Symptoms Of Liver Failure: కాలేయం మన శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం. ఇది రక్తాన్ని శుద్ధి చేయడం, జీర్ణక్రియకు సహాయపడటం, శక్తిని నిల్వ చేయడం వంటి అనేక పనులను చేస్తుంది. కాలేయ సమస్యలు ఎదురైనప్పుడు, శరీరం అనేక సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. రాత్రి సమయంలో కనిపించే కాలేయ సమస్యల వల్ల ఎదురయ్యే లక్షణాలు, వాటి వెనక ఉన్న కారణాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిద్రలేమి:
కాలేయ సమస్యలతో బాధ పడేవారిలో నిద్రలో మార్పులు రావడం ప్రాథమిక లక్షణం. దీనిని “స్లీప్-వేక్ సైకిల్ రివర్సల్” అని పిలుస్తారు. అంటే వీరికి పగటి పూట నిద్ర వస్తుంది. కానీ రాత్రిపూట అస్సలు నిద్ర పట్టదు. కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు మెదడులో మెలటోనిన్ వంటి హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడమే దీనికి కారణం.
2. తీవ్రమైన దురద:
రాత్రిపూట పడుకున్నప్పుడు శరీరం అంతా విపరీతంగా దురద పెట్టడం కాలేయ వ్యాధికి ఒక ముఖ్యమైన సంకేతం. కాలేయం విఫలమవుతున్నప్పుడు.. అది పైత్య రసాన్ని సరిగ్గా విసర్జించలేదు. దీని వల్ల రక్తంలో బిలిరుబిన్, బైల్ సాల్ట్స్ పేరుకుపోతాయి. రాత్రి పూట శరీర ఉష్ణోగ్రత మారడం వల్ల ఈ దురద మరింత తీవ్రంగా మారుతుంది. ఇది నిద్రను కూడా పాడు చేస్తుంది.
3. పొత్తికడుపులో అసౌకర్యం, వాపు :
కాలేయం దెబ్బతిన్నప్పుడు పొత్తి కడుపులో నీరు చేరుతుంది. దీనిని ‘అస్సైటిస్’ అంటారు. పగటి పూట తిరగడం వల్ల ఇది అంతగా తెలియకపోవచ్చు. కానీ రాత్రి నిద్ర పోవడానికి పడుకున్నప్పుడు, ఆ ద్రవం పొట్టపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవ్వడం లేదా పక్కకు తిరిగి పడుకోవడం ఇబ్బందిగా మారవచ్చు.
4. వికారం, రాత్రిపూట ఆకలి మందగించడం:
కాలేయ వైఫల్యం ఉన్నవారికి రాత్రి వేళల్లో వికారం కలిగే ప్రమాదం కూడా ఉంటుంది . శరీరంలో అమ్మోనియా వంటి విష పూరిత పదార్థాలు పేరుకు పోవడం వల్ల ఈ అనుభూతి కలుగుతుంది. దీని వల్ల రాత్రి భోజనం చేయాలనిపించదు లేదా తిన్నాక వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది.
5. గందరగోళం, మానసిక స్థితిలో మార్పులు:
కాలేయం రక్తాన్ని శుద్ధి చేయలేనప్పుడు, రక్తంలోని టాక్సిన్స్ నేరుగా మెదడుకు చేరుతాయి. దీనిని ‘హెపాటిక్ ఎన్సెఫలోపతి’ అంటారు. రాత్రి పూట అకస్మాత్తుగా గందరగోళానికి గురవ్వడం, మతి మరుపు, మాట తడబడటం లేదా వింతగా ప్రవర్తించడం వంటివి జరిగితే అది కాలేయ వైఫల్యానికి తీవ్రమైన సంకేతం.
Also Read: నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు !
6. యూరిన్ రంగు మారడం:
రాత్రి నిద్ర పోయే ముందు లేదా ఉదయం నిద్ర లేవగానే మూత్రం ముదురు పసుపు లేదా గోధుమ రంగులో (టీ రంగు) రావడం కాలేయం దెబ్బతిన్నదనడానికి సూచన. రక్తంలో అధిక బిలిరుబిన్ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది.
జాగ్రత్తలు, సూచనలు:
పైన పేర్కొన్న లక్షణాలు ఒకట్రెండు రోజులు కనిపిస్తే.. కంగారు పడక్కర్లేదు. కానీ ఇవి క్రమం తప్పకుండా కనిపిస్తుంటే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
ముఖ్యంగా..
మద్యపానానికి దూరంగా ఉండాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
అధిక బరువును తగ్గించుకోవాలి.
క్రమం తప్పకుండా కాలేయ పనితీరు పరీక్షలు (LFT – Liver Function Test) చేయించుకోవాలి.