River Clean Boy Bittu Tabahi| మన దేశంలో చాలా మంది ఇంటి పరిశుభ్రతకు ఇచ్చే ప్రాధాన్యం నగర పారిశుధ్యానికి ఇవ్వరు అనేది చేదు నిజం. భారతదేశంలోని చాలా నగరాలు, పట్టణాలు మురికి కూపాలను తలపిస్తున్నాయి. చాలా నదులు, సరస్సులు మానవుల నిర్లక్ష్య ధోరణి కారణంగానే మురికితో నిండిపోతున్నాయి. ఇదంతా చూసి ఒక యువకుడు ఒక మురికి నదిని క్లీన్ చేయాలని సంకల్పించాడు. అధికారులు చర్యలు తీసుకుంటారని ఎదురుచూడకుండా చేతిలో ఉన్న కొద్దిపాటి సామగ్రితో నదిని శుభ్రం చేయడం ప్రారంభించాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ యువకుడి వీడియోలు బాగా వైరల్ అవుతుండడంతో ఒక అంతర్జాతీయ కంపెనీ అతని ఉద్యోగం ఆఫర్ చేసింది.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన సురేంద్ర సింగ్ చౌదరి ఇప్పుడు ‘బిట్టు తబాహీ’గా సోషల్ మీడియాలో గుర్తింపు పొందుతున్నాడు. ఆయన చేసిన నది శుభ్రత కార్యక్రమం నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ సంస్థ దృష్టిని ఆకర్షించింది.
బిట్టు తబాహీ మధ్యప్రదేశ్‌లోని బియోరా ప్రాంతానికి చెందిన యువకుడు. అతను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులు పేదవారు. అజ్నార్ నది పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను చూసి బిట్టు తీవ్రంగా కలత చెందాడు. నదిలో ప్లాస్టిక్, నాచు, బురద, ఇతర వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. అక్కడి దుర్వాసన స్థానికులకు కూడా ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా స్థానిక ఆలయం సమీపంలోని నది పరిస్థితి చూసి అతను మరింత ఆందోళనకు గురయ్యాడు.
2026 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిట్టు తన నది శుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించాడు. మొదట కొంతమంది స్నేహితులు ఆయనకు సహాయం చేశారు. కానీ తర్వాత అతడు ఈ పనిని ఒంటరిగానే కొనసాగించాల్సి వచ్చింది. శుభ్రత కోసం అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు తన సొంత డబ్బును ఖర్చు చేశాడు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కేఆర్ టాక్స్ ప్రకారం.. ఇప్పటివరకు సుమారు రూ.30,000 ఖర్చు చేశాడు. బిట్టు తన పనిని వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. ఆ వీడియోల్లో బిట్టు.. నదిలోని ప్లాస్టిక్, నాచు, ఇతర వ్యర్థాలను తొలగించడం కనిపించింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో అతడి ప్రయత్నం దేశవ్యాప్తంగా చాలామంది దృష్టిని ఆకర్షించింది.
నది శుభ్రం చేసే సమయంలో బిట్టు అనేక ప్రమాదాలను ఎదుర్కొన్నాడు. అతని వద్ద సరైన భద్రతా పరికరాలు కూడా అందుబాటులో లేవు. అంతేకాకుండా బిట్టుకు ఈత కూడా రాదని సమాచారం.
ఈ పనివల్ల అతనికి చేతులు, కాళ్లలో ఇన్ఫెక్షన్లు, చర్మంపై దురద వంటి సమస్యలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు నదిలో పాములు కూడా కనిపించేవని బిట్టు తెలిపాడు. కొంతమంది అతని సోషల్ మీడియా ప్రచారం కోసం ఈ పని చేస్తున్నాడని విమర్శించారు. అయితే ఆ విమర్శలను పట్టించుకోకుండా బిట్టు తన పని కొనసాగించాడు.
బిట్టు చేసిన నది శుభ్రత పని నెదర్లాండ్స్‌కు చెందిన ది ఓషన్ క్లీనప్ సంస్థ వ్యవస్థాపకుడు బోయన్ స్లాట్ దృష్టికి వెళ్లింది. బిట్టు పనికి సంబంధించిన పోస్టును బోయన్ ఎక్స్‌లో చూశారు. ఆ పోస్టులో నదిని శుభ్రం చేయడానికి బిట్టు నెలలుగా చేస్తున్న కృషిని వివరించారు. అలాగే నది శుభ్రం చేయడానికి ముందు, చేసిన తర్వాత తీసిన ఫొటోలను కూడా చూపించారు.
బిట్టు అంకితభావానికి ముగ్ధుడైన బోయన్ స్లాట్ అతడిని తమ సంస్థలో పనిచేయాలని ఆహ్వానించారు. ఈ ఒక్క ఆహ్వానం బిట్టు స్థానిక స్థాయి ప్రయత్నాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది.
Also Read: వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్
దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. బిట్టు తబాహీ నది శుభ్రత ప్రయత్నాన్ని ప్రశంసించారు. సోషల్ మీడియా లైకుల కోసం చేసినా, అది మంచి పనికి ఉపయోగపడితే తప్పేమీ లేదన్నారు. బిట్టు పట్టుదలను మెచ్చుకుంటూ, అతడిని తన “మండే మోటివేషన్”గా అభివర్ణించారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా బిట్టు ప్రయత్నాన్ని గుర్తించారు. ఆయన బిట్టును సీఎం నివాసానికి ఆహ్వానించి అభినందించారు. అలాగే బిట్టుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి
బిట్టు తబాహీ కథ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని గుర్తుచేస్తోంది. పెద్ద వనరులు లేకపోయినా పట్టుదలతో మార్పు తీసుకురావచ్చని ఆయన నిరూపించారు.
నదులను శుభ్రంగా ఉంచడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. ప్రతి పౌరుడు తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బాధ్యత తీసుకోవాలి. బిట్టు ప్రయత్నం మరెంతో మందిని పర్యావరణ పరిరక్షణ వైపు నడిపిస్తుందని ఆశిద్దాం.