచ్చినప్పుడు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. తర్వాత లేఖ ద్వారా అన్ని విషయాలు వివరించామన్నారు.
ప్రధాని, ఎంపీల సమావేశంలో చర్చించిన అంశాల లీకులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకులు ఇచ్చిన వ్యక్తులు మెంటలోళ్లు అని మండిపడ్డారు. మీటింగ్‌లో జరిగిన విషయాలు బయట చెప్పొద్దని ప్రధాని చెప్పారని.. అయినా కూడా మీటింగ్‌లో జరిగిన విషయాలను బయటకి చెప్పారని మండిపడ్డారు.
TDP ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ, వ్యక్తుల గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. వారికి దేహశుద్ధి చేయండని పార్టీ కేడర్‌ను ఆదేశించారు. అలా మాట్లాడిన వారిని సెంటర్‌లో పడేసి కొట్టండి నేను మీకు అండగా ఉంటా అని భరోసా ఇచ్చారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీలోని లోక్‌సభలో వైసీపీ ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా రైతులకు కనీస మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా వసంతపురి కాలనీలో మోనాలిసా అనే కన్నతల్లి తన ఏడేళ్ల కూతురు షారోని మేరిని మూడో అంతస్తు నుంచి తోసేసింది. చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి భద్రాచలం బస్టాండ్‌ను పరిశీలించారు. భద్రాచలం డిపోలో 108 బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ప్రతిరోజు 50 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 250 కోట్ల మహిళా ప్రయాణాలు నమోదయ్యాయి. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్‌ను పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సుల సేవలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను సొంత బిడ్డలు వదిలేయడం బాధాకరమని పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. తల్లిదండ్రులను పోషించడం బిడ్డల కనీస ధర్మం, హక్కు అని స్పష్టం చేశారు. వారి పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనాథలైన వృద్ధులకు పోలీసు శాఖ అండగా ఉంటుందని, బాధితులు ధైర్యంగా తమను సంప్రదించవచ్చని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీలో కాశ్మీర్‌ను తలపించేలా తీవ్రమైన మంచు తెరలు కనువిందు చేస్తున్నాయి. గత వారం రోజులుగా మైనస్ డిగ్రీలకు చేరువలో చలి తీవ్రత ఉంది. ఉదయం 9 గంటలు దాటినా మంచు వీడక, రోడ్లపై వాహనదారులు లైట్ల సహాయంతో ప్రయాణిస్తున్నారు. చలి కారణంగా శ్రీరాముడి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. భారీ ట్రాఫిక్ జామ్‌ను ట్రాఫిక్ పోలీసులు వెంటనే క్లియర్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై గతంలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్రీనివాసులరెడ్డిని పోలీసులు కడప కోర్టులో హాజరుపర్చనున్నారు . 2024లో ఎన్నికలు పూర్తికాగానే శ్రీనివాసులరెడ్డి కువైట్‌కు పారిపోయాడు. భారత్‌కు వస్తున్నాడన్న సమాచారంతో కడప పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని అరెస్టు చేశారు.
విజయవాడ భవానీపురంలో 42 మంది ఫ్లాట్ల యజమానులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌రావు. రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇళ్లు కట్టుకుంటే కూల్చివేశారని మండిపడ్డారు. బాధితులను కూటమి ప్రభుత్వ నేతలు కలిసి పరామర్శించకపోవడం దారుణమని విమర్శించారు.
కృష్ణాజిల్లా గుడివాడలో వైసీపీ అధినేత జగన్ బంధువు అర్జున్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ చిత్రాలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారంటూ అతనిపై కేసు నమోదైంది. గతంలో విదేశాలకు పారిపోయిన అర్జున్ రెడ్డి, సోమవారం రాత్రి తిరిగి రాగా, పోలీసులు అదుపులోకి తీసుకుని CrPC 41A నోటీసులు అందించారు.
బాపట్ల జిల్లా రేపల్లెలో 41 మందికి సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.86 లక్షలు పంపిణీ చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ఖండించారు. జగన్ ఐదేళ్ల పాలనలో 5 కాలేజీలు కూడా కట్టలేకపోయారని, పీపీపీ విధానంలో రెండేళ్లలోనే నిర్మాణం సాధ్యమని అన్నారు.
టెక్ శంకర్ ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో మెజిస్టీరియల్ ఎంక్వయిరీ నిర్వహించనున్నారు అధికారులు. మధ్యాహ్నం శంకర్ ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి అధికారుల బృందం వెళ్లనుంది. అధికారులతో పాటు, శంకరు కుటుంబ సభ్యులు సైతం ఈ ప్రాంతానికి వెళ్లనున్నారు. ఈ విచారణ పూర్తిగా పోలీసు బందోబస్తు మధ్య జరగనుంది.
వికారాబాద్ జిల్లా రాకొండ గ్రామంలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి అర్జున్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పొత్తి కడుపుపై గాయాలైన అర్జున్‌ను ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో అర్జున్‌కు వస్తున్న ఆదరణను ఓర్వలేక రాజకీయ ప్రత్యర్థులే దాడి చేయించి ఉంటారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్యాపిటల్ హిల్ దాడి సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినందుకు బీబీసీపై ఆయన పరువు నష్టం దావా వేశారు. మియామిలోని ఫెడరల్ కోర్టులో వేసిన ఈ దావాలో, తన పరువుకు నష్టం కలిగించారంటూ 10 బిలియన్ డాలర్లు అనగా 90 వేల కోట్ల రూపాయలు నష్టపరిహారం డిమాండ్ చేశారు.
గోవా నైట్‌క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో నిందితులైన లూథ్రా సోదరులను థాయ్‌లాండ్ పోలీసులు నేడు భారత్‌కు అప్పగించారు. ఇండిగో విమానంలో ఢిల్లీకి చేరుకున్న వీరిని ఢిల్లీ, గోవా పోలీసుల సంయుక్త బృందం కస్టడీలోకి తీసుకుంది. విచారణ కోసం ట్రాన్సిట్ రిమాండ్‌పై గోవాకు తీసుకెళ్లనున్నారు. వీరిని బుధవారం మపుసా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
ఉద్యోగి రాజీనామా చేస్తే అతని గత సర్వీసు రద్దవుతుందని, అలాంటి వారు ఫ్యామిలీ పెన్షన్‌కు అనర్హులని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉద్యోగి చేసిన రాజీనామాను ఆమోదించిన DTC PF మాత్రమే వస్తుందని.. పెన్షన్ రాదని చెప్పింది. దీనిపై రిజైన్‌తో పెన్షన్ రాదు అని పేర్కొంది. ఉద్యోగులకు ఈ తీర్పొక హెచ్చరికగా పలువురి సూచన
కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ కేవలం 22 నిమిషాలు ఉండి, నిర్ణీత సమయం కంటే ముందుగా వెళ్లడంపై గందరగోళం జరిగింది. ఆగ్రహించిన అభిమానులు కుర్చీలను ధ్వంసం చేసి, వాటర్ బాటిళ్లు విసిరారు. ఈ ఘటనపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించారు. కోల్‌కతా గందరగోళానికి అసలు కారణం మెస్సీనే అని ఆరోపించాడు. తన నిబద్ధతను పాటించనందుకు మెస్సీ, అతడి పరివారమే అసలు దోషులని అన్నారు.
నటి మెహరీన్ తన పెళ్లి గురించి తప్పుడు ఆర్టికల్ రాసిన మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. తమకు పరిచయం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. తాను ఎవరినీ వివాహం చేసుకోలేదని, పెళ్లి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రపంచానికి తెలియజేస్తానని స్పష్టం చేశారు.