Drinks For Heart: ఆధునిక జీవనశైలి, ఒత్తిడి , ఆహారపు అలవాట్ల వల్ల నేడు గుండె జబ్బులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ధమనులలో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అయితే.. మనం తీసుకునే కొన్ని రకాల డ్రింక్స్ ఈ ధమనులను శుభ్రంగా ఉంచడంలో అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ధమనులలో అడ్డంకులను తొలగించి.. గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉంచే 5 అద్భుతమైన డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. దానిమ్మ జ్యూస్:
గుండె ధమనుల ఆరోగ్యానికి దానిమ్మ జ్యూస్ ఒక ‘సూపర్ డ్రింక్’ అని చెప్పవచ్చు. ఇందులో ఉండే అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ధమనులలో వాపున, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది ధమనుల గోడలు గట్టిపడకుండా చూస్తుంది. అంతే కాకుండా పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది. రోజుకు ఒక గ్లాసు తాజా దానిమ్మ రసం తాగడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
2. గ్రీన్ టీ:
గ్రీన్ టీలో ఉండే ‘కాటెచిన్స్‘ అనే సమ్మేళనాలు గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖ్యంగా EGCG అనే యాంటీ ఆక్సిడెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, ధమనులలో ఫలకం ఏర్పడకుండా అడ్డుకుంటుంది. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల మెటబాలిజం పెరగడమే కాకుండా హృదయ సంబంధిత వ్యాధులు దరిచేరవు.
3. బీట్‌రూట్ జ్యూస్:
బీట్‌రూట్‌లో సహజ సిద్ధమైన నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్ళాక నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను వ్యాకోచింపజేసి, రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది. దీని వల్ల ధమనులపై ఒత్తిడి తగ్గి, రక్తం గడ్డకట్టే ప్రమాదం తప్పుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ఒక దివ్యౌషధం.
4. పసుపు పాలు:
పసుపులో ఉండే ‘కర్కుమిన్‘ అనే పదార్థం సహజ సిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ధమనుల లోపలి పొరలలో వచ్చే వాపును తగ్గించడంలో పసుపు బాగా పనిచేస్తుంది. ఇది ధమనులు దెబ్బతినకుండా రక్షించి… కొవ్వు పేరుకుపోయే అవకాశాలను తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు చిటికెడు పసుపు కలిపిన పాలు తాగడం వల్ల గుండెతో పాటు కాలేయ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అంతే కాకుండా నిద్ర సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో కూడా పసుపు పాలు చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: ముల్లంగి తిన్న వెంటనే ఇవి తింటే చర్మ వ్యాధులు తప్పవు.. జాగ్రత్త!
5. మందార టీ:
మందార పూలతో చేసే టీ కేవలం రుచికరమైనదే కాదు, గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ , కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. మందార టీ సహజంగా రక్తపోటును తగ్గిస్తుంది. ఇది కిడ్నీల పనితీరును మెరుగు పరుస్తూ శరీరంలోని అనవసర వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడే వారు తరచుగా దీనిని తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.