Guava Fruits: చలికాలం మెల్ల మెల్లగా మొదలవుతోంది.. ఈ కాలంలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో జామపండ్లు పెద్ద మొత్తంలో లభిస్తాయి. ఈ పండులో సోడియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే జామపండుని ‘పోషకాల గని’ అని కూడా పిలుస్తారు. కాబట్టి.. దీనిని సూపర్ ఫుడ్‌గానూ పరిగణిస్తారు. జామ జీర్ణ సమస్యలు, శారీరక బలహీనతను తగ్గిస్తుంది. దాని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హానికరమైన కణాల నుంచి సంరక్షిస్తాయి. ఫలితంగా అనేక తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు. అయితే,
పోషకాల పవర్ హౌస్ అయిన ఈ జామపండు కొంతమందికి హాని చేస్తాయి. వీటిని అలాంటి వాళ్లు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. జామపండ్లను ఎలాంటి వారు తీసుకోకూడదంటే..
జామపండుపై ఉండే రసాయనాలు అలెర్జీ సమస్యల్ని కలిగిస్తాయి. కాబట్టి.. అలర్జీ సమస్యలున్న వారు జామను తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. ఇప్పటికే చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు జామను ఎక్కువగా తీసుకుంటే.. చర్మంపై దుద్దర్లు, మంట, వాపు వంటి లక్షణాలు కనిపించే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు జామపండును మితంగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు జామపండును ఎక్కువగా తినకూడదట. పైగా శీతాకాలంలో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు జామపండును ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే.. జామపండు జీర్ణమవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి.. జీర్ణక్రియ వేగంగా లేనివారు జామపండును మితంగా తీసుకోవాలి. పైగా పొట్ట ఉబ్బరం, విరేచనాలు, గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు జామపండును అస్సలే తినకూడదు.
చలికాలంలో జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారు రాత్రిపూట జామను తినకపోవడమే మంచిది. జామలోని విత్తనాలు, ఫైబర్ జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తాయి. పైగా జామ జలుబు స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి.. చలికాలంలో అధికంగా తీసుకుంటే గొంతు నొప్పి, జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు ఎక్కువ. జామలో విటమిన్ సి, ఫ్రక్టోజ్ అధికంగా ఉండటంతో.. ఇది జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
జామపండ్లను గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే అమ్మలు తినకపోవడమే ఉత్తమం. జామ పండులో, ఆకులలో ఉండే రసాయనాలు కొన్ని సందర్భాల్లో చర్మంపై చికాకు కలిగిస్తాయి. ఎగ్జిమా వంటి చర్మ సంబంధిత సమస్య ఉన్నవారిలో ఇది ఎక్కువగా జరుగుతుంది. వీళ్లు కూడా జామ పండు తినే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఒకవేళ పోషకాల కోసం గర్భిణులు జామ తీసుకోవాల్సి వస్తే.. వైద్యుల సలహా మేరకు తీసుకోవచ్చు. అయితే, ఇప్పటికే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు జామపండుకు దూరంగా ఉండాలి.