Fatty Liver Healing Fruits| నేటి వేగవంతమైన జీవనశైలి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జంక్ ఫుడ్, తక్కువ నిద్ర, వ్యాయామం లేకపోవడం వంటి అలవాట్లు ఫ్యాటీ లివర్ సమస్యకు కారణమవుతున్నాయి. మద్యం సేవించే వారికే ఈ సమస్య వస్తుందని చాలామంది గతంలో భావించేవారు. అయితే, మద్యం తాగని వారిలో కూడా ప్రస్తుతం ఫ్యాటీ లివర్ సమస్య కనిపిస్తోంది.
ఫ్యాటీ లివర్ కండీషన్‌ని వైద్యపరిభాషలో మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ లేదా MASLD అని అంటారు. టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, అధిక రక్తపోటు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల కాలేయం క్రమంగా దెబ్బతింటుంది. చివరకు ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలి లివర్ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఆరోగ్యం కోసం ఆహారంలో భాగంగా మంచి పండ్లు తినాలి. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ సూచించిన కొన్ని పండ్లు కూడా ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
యాపిల్‌లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది. యాపిల్‌ను రోజువారీ స్నాక్‌గా తీసుకోవచ్చు. కొద్దిగా నట్స్‌తో కలిపి తింటే మరింత పోషకమైన స్నాక్‌గా మారుతుంది.
కివీలో ఫైబర్ అధికంగా ఉంటుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది ఉపయోగకరమైన పండుగా భావిస్తారు. కివీని సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. బాగా కడిగిన తర్వాత కొందరు దీనిని తొక్కతో కూడా తింటారు.
రాస్ప్‌బెర్రీలో డైటరీ ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్ లేదా ఓట్‌మీల్‌తో కలిపి తినడం మంచిది. అదనంగా చక్కెర వేయకుండా తింటే ఆరోగ్యకరమైన ఎంపికగా ఉంటుంది.
దానిమ్మలో అనేక పోషకాలు ఉంటాయి. దానిమ్మ గింజలను నేరుగా లేదా సలాడ్‌లో కలిపి తినడం మరింత ఆరోగ్యకరం. ఇది ఆరోగ్యకరమైన ఆహారానికి బోనస్‌గా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా దానిమ్మ ఉపయోగకరంగా ఉంటుంది.
అవకాడోలో ఫైబర్ ఎక్కువగా, సహజ చక్కెర తక్కువగా ఉంటుంది. దీనిని అల్పాహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. టోస్ట్‌పై అధికంగా బటర్ లేదా చీజ్ ఉపయోగించడానికి బదులుగా అవకాడో ఉపయోగించవచ్చు. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌ను అందిస్తుంది.
Also Read: జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా? కండరాలు నిజంగా పెరుగుతున్నట్లు సూచించే 5 సంకేతాలివే
పియర్‌లో మంచి మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా తొక్కతో తింటే ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. పియర్‌ను బాగా కడిగి తొక్కతో తినవచ్చు. ఇది జీర్ణక్రియతో పాటు పూర్తి ఆరోగ్యానికి సహాయపడుతుంది.
బ్లూబెర్రీలో ఫైబర్, ప్రయోజనకరమైన మొక్కల పోషకాలు ఉంటాయి. తాజా బ్లూబెర్రీతో పాటు ఫ్రోజన్ బ్లూబెర్రీని కూడా తీసుకోవచ్చు. దీన్ని యోగర్ట్, ఓట్‌మీల్ లేదా స్మూతీలో కలిపి తినాలి.
Also Read: మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్
ఈ పండ్లు మాత్రమే ఫ్యాటీ లివర్‌ను నయం చేయలేవు. అయితే, సమతుల్యమైన, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువు ఆరోగ్యంగా కంట్రోల్ ఉంచుకోవడం, సరైన నిద్ర కూడా చాలా ముఖ్యం. ఫ్యాటీ లివర్ ఉన్నవారు వైద్యుల సలహా ప్రకారం వ్యక్తిగత ఆహార ప్రణాళికను పాటించాలి.