Food: ఆహారాన్ని వండడం వల్ల దాని రుచి పెరుగుతుంది. అంతే కాకుండా జీర్ణ క్రియ సులభమవుతుంది. అయితే..కొన్ని రకాల ఆహార పదార్థాలను పచ్చిగా తిన్నప్పుడే వాటిలోని పోషకాలు, ఎంజైములు, ఆరోగ్య ప్రయోజనాలు పూర్తి స్థాయిలో మన శరీరానికి అందుతాయి. వంట చేయడం వల్ల అధిక ఉష్ణోగ్రతలకు పోషకాలు ముఖ్యంగా విటమిన్ సి, బి విటమిన్లు నశించిపోతాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు పచ్చిగా తినడం వల్లనే.. పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. పచ్చిగా తినాల్సిన ఆహారాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చిగా తినాల్సిన ఆహారాలు :
1. ఆకుపచ్చని కూరగాయలు:
పాలకూర, మెంతి ఆకు,తోటకూర వంటి ఆకుకూరలను పచ్చిగా సలాడ్స్‌లో లేదా స్మూతీస్‌లో తీసుకోవడం ఉత్తమం.
ప్రయోజనం: వీటిలో విటమిన్ సి, ఫోలేట్ (B9) అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు వేడి చేసినప్పుడు సులభంగా నశించిపోతాయి. పచ్చి ఆకుకూరలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
2. ఉల్లిపాయలు & వెల్లుల్లి:
ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూరల్లో వేసి వండుతాం. కానీ.. వీటిని పచ్చిగా తీసుకుంటేనే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
ప్రయోజనం: పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ బయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వండినప్పుడు అల్లిసిన్ నాశనమవుతుంది. అలాగే.. ఉల్లిపాయలలోని సల్ఫర్ సమ్మేళనాలు రక్తపోటును తగ్గించడంలో సహాయ పడతాయి.
3. కాయధాన్యాలు & మొలకలు:
పెసలు, శనగలు వంటి వాటిని మొలకెత్తించి పచ్చిగా తినడం అత్యంత ఆరోగ్యకరమైన పద్ధతి.
ప్రయోజనం: మొలకల్లో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైములు అధికంగా ఉంటాయి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తినడం మంచిది. వండడం వల్ల ఈ ఎంజైములు క్రియారహితమవుతాయి. మొలకల్లో ప్రోటీన్, ఫైబర్, బి విటమిన్లు అధిక మోతాదులో ఉంటాయి.
4. బెల్ పెప్పర్స్:
వివిధ రంగుల క్యాప్సికమ్‌లలో (ముఖ్యంగా ఎరుపు, పసుపు) విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ప్రయోజనం:విటమిన్ సి అత్యంత సున్నితమైన పోషకం. కొద్దిపాటి వేడికి కూడా ఇది నశించిపోతుంది. కాబట్టి. బెల్ పెప్పర్స్‌ను పచ్చిగా సలాడ్స్‌లో లేదా ఇతర వంటకాలపై అలంకరణగా ఉపయోగించడం ద్వారా పూర్తి విటమిన్ సి పొందవచ్చు.
5. కొబ్బరి నూనె:
కొన్నిరకాల నూనెలను అధిక వేడికి గురిచేయకుండా పచ్చిగా తీసుకోవడం మంచిది.
ప్రయోజనం: కొబ్బరి నూనెలో ముఖ్యంగా మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. వీటిని వండడం కంటే.. పచ్చిగా తీసుకోవడం వల్ల జీవ క్రియ మెరుగు పడుతుంది. అంతే కాకుండా శక్తి పెరుగుతుంది. దీన్ని స్మూతీస్‌లో లేదా కాఫీలో కలుపుకొని తీసుకోవచ్చు.
6. నట్స్, & డ్రై ఫ్రూట్స్:
బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటివి.
ప్రయోజనం: వీటిని కాల్చడం లేదా వేయించడం వల్ల వాటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ గింజలను నానబెట్టి లేదా పచ్చిగా తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ ఇ వంటి పోషకాలు సంపూర్ణంగా లభిస్తాయి.
7. బీట్రూట్ :
బీట్రూట్‌ను కొందరు వండి తింటారు. కానీ పచ్చిగా తీసుకోవడం చాలా మంచిది.
ప్రయోజనం: పచ్చి బీట్రూట్‌లో నైట్రేట్‌ల అధికంగా ఉంటాయి. ఈ నైట్రేట్‌లు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వండడం వల్ల ఈ నైట్రేట్‌లు గణనీయంగా తగ్గుతాయి.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. అజీర్ణ సమస్యలు దూరం !
పచ్చి ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విషయం. అయితే.. గర్భిణీలు లేదా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ లేదా పోషకాహార నిపుణుల సలహా మేరకు మాత్రమే పచ్చి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఏ ఆహారాన్ని అయినా తినే ముందు శుభ్రంగా కడగడం, నాణ్యతను పరీక్షించడం చాలా అవసరం. సమతుల్య ఆహారం కోసం వండిన, పచ్చి ఆహారాలను కలిపి తీసుకోవడం మంచి మార్గం.